రెమ్యూనరేషన్‌ తగ్గించుకుంటారా?

Jun 5 2021 @ 21:46PM

కోలీవుడ్: గత యేడాది కరోనా వైరస్‌ మొదటి దశ వ్యాప్తి ప్రారంభమైంది. దీంతో కేంద్రం సంపూర్ణ లాక్‌డౌన్‌ ప్రకటించింది. ఫలితంగా థియేటర్లు మూత పడ్డాయి. ఎక్కడికక్కడ సినిమా షూటింగులు ఆగిపోయాయి. ఉన్నఫళంగా లాక్‌డౌన్‌ ప్రకటించడంతో అనేక మంది పెద్ద హీరోలు నటించే చిత్రాలు ఆగిపోయాయి. దీంతో నిర్మాతలపై భారం పడింది. దీన్ని కొంతమేరకు తగ్గించేందుకు పలువురు హీరోలు తమ రెమ్యునరేషన్‌ను తగ్గించుకోనున్నట్టు ప్రకటించారు. అలాంటి వారిలో విజయ్‌ ఆంటోనీ, హరీష్‌ కళ్యాణ్‌, ఉదయ, దర్శకులు హరి, అజయ్‌ ఙ్ఞానవేల్‌ముత్తు, నటీమణులు కీర్తి సురేష్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ వంటి మరికొందరు ఈ ప్రకటన చేశారు. కానీ, అనేక మంది ఈ విషయంపై ఇప్పటికీ నోరు మెదపడం లేదు. అదే సమయంలో ఈ యేడాది ఏప్రిల్‌ నుంచి రెండో దశ కరోనా వ్యాప్తి ప్రారంభమైంది. ఈ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ లాక్‌డౌన్‌ అమలు చేస్తోంది. ఇది చిత్ర పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపింది. 


ఒక వైపు సినిమా థియేటర్లు మూతపడటం, మరోవైపు షూటింగులు ఆగిపోయాయి. ఈ కారణంగా నిర్మాతలకు అర్థిక కష్టాలు ఎక్కువయ్యాయి. థియేటర్లు మళ్ళీ తెరుచుకునేంత వరకు తాము ఖర్చు చేసిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకునే అవకాశమే లేదు. అంటే థియేటర్లు ఎపుడెపుడు తెరుస్తారా అంటూ వేచి చూడాల్సిందే. ఈ నేపథ్యంలో గత యేడాది కొంతమంది హీరోహీరోయిన్లు, దర్శకులు ప్రకటించినట్టుగానే ఈ యేడాది కూడా నటీనటులు తమ వేతనాన్ని తగ్గించుకునేలా ప్రకటన చేయాలని సినీ పరిశ్రమలోని పెద్దలు ఎదురుచూస్తున్నారు. తాము తీసుకునే పారితోషికాన్ని తగ్గించుకుంటేనే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు గట్టెక్కగలరు. కానీ, ఏ ఒక్క నటీనటుల నుంచి కూడా అలాంటి సానుకూల ప్రకటన ఇప్పటివరకు రాలేదు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.