ఇదేం నిర్ధారణ?

ABN , First Publish Date - 2021-01-21T05:30:00+05:30 IST

వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో తప్పుడు నివేదికలు వస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లు వ్యాధి లేని వారికి ఉన్నట్లు చూపుతున్నాయి. ఆ నివేదికలను పూర్తిగా నమ్మి వైద్యులు మందులిస్తున్నారు.

ఇదేం నిర్ధారణ?

వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో తప్పుడు నివేదికలు

ప్రజల ప్రాణాలతో చెలగాటం

విజయనగరం రింగురోడ్డు, జనవరి 21: వ్యాధి నిర్ధారణ కేంద్రాల్లో తప్పుడు నివేదికలు వస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లు వ్యాధి లేని వారికి ఉన్నట్లు చూపుతున్నాయి. ఆ నివేదికలను పూర్తిగా నమ్మి వైద్యులు మందులిస్తున్నారు. వాటిని బాధితులు కూడా అలాగే అనుసరిస్తే ప్రాణాపాయమే. విజయనగరం లోని రింగురోడ్డు ప్రాంతానికి చెందిన డి.సతీష్‌కు ఇలాంటి అనుభవమే ఎదురైంది. ముందుచూపుతో మేల్కొనడంతో బయటపడ్డాడు. ఈయన గ్యాస్టిక్‌ ఇబ్బందితో ఈ నెల 19న నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాడు. అక్కడి వైద్యుడు కొన్ని రక్తపరీక్షలు చేశాక గ్యాస్టిక్‌ సమస్య, ఇతర లివర్‌ సమస్యలు వున్నాయేమో? తెలుసుకునేందుకు ఆల్ర్టా సౌండ్‌ పరీక్షలు చేయించుకోవాలని సూచించాడు. కొత్తపేటలోని ఓ ఆస్పత్రి రేడియాలజీ విభాగంలో పరీక్షలు చేయించుకున్నాడు. అనంతరం అక్కడ ఇచ్చిన నివేదికలో ఎర్లీ సిర్రోటిక్‌ ఛేంజస్‌ ఇన్‌ లీవర్‌ అని వచ్చింది. ఈ రిపోర్టును మళ్లీ డాక్టర్‌కు చూపించగా లివర్‌ పాడ య్యే లక్షణాలు కన్పిస్తున్నాయని, తర్వాత పరీక్షలు విశాఖలో నిర్వహిం చుకోవాలని సూచించారు. దీనిపై అనుమానం కలిగి సతీష్‌ మరో ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ మరోసారి ఆలా్ట్రసౌండ్‌ పరీక్ష చేయించుకోగా ఎటువంటి లివర్‌ సమస్యలు లేవని స్పష్టమైంది. ఈ విషయమై డి.సతీష్‌ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణి డాక్టర్‌ ఎస్‌వీ రమణకుమారికి గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. లేని వ్యాధి ఉందని, తప్పుడు నివేదిక ఇవ్వడం వల్ల మానసికంగా తాను ఇబ్బంది పడ్డానని రమణకుమారికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇదే విషయమై ‘ఆంధ్రజ్యోతి’ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారిణిని వివరణ కోరగా, బాధితుడు లిఖిత పూర్వక ఫిర్యాదు ఇచ్చారని, దీనిని పరిశీలించి, తదుపరి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. 

Updated Date - 2021-01-21T05:30:00+05:30 IST