Americaలో హాట్ టాపిక్‌గా మారిన సుప్రీం కోర్టు నిర్ణయం.. ఒకవేళ అదే జరిగితే Trigger Laws తిరిగి అమల్లోకి!

ABN , First Publish Date - 2022-05-06T01:05:22+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. సుప్రీం కోర్టు తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 1973లో ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

Americaలో హాట్ టాపిక్‌గా మారిన సుప్రీం కోర్టు నిర్ణయం.. ఒకవేళ అదే జరిగితే Trigger Laws తిరిగి అమల్లోకి!

ఇంటర్నెట్ డెస్క్: అగ్రరాజ్యం అమెరికాలో ప్రజలు రోడ్డెక్కుతున్నారు. సుప్రీం కోర్టు తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. 1973లో ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా.. ప్రజలు అంతగా నిరసనలు చేసే విధంగా సుప్రీం కోర్టు ఏం నిర్ణయం తీసుకుంది? 1973లో సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఏంటి? అసలు ఈ గొడవ ఏంటి అనే వివరాల్లోకి వెళితే.. 


టెక్సాస్‌కు చెందిన జానే రాయ్(Jane Roe) అనే మహిళ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మూడోసారి గర్భం దాల్చింది. అయితే ఒంటరిగా జీవిస్తున్న ఆమె.. మరో బిడ్డకు జన్మనిచ్చేందుకు ఇష్టపడలేదు. ఈ క్రమంలోనే అబార్షన్ చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది. అయితే అందుకు అక్కడి చట్టాలు ఆమెను అనుమతించలేదు. తల్లి ప్రాణాలకు ప్రమాదమైన సమయంలో మాత్రమే అబార్షన్‌కు అనుమతిచ్చే విధంగా చట్టాలు ఉండటంతో ఆమె కీలక నిర్ణయం తీసుకుంది. డల్లాస్ అటార్నీ జనరల్ హెన్నీ వాడే( Henry Wade)కు వ్యతిరేకంగా దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. Roe v. Wade అని పిలిచే కేసులో 1973లో కీలక తీర్పు ఇచ్చింది. గోప్యతా హక్కు అబార్షన్‌కు కూడా వర్తిస్తుందని పేర్కొంటూనే గర్భస్రావాల అంశంపై మహిళలకు అనుకూలంగా తీర్పు వెల్లడించింది. దీంతో దాదాపు 13 రాష్ట్రాల్లో అబార్షన్‌ను చట్టవిరుద్ధమని పేర్కొన్న చట్టాలు(Trigger Laws) క్రియాశీల స్థితిని కోల్పోయాయి.


అయితే తాజాగా ఈ అంశంపై సుప్రీం కోర్టు ధర్మాసనం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 1973లో ఇచ్చిన తీర్పును తప్పుగా పేర్కొంటూ.. అబార్షన్ హక్కులను తొలగిస్తూ, ఆ చట్టాన్ని రద్దు చేసేలా ఆదేశాలు ఇచ్చేందుకు రెడీ అయింది. తీర్పు వెలువడక ముందే ఓ డ్రాఫ్ట్ లెటర్ ద్వారా కోర్టు అభిప్రాయం లీకైంది. ఒకవేళ ఇదే నిజమైతే.. అబార్షన్ హక్కులను తొలగిస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెల్లడిస్తే Trigger Laws తిరిగి క్రియాశీలకంగా మారుతాయి. అంతేకాకుండా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో మినహా దేశ వ్యాప్తంగా అబార్షన్ చట్టవిరుద్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే అమెరికాలో ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. సుప్రీం కోర్టు అభిప్రాయాన్ని వ్యతిరేకిస్తూ ప్రదర్శనలు చేపడుతున్నారు. 


కాగా.. అమెరికాలో Trigger Laws కలిగి ఉన్న రాష్ట్రాలను గమనిస్తే.. అర్కాన్సాస్(Arkansas), ఇదాహో(Idaho), కెంటుకీ(Kentucky), లూసియానా(Louisiana), మిస్సిస్సిప్పి(Mississippi), మిస్సోరి(Missouri), ఉత్తర డకోటా(North Dakota), ఓక్లహోమా(Oklahoma), దక్షిణ డకోటా(South Dakota), టెనస్సీ(Tennessee), టెక్సాస్(Texas), ఉతా(Utah), వ్యోమింగ్(Wyoming)లు ఈ జాబితాలో ఉన్నాయి.


Read more