పంట విరామంతో ఏం ప్రయోజనం?

Published: Tue, 21 Jun 2022 00:57:11 ISTfb-iconwhatsapp-icontwitter-icon

మనరాష్ట్రంలో మరో కేరళగా పేరు గాంచిన, ఎటుచూసినా పచ్చటి పొలాలతో కొబ్బరి తోటలతో అత్యంత సుందరమైన కోనసీమలో మరొకసారి పంట విరామం చర్చ ముందుకు వచ్చింది. క్రాప్ హాలిడేను ఉపసంహరించుకొని తక్షణమే వరి సాగు ప్రారంభించాలని మంత్రులు, అధికారులు మైకులు పెట్టి ఊరూరా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఏ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించింది? ఎవరి ప్రయోజనాల కోసం క్రాప్ హాలిడే? దీని వెనక ప్రయోజనం ఏమిటీ అనేది క్షేత్రస్థాయిలోకి వెళితే తప్ప అర్థం చేసుకోవడం కష్టం. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా కోనసీమలోనే పదేపదే ఈ డిమాండు ఎందుకు వస్తుంది? 2011లో, 2017లో కూడా ఈ సమస్య ముందుకు వచ్చింది. దీనిపై క్షేత్రస్థాయిలో పర్యటించాక లోతైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. కోనసీమలో భూయజమానులు నూటికి 90మంది సొంత వ్యవసాయం చేయడం లేదు. వారి భూములను కౌలుకు ఇచ్చి వివిధ నగరాల్లో కాపురం ఉంటూ అనేక రకాల వ్యాపార వ్యాపకాల్లో ఉంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని విధంగా ఇక్కడ నూటికి 90శాతానికి పైగా కౌలుదారులే వ్యవసాయం చేస్తున్నారు. మరి పంట విరామం ఎవరు ముందుకు తెచ్చారు? 


పంట విరామ అంశాన్ని ముందుకు తెచ్చింది చిన్న, సన్నకారు, కౌలు రైతులు కాదు. కానీ ఇందులో వారి డిమాండ్లు కూడా ఉన్నాయి. గతంలో చూసినా, నేడు పరిశీలించినా క్రాప్ హాలిడేను ముందుకు తెచ్చింది– గ్రామీణ సంపన్నులు, పెట్టుబడిదారీ భూస్వామ్య వర్గాలే. దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి: 1) ఆహారధాన్యాల స్థానంలో ఆక్వా సాగుకు అనుమతించాలని, 2) ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, 3) కౌలురైతులకు ఎటువంటి హక్కులు ఇవ్వకూడదని. వీటికోసం భూస్వామ్యవర్గం అంతర్గతంగా చేస్తున్న డిమాండే క్రాప్ హాలిడేకు ప్రధాన కారణం. 


కోనసీమలో 16 మండలాలు, సుమారు 280 పంచాయితీలు ఉన్నాయి. 12 మండలాలు 240 పంచాయితీలలో క్రాప్ హాలిడే గురించి చర్చ జరుగుతుంది. ఇందులో ఆరు మండలాలు ఐ. పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం, అమలాపురం, అంబాజీపేట మండలాల్లో మాత్రమే 150 మంది రైతులు మండలాధికారుల దగ్గరకు వెళ్ళి క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నట్లు వినతిపత్రాలు ఇచ్చారు. దీనికి వెంటనే కలెక్టరు స్పందించి రైతులను చర్చలకు ఆహ్వానించి, చివరకు వారితో కలవకుండానే ముఖం చాటేసారు. దీనికి కోపోద్రిక్తులైన రైతులు వెంటనే పంట విరామం ప్రకటిస్తున్నట్లు, రైతాంగాన్ని ఆదుకోవాలని బిక్షాటన చేసి తమ నిరసనను వెలిబుచ్చారు. 


ఈ ప్రాంతంలో 2011, 2017లో పంట విరామం ప్రకటించినప్పుడు కూడా ఈ అంశాన్ని ముందుకు తెచ్చింది వ్యవసాయం చేయని భూస్వాములు, ధనిక రైతులు మాత్రమే. విరామానికి వ్యతిరేకంగా వ్యవసాయ కార్మికులు, కౌలు, పేదరైతులు ఐక్యమై వేలాదిమంది ఆర్డీవో ఆఫీస్‌ ముందు ఆందోళనలు చేపట్టడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని పంట విరామాన్ని విరమింపచేసింది.


వరి పంటలో పెద్దగా లాభాలు రావడం లేదని పక్కన ఉన్న కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఆక్వాసాగు పెద్దగా విస్తరిస్తుంది, ఇది కోనసీమ వరకు పాకింది. ఇక్కడ కూడా ఆక్వా కల్చర్‌ తెస్తే పెద్దఎత్తున లాభాలు రాబట్టుకోవచ్చన్న అంశం ప్రధానమైనది. కానీ ఈ ప్రాంతంలో ఆక్వాసాగుకు ప్రజల వ్యతిరేకత, ప్రభుత్వ జీవోలు అడ్డంకిగా ఉన్నాయి. ఈ ఆటంకాలను అధిగమించటానికే సంపన్న వర్గం పంట విరామాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఏడాది అక్కడక్కడ కొంతమంది కౌలురైతులు కూడా పంట విరామాన్ని సమర్థిస్తున్నట్లు కనిపిస్తున్నారు. దీనికి ప్రభుత్వ విధానాలే ప్రధాన కారణం: ప్రభుత్వం రైతుల ధాన్యాన్ని సకాలంలో మద్దతు ధరకు కొనటం లేదు. కొన్న ధాన్యానికి నెలలు తరబడి బకాయిలు చెల్లించటం లేదు. ఐదు దశాబ్దాలుగా పంట కాలువల, డ్రైనేజీల పూడిక తీయకపోవడం వల్ల ప్రతీ ఏటా మొదటి పంట మునిగిపోయినా కౌలుదార్లు అనివార్యంగా యజమానులకు కౌలు చెల్లించాల్సిన పరిస్థితి ఉంది. సముద్రపు ఉప్పునీరు ఎగదన్నకుండా ఉన్న స్లూయిజ్‌ గేట్లను ప్రభుత్వం మరమ్మత్తు చేయలేదు, అదనంగా కొత్త గేట్లను పెట్టలేదు; దీనివల్ల కూడా మొదటిపంట మునిగిపోతోంది. పెద్దఎత్తున కాలువ గట్ల పక్కన భూములు ఆక్రమణకు గురై చిన్న వరదలు వచ్చినా పంట మునిపోయే పరిస్థితి ఉంది. ఈ కారణంగా సన్న, చిన్నకారు, కౌలు రైతులలో కూడా పంట విరామం డిమాండ్ మొదలైంది. 


ఈ ప్రాంతంలో ఏడాదికి మూడు పంటలు వేస్తారు. మొదటి, రెండవ పంట వరి. మూడవ పంటగా మినుములు లాంటివి చల్లుకుంటారు. ఉపాధి హామీ పనులు ఏప్రిల్‌, మే, జూన్‌ మాసాలల్లో ముమ్మరంగా సాగుతాయి. ఈ సమయంలో రెండవ వరి పంట మిషన్‌లతో పంట కోసినా గడ్డి కట్టడానికి, చిన్న చిన్న పనులు చేయడానికి 15 రోజులు పాటు కూలీలు ఉపాధిహామీ పనుల్లో ఉండి అందుబాటులో ఉండరు, పిలిచినా రారు. కాబట్టి ఉపాధిహామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని లేదా క్యాలెండర్‌ ప్రకటించాలని వారి డిమాండ్‌.


గత మూడు సంవత్సరాల నుంచి ఐ.పోలవరం, కాట్రేనికోన, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలకు సంబంధించి సుమారు ఏడు వేల ఎకరాలకు పైగా సముద్రపు నీరు ఎగదన్ని మొదటి పంట మొత్తం మునిగిపోతుంది. ఇందులో 90శాతం భూమిని కౌలుదారులు సాగు చేస్తున్నారు. పంట పండినా, పండకపోయినా భూయజమానికి పది బస్తాలు చెల్లించాలి. పంటనష్టం, క్రాప్ ఇన్సూరెన్స్ ఇలా ఎటువంటి నష్టపరిహారం వచ్చినా భూయజమానులే తీసుకుంటున్నారు. ప్రభుత్వం కౌలుదార్లకి అన్ని హక్కులు కల్పిస్తామన్న మాటల్లో ఒక్కటి కూడా అమలు జరగడం లేదు. ఈ కారణంగా గతంలో లేని విధంగా కౌలుదార్లలో కొంత చైతన్యం వచ్చింది. అక్కడక్కడ మొదటి పంట పూర్తిగా నష్టం వస్తుంది, కాబట్టి పది బస్తాలకు బదులు ఐదు బస్తాలు మాత్రమే ఇస్తాం, రెండవ పంటకు పన్నెండు బస్తాలు ఇస్తాం, అలాగైతేనే కౌలు చేస్తాం, లేదంటే కౌలు మానుకుంటాం– అన్న డిమాండ్‌ కూడా ముందుకు వచ్చింది. ఇది భూ యజమానులకు మింగుడు పడని అంశం. ఈ కారణంగా కూడా కౌలురైతులకు ఎటువంటి హక్కులు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని భయపెట్టడానికి కూడా పంట విరామం ముందుకు తెచ్చారు.


ఎక్కువమంది వ్యవసాయ కార్మికులు, కౌలురైతులు, చిన్న, సన్నకారు రైతులు విరామాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. జూన్‌ నెల ఆఖరిలోపు నారుమళ్ళు పోయాలి. కానీ చాలాచోట్ల ఇంకా ప్రారంభం కాలేదు. ఈ నెల చివరి నాటికి కోనసీమలో ఉన్న ఆరు మండలాల్లో పంట విరామం అంశం తెలిసిపోతుంది. కాబట్టి క్రాప్ హాలిడే ప్రకటించడానికి ప్రధాన కారణం కోనసీమలో ఆక్వాసాగుకు అనుమతించాలని భూస్వామ్య వర్గం పెద్దఎత్తున ప్రయత్నం చేస్తున్నది. 


ఆహార పంటల్లో పెద్దగా లాభాలు రావడం లేదు. కాబట్టి కాసులు దండుకోవాలంటే ఆక్వా కల్చర్‌ తప్ప మరో మార్గం లేదు అన్న నిర్ణయానికి సంపన్న వర్గం వచ్చింది. ఇప్పటికే కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో అక్రమంగా పెద్దఎత్తున ఆక్వా సాగు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మొత్తం ఆక్వా విస్తరించి పంట కాల్వలన్నీ కలుషితమై గ్రామాలలో కనీసం పశువులు తాగడానికి కూడా నీరు కొనుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. ఏ ఊర్లో చూసినా అంటువ్యాధులు, చివరకు పశువులు కూడా ఈ నీరు తాగి ఈసుకుపోతున్నాయి. పాడి పరిశ్రమంతా ధ్వంసమవుతుంది. ఒకనాడు అన్నపూర్ణగా పేరుగాంచిన ఈ ప్రాంతం నుంచి ఆక్వాసాగు వల్ల వ్యవసాయ కార్మికులకు పనులు లేక గ్రామాలకు గ్రామాలే వలసలు పోతున్నాయి. ఆక్వాసాగు చేస్తున్న సంపన్న వర్గం మాత్రం డాలర్లు సంపాదించి పెద్దపెద్ద నగరాల్లో విలాసవంతమైన జీవనం గడుపుతున్నారు. క్రాప్ హాలిడే వెనకున్న ప్రధాన ఉద్దేశ్యం ఇదే. ఇది అమలు జరిగితే ఒకనాడు పచ్చని పంటలతో కళకళలాడే అందమైన కోనసీమ కనబడకుండా పోతుంది. తీవ్రమైన ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. పేదలే కాకుండా మధ్యతరగతి రైతులు కూడా ఆహారధాన్యాల కొరతను ఎదర్కొనాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం శాశ్వతమైన పరిష్కారాన్ని చేపట్టాలి.

వి. వెంకటేశ్వర్లు

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.