పరిహారం ఏదీ?

ABN , First Publish Date - 2021-04-21T05:43:05+05:30 IST

‘వారం రోజుల్లో చెక్కులు ఇవ్వాలి. ఇప్పటి దాకా ఈ పరిహారం ఏమైందో ప్రశ్నగా మారింది

పరిహారం ఏదీ?
అక్కంపల్లె పొలాల్లో ఏర్పాటైన రైల్వే లైన్‌, బ్రిడ్జి

  1. కోర్టు ఆదేశాలు బేఖాతరు
  2. పరిహారం నిధుల మల్లింపు?
  3. ఆగిన రూ.25 కోట్ల చెల్లింపులు
     


కర్నూలు-ఆంధ్రజ్యోతి/సంజామల:
‘వారం రోజుల్లో చెక్కులు ఇవ్వాలి. ఇప్పటి దాకా ఈ పరిహారం ఏమైందో ప్రశ్నగా మారింది. రైల్వే లైన్‌ నిర్మాణంలో 0.43 ఎకరాలు కోల్పోయాను. పరిహారం కోసం కోర్టుకు వెళితే ఇలా జరిగింది’ అక్కంపల్లె గ్రామానికి చెందిన బాలసుబ్బారెడ్డి అనే రైతు ఆక్రోశం.

‘నంద్యాల - యర్రగుంట్ల రైల్వే లైన్‌, బ్రిడ్జి నిర్మాణంలో సర్వేనంబరు 1205లో 1.68 ఎకరాలు కోల్పోయా. ఎకరానికి రూ.40వేల ప్రకారం పరిహారం అందించారు. రెండో విడత పరిహారం నేటికీ ఇవ్వలేదు’ అక్కంపల్లెకు చెందిన రామిరెడ్డి అనే రైతు ఆవేదన ఇది.


‘రైల్వేలైన్‌ నిర్మాణంలో 1.09 ఎకరాలు కోల్పోయాను. రెండో విడత పరిహారం కోసం కోర్టుకు వెళ్లినా నేటికీ ఇవ్వలేదు. 5 నెలల నుంచి కోర్టు చుట్టూ తిరుగుతున్నాను. నేటికీ పరిహారం అందలేదు’ అదే గ్రామానికి చెందిన గురిగె వెంకటసుబ్బయ్య వివరణ


నంద్యాల-యర్రగుంట్ల రైల్వేమార్గం, బ్రిడ్జిల నిర్మాణానికి పదిహేనేళ్ల క్రితం అక్కంపల్లె రైతులు దాదాపు 30 మంది భూములు కోల్పోయారు. అప్పట్లో రైల్వేశాఖ ఎకరాకు రూ.40వేల చొప్పున పరిహారమిచ్చింది. అది సరిపోలేదని రైతులు ఆళ్లగడ్డ కోర్టుకు వెళ్లారు. తాము ఆ భూముల మీదే జీవిస్తున్నామని, వాటి విలువ చాలా ఎక్కువగా ఉన్నా తక్కువ పరిహారం అందించారని వాదించారు. రైల్వే అధికారులు కోర్టు తీర్పు మేరకు రెండో విడతగా ఎకరాకు రూ.1.92 లక్షల పరిహారం విడుదల చేశారు. వారం లోపు చెక్కులు అందిస్తామని కోర్టు ద్వారా తెలిసిందని రైతులు మంగమ్మగారి రామిరెడ్డి, బాలసుబ్బారెడ్డి, గురిగె వెంకటసుబ్బయ్య, కామిరెడ్డి ఓబుళరెడ్డి, గూడ పెద్ద ఓబుళరెడ్డి తెలిపారు. 5 నెలల క్రితం అందాల్సిన పరిహారం నేటికీ అందలేదని వాపోతున్నారు. రైల్వే శాఖాధికారులు పరిహారాన్ని కోర్టుకు అందజేసినా సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా ప్రభుత్వం ఇవ్వడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రభుత్వం గుప్పెట్లో..
ఉద్యోగుల జీత భత్యాలు, కాంట్రాక్టర్లకు చెల్లింపులు సీఎ్‌ఫఎంఎస్‌ ద్వారా వారి అకౌంట్లకు రాష్ట్ర కార్యాలయాల నుంచి బదిలీ చేస్తారు. అయితే తీవ్రమైన ఆర్థిక లోటుతో సతమతమవుతున్న ప్రభుత్వం ప్రతి నెలా తన మీద ఒత్తిడిని తగ్గించుకునేందుకు వివిధ మార్గాల ద్వారా నిధులను సమీకరిస్తోంది. ఇందులో భాగంగా కోర్టు తీర్పుల ద్వారా కక్షిదారులకు జరిగే చెల్లింపులన్నీ సీఎ్‌ఫఎంఎ్‌సకు లింక్‌ చేయడంతో.. ఆ లావాదేవీలు రాష్ట్ర ప్రభుత్వ గుప్పిట్లోకి వెళ్లిపోయాయి. రోడ్డు ప్రమాద కేసులు, భూ సేకరణ నష్ట పరిహారం చెల్లింపుల కేసులు, ప్రామిసరీ నోట్లు తదితర వాటికి సంబంధించి రూ.కోట్లు న్యాయస్థానాల అకౌంట్లలో ఉండేవి. వీటిని చెక్కుల రూపంలో కోర్టుల తీర్పులకు అనుగుణంగా చెల్లించేవారు. అయితే ఈ నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు మళ్లించినట్లు తెలుస్తోంది. మూడు నెలలుగా కక్షిదారులకు పరిహారం అందడం లేదు.

Updated Date - 2021-04-21T05:43:05+05:30 IST