ఉత్తుత్తి కిట్లే!

ABN , First Publish Date - 2022-07-06T07:02:38+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా జగనన్న విద్యా దీవెన కిట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం 2020లో ప్రక టించింది.

ఉత్తుత్తి కిట్లే!
కోటనందూరులో కిట్‌ పేరుతో బ్యాగుల పంపిణీ

జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ అరకొర

తొలిరోజు కొందరికే బ్యాగులు, బెల్ట్‌లు.. 

అదీ ఫొటోల కోసం ఇచ్చి మళ్లీ వెనక్కి 

జిల్లాకు పూర్తిగా చేరుకోని కిట్లు కేవలం బ్యాగులు, బెల్టులే రాక.. 

పుస్తకాలు, యూనిఫాంలు ఏవీ..

1,90,630 మందికి విద్యాకానుక కిట్లు అవసరం

కిట్లో ఏడు వస్తువులు ఎన్ని నెలలకు చేరుతాయో తెలియక ఉపాధ్యాయుల్లో అయోమయం

వచ్చిన బ్యాగులు ఈసారీ నాసిరకమే

గతేడాదీ కిట్ల పేరుతో ఒక్కో వస్తువు  ఒక్కో నెల పంపిణీ.. ఈసారి ఏమిటో..


జగనన్న విద్యాకానుక కిట్లు జిల్లాలో ఉత్తుత్తి కిట్లుగా మారాయి.   పాఠశాలలు తెరిచిన రోజున వీటిని పంపిణీ చేశామనే ప్రచారం కోసం ప్రభుత్వం దీన్ని ప్రారంభించినా ఎక్కడా విద్యార్థులకు ఇవి అందనే లేదు.  కేవలం సీఎం జగన్‌ మంగళవారం ఈ పథకాన్ని ప్రారంభించడంతో అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా కిట్లు పంచామని గొప్పలు చెప్పడం కోసమే తంతు నడిపారు. అందులో భాగంగా జిల్లాలో మంగళవారం కిట్ల పంపిణీ ఉత్తుత్తిగా మొదలుపెట్టారు. మండలాల్లో ఒక్కో పాఠశాలకు పది బ్యాగులు, పది టైలు పంపించిన అధికారులు వాటినే తల్లిదండ్రులకు ఫొటోల కోసం పంపిణీ చేశారు. ఆనక మళ్లీ వెనక్కు తీసేసుకున్నారు. జిల్లాలో 1,90,631 మందికి ఏడు వస్తువులతో కూడిన కిట్లు పంచాల్సి ఉండగా కేవలం బ్యాగులు, టైలే వచ్చాయి. మిగిలినవి రాక ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు.


(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు ఉచితంగా జగనన్న విద్యా దీవెన కిట్లు ఇస్తున్నట్టు ప్రభుత్వం 2020లో ప్రక టించింది. అప్పటి నుంచి ఏటా వేసవి సెలవుల తర్వాత పాఠశాలలు తెరుచుకునే సమయంలో ప్రతి పాఠశాలలో విద్యార్థులకు వీటిని అందించాలనేది పథకం ఉద్దేశం. అందులోభాగంగా ఒకటో తరగతి నుంచి పదోతరగతి చదువుకుంటున్న ప్రతి విద్యార్థికి మూడు జతల యూనిఫాం, రెండుజతల సాక్సులు, జత షూ, నోటు పుస్తకాలు (ఆరో తరగతి నుంచి), బెల్టు, బ్యాగు, డిక్షనరీ ఇవ్వాల్సి ఉంది. మొ త్తం ఏడు వస్తువులకు కలిపి ఒక్కో కిట్‌ ధర రూ.1,350. ఈ ఏడాది ఈ పథకాన్ని మంగళవారం సీఎం జగన్‌ కర్నూలు నుంచి ప్రారం భించారు. అదే సమయంలో జిల్లాల్లోను కిట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.


దీంతో కాకినాడ జిల్లాలో 1,90,631 మందికి వీటిని పంపిణీ ప్రారంభించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో ఈ కిట్లు జిల్లాకు అసలు చేరలేదు. కేవలం బ్యాగులు, టైలు మాత్రమే పూర్తి స్థాయిలో జిల్లా కేంద్రానికి వచ్చాయి. యూనిఫారాలు, నోటు పుస్త కాలు సగం కూడా రాలేదు. దీంతో పథకం ప్రారంభం రోజు కిట్లు ఇవ్వకపోతే పరువుపోతుందనే కారణంతో మండలాల్లోని ఒక్కో స్కూ లుకు కిట్లు పేరుతో పది మంది విద్యార్థులకు మాత్రమే సరిపోయేవి అధికారులు పంపించారు. వీటినే స్థానిక వైసీపీ ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేస్తున్నట్టు ఫోటోలు తీయించారు. ఆనక వెంటనే వాటిని అధికారులు వెనక్కు తీసేసుకున్నారు. దీంతో తల్లిదండ్రులు అవాక్కయ్యారు.


కిట్లు పూర్తి స్థాయిలో రానందున అవన్నీ వచ్చాక కబురు పంపుతామని చెప్పి వీరిని పంపించేశారు. వాస్తవానికి జగనన్న విద్యా కానుక పథకం ప్రారంభం రోజునాటికి కిట్‌లో ఏడు వస్తువులు ఎప్పుడూ అందడం లేదు. గతేడాది సీఎం జగన్‌ ముమ్మి డివరం పర్యటనలో పథకాన్ని ప్రారంభించగా అప్పుడు కూడా కిట్లు ఎవరికీ అందలేదు. వాస్తవానికి కిట్‌ అంటే అన్ని వస్తువులతో కలిపి ఇవ్వడం. కానీ రెండు లేదా మూడు వస్తువులను మాత్రమే పంపిణీ చేస్తున్నారు. ఈసారీ అదే పరిస్థితి. కేవలం బ్యాగులు, టైలు మాత్రమే ఇస్తే తల్లిదండ్రుల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో వీటిని ఇవ్వడం లేదు.


దీంతో జిల్లాలో విద్యాకానుక కిట్లు ఎప్పటికి అందుతాయో తెలియని పరిస్థితి. బ్యాగులు, టైలు మినహా మిగిలిన వాటిని కాంట్రాక్టర్లు ఎప్పుడు సరఫరా చేస్తారో కూడా జిల్లా సర్వశిక్ష అభియాన్‌ అధికారులకు తెలియడం లేదు. దీంతో ఉన్నవాటినే అర కొరగా పంపిణీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈనేపథ్యంలో కిట్‌లో ఏడు వస్తువులు పూర్తిస్థాయిలో జిల్లాకు చేరడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉండడంతో ఉన్న బ్యాగులు, టైలు, అరొకర యూనిఫారం మాత్రమే త్వరలో పంపిణీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. వాస్తవానికి ఆయా స్కూళ్లలో వీటిని తల్లిదండ్రులకు పంపిణీ చేసే ముందు విద్యాశాఖకు చెందిన విద్యాకానుక యాప్‌లో విద్యార్థి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఏయే ఐటంలు ఇచ్చారు? ఏవి  ఇవ్వలేదు? తదితర వివరాలు యాప్‌లో నమోదు చేయాలి.


కానీ పథకం ప్రారం భం రోజు మంగళవారం జిల్లాలో ఎక్కడా ఈ యాప్‌ పనిచేయకుండా మొరా యించింది. దీంతో ఇచ్చిన వస్తువులు వెనక్కు తీసుకోవడానికి ఇదీ ఓ కారణమని చెబుతున్నారు. అరకొర వస్తువులను కిట్‌ పేరుతో పంపిణీ చేసినా మిగిలిన వస్తు వుల కోసం మళ్లీ తల్లిదండ్రులను రప్పించుకుని అథెంటికేషన్‌ నమోదు చేయాల్సి ఉంది. ఇలా రెండుసార్లు తల్లిదండ్రులను పాఠశాలలకు రప్పించాల్సి ఉంది. 

ఆరునెలలైనా మన్నుతాయా..

విద్యాకానుకలో భాగంగా పంపిణీ చేసే బ్యాగులు నాసిరకంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది కంటే ఈసారి బ్యాగుల సైజ్‌ తగ్గిపోయింది. మన్నిక కూడా బాగోలేదని లాంఛనంగా వీటిని తీసుకున్న తల్లిదండ్రులు చెబు తున్నారు. దీంతో ఆరు నెలలైనా ఇవి మన్నుతాయా? అనే అనుమానాలు వ్యక్తమ వుతున్నాయి. ఇవన్నీ ప్రభుత్వ పెద్దలే నేరుగా అమరావతి నుంచి టెండర్లు ఖరా రు చేస్తుండడంతో నాణ్యతపై ఇక్కడ జిల్లా అధికారులు నోరు మెదపలేకపోతు న్నారు. గతేడాది షూ పంపిణీ దారుణంగా ఉంది. లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించి కొలతలు సరిపోకపోవడం ఒకెత్తయితే అటువి ఇటు ఇటువి అటు మారిపోయాయి. అనేక స్కూళ్లకు ఒకే కాలువి రెండేసి వచ్చాయి. దీంతో లక్షకు పైగా షూలను అధికారులు వెనక్కు పంపేశారు. ఈసారి కూడా పరిస్థితిపైనా  అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కిట్‌లో భాగంగా ప్రభుత్వం మూడు జతల యూనిఫాం వస్త్రాలు ఇస్తోంది. వీటికి కుట్టుకూలి డబ్బులు తల్లుల ఖాతాలో వేస్తామని చెబుతోంది. తీరా గతేడాది ఈ డబ్బులు పూర్తిగా వేయలేదు. దీంతో జగనన్న విద్యాకానుక కాస్తా ఉత్తుత్తి కానుకగా మారుతోంది. 


హాజరు పలుచన...

పాఠశాలలు మంగళవారం తెరుచుకున్నప్పటికి హాజరు మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. పిఠాపురం, గొల్లప్రోలు పట్టణాలతోపాటు మండలాల పరిధిలో పాఠశాలలుకు 20 నుంచి 25 శాతం విద్యార్థులు మాత్రమే హాజరయ్యారు. వర్షం పడడంతో విద్యార్థులు తక్కువగా వచ్చినట్టు చెబుతున్నారు. తొలిరోజు విద్యార్థులకు ఎక్కడా విద్యాకానుక అందించలేదు. ప్రజాప్రతినిధుల ద్వారా పంపిణీ చేయాలనే ఆదేశాలుండడంతో వారితో పంపిణీ చేయిస్తామని విద్యాశాఖాధికారులు తెలిపారు.


మళ్లీ బడికి..

కొత్త విద్యా సంవత్సరం మొదలైంది. పిల్లలు బడుల వైపు పరుగులు తీశారు. ఈసారి రెండు నెలల తర్వాత పాఠశాలలు తెరుచుకున్నాయి. కొవిడ్‌ కారణంగా అంతకుముందు రెండు విద్యా సంవత్సరాల్లో అతలాకుతలమైన విద్యారంగం, గత ఏడాది కూడా ఆరంభంలో భయపెట్టి తర్వాత కుదుటపడింది. ఈ ఏడాది మాత్రం కాస్త ఆలస్యంగానైనా, సజావుగా విద్యా సంవత్సరం మొదలైందనుకోవాలి. 


తొలి రోజే.. తడబడి

పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ముందుగానే అధికారులు ఎంతో కసరత్తు చేసి ఉంటారుకాబట్టి తొలి రోజంతా సందడి సందడిగా సాగిపోవాలి. పిల్లల కేరింతలు,    ఉపాధ్యాయుల తొలి పలుకులతో ఉత్సాహవంతమైన వాతావరణం వెల్లివిరియాలి. ఇలా శుభారంభం కావాల్సిన రోజున కొన్ని తడబాట్లు తప్పలేదు. అంతా రెడీ అని చెబుతూ వస్తున్న విద్యా కానుక కిట్లు ఏదో ఇచ్చామన్నట్టు నలుగురికో అయిదుగురికో ఇచ్చారు. అవీ అరకొరగానే. కొన్నిచోట్ల సమయానికి మధ్యాహ్న భోజనం వేళకు రాలేదు. పిల్లలు ఆకలిలో నకనకలాడారు. కొందరు టీచర్లు బిస్కెట్లు తెప్పించి పంచారు. కొన్నిచోట్ల హాజరు కూడా పలుచగానే  ఉంది. మరి ఏమి కసరత్తు చేశారో.. అధికారులకే తెలియాలి.


టీసీలు  తీసుకుపోయిన తల్లిదండ్రులు

తాళ్లరేవు పంచాయతీ రంగనాయకపురం మండల ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలను తీసుకుపోవడంతో పాఠశాల ఖాళీ అయ్యింది. ప్రస్తుతం ముగ్గురంటే ముగ్గురే విద్యార్థులు ఉన్నారు. గతంలో ఇక్కడ 41 మంది విద్యార్థులుండగా టీచరు ఒక్కరే పనిచేసేవారు. విద్యార్థుల తల్లిదండ్రులు రెండో టీచరును నియమించాలని కోరినా ఫలితం లేదు. దీంతో తల్లిదండ్రులు తమ పిల్లల టీసీలు తీసుకుని ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పైగా శిథిలమైన భవనంలో పాఠశాల ఉండడం కూడా మరో కారణం.

Updated Date - 2022-07-06T07:02:38+05:30 IST