ప్రైవేట్ బ్యాంకుల భవిష్యత్తు ఏమిటి?

ABN , First Publish Date - 2020-04-28T05:50:04+05:30 IST

కరోనా లాక్‌డౌన్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనుకావడం ఖాయం. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలుగుతాయి. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం విఫలమయ్యే అవకాశం ఎంతైనా వున్నది...

ప్రైవేట్ బ్యాంకుల భవిష్యత్తు ఏమిటి?

యెస్ బ్యాంక్ వ్యవహారంతో బ్యాంకులను జాతీయీకరణ చేయాలనే డిమాండ్ ఉధృతమయినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో దివాలా అంచుకు చేరే బ్యాంకులను, ఇప్పుడు యెస్ బ్యాంక్‌ను ఆదుకున్న విధంగా ఆదుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తుందా? ఇదీ, ఇప్పుడు మనముందున్న ప్రశ్న.


కరోనా లాక్‌డౌన్ కారణంగా బ్యాంకింగ్ వ్యవస్థ తీవ్ర ఒత్తిడికి లోనుకావడం ఖాయం. ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రభుత్వ ఆర్థిక సహాయ సహకారాలతో ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కోగలుగుతాయి. ప్రైవేట్ బ్యాంకులు మాత్రం విఫలమయ్యే అవకాశం ఎంతైనా వున్నది. ఈ సంభావ్య వాస్తవాల దృష్ట్యా, ఇటీవల యెస్ బ్యాంక్ దివాలాకు దారితీసిన కారణాలను, ఆ ప్రైవేట్ బ్యాంక్‌ను కష్టాల నుంచి గట్టెక్కించడానికి రిజర్వ్ బ్యాంక్ చేపట్టిన చర్యలను నిశితంగా సమీక్షిద్దాం. 


2017లో యెస్ బ్యాంక్, లక్ష రూపాయల కంటే తక్కువ సొమ్ము వున్న సేవింగ్స్ ఖాతాలపై 5 శాతం వడ్డీ చెల్లించింది. అప్పట్లో స్టేట్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన సేవింగ్స్ ఖాతాలపై చెల్లించిన వడ్డీరేటు 3.5 శాతం మాత్రమే. ఈ కారణంగా చాలామంది మధ్యతరగతి ప్రజలు యెస్ బ్యాంక్‌లోనే తమ కష్టార్జితాన్ని భద్రం చేసుకోవడానికి మొగ్గుచూపారు. వడ్డీరేటు అధికంగా ఉండడమే వారి ఈ నిర్ణయానికి కారణమని మరి చెప్పనవసరం లేదు. ఇలా ఖాతాదారులను అధిక సంఖ్యలో ఆకర్షించడం ద్వారా యెస్ బ్యాంక్ కూడా గణనీయంగా లబ్ధి పొందింది. ఇతర బ్యాంకులు ఇవ్వలేని వడ్డీ రేటును యెస్ బ్యాంక్ ఎలా ఇవ్వగలిగింది? ఈ ప్రైవేట్ బ్యాంక్ ప్రమోటర్ రాణా కపూర్ ‘హై రిస్క్, హై గెయిన్’ అనే సునిశ్చిత విశ్వాసంతో వ్యవహరించినట్టుగా కన్పిస్తుంది. ఏమైనా ఆయన నమ్మకం ఫలించింది. యెస్ బ్యాంక్ అసాధారణ సఫలతను సాధించింది. ఇతర బ్యాంకులనుంచి రుణాలను పొందలేక పోయిన వ్యక్తులు, సంస్థలకు రాణా కపూర్ ఉదారంగా తోడ్పడ్డారు. వారడిగిన రుణాన్ని పూర్తిగా సత్వరమే సమకూర్చారు. అనీల్ అంబానీ గ్రూప్, ఎస్సెల్ గ్రూప్, డిహెచ్‌ఎఫ్‌ఎల్, ఐఎల్ అండ్ ఎఫ్‌ఎస్, వోడాఫోన్ మొదలైన సుప్రసిద్ధ వ్యాపార సంస్థలు యెస్ బ్యాంక్ నుంచి రుణాలను తీసుకోగలిగాయి. ఆ రుణాల ఆసరాతో అవి తమ ఆర్థిక ఇక్కట్ల నుంచి బయట పడ్డాయి.


అయితే ఆ తరువాత ఈ కార్పొరేట్ సంస్థలలో కొన్ని దివాలా తీశాయి. అప్పును అర్థిస్తూ వచ్చిన ఏ వ్యక్తినీ లేదా సంస్థనూ ఒట్టి చేతులతో వెనక్కి పంపడం జరిగేది కాదు. ఎవరి రుణ అభ్యర్థనను రాణా కపూర్ తిరస్కరించేవారు కాదని ఆయన వ్యవహార శైలి. గురించి బాగా తెలిసిన వ్యక్తులు అంటారు. అయితే తమ బ్యాంక్ నుంచి రుణం పొందిన వ్యక్తులు, సంస్థల నుంచి ఆయన, బహుశా, చాలా పెద్ద మొత్తంలో వడ్డీని వసూలు చేసుకునేవాడని చెప్పవచ్చు. 


భారీ రుణాలు తీసుకున్న వ్యక్తులూ, సంస్థలూ రాణా కపూర్ అడిగిన వడ్డీరేటును చెల్లిస్తున్నంతవరకూ యెస్ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాలపై అధిక వడ్డీని చెల్లించగలిగింది. చిన్నమొత్తాలపై 5శాతం వడ్డీరేటునివ్వడం ద్వారా ఆ ప్రైవేట్ బ్యాంక్ వందల కోట్ల రూపాయల డిపాజిట్లను సాధించుకోగలిగింది. ఆ అపార ధనాన్ని ఆర్థిక సమస్యల్లో వున్న కార్పొరేట్ సంస్థలకు, కుబేరులకూ అప్పుగా ఇచ్చి అత్యధిక వడ్డీరేటును వసూలు చేసుకున్నది. ఈ పరిస్థితులు చాలావరకు సజావుగా నడిచాయి. యెస్ బ్యాంక్ లావాదేవీలు సాఫీగా సాగాయి. అయితే వ్యాపార వైరుద్ధ్యాలతో యెస్ బ్యాంక్ దివాలా అంచుకు చేరింది.


ప్రైవేట్ రంగ బ్యాంకులలో అగ్రగామిగా వున్న యెస్ బ్యాంక్ సంక్షోభంపై రిజర్వ్ బ్యాంక్ తన దృష్టిని కేంద్రీకరించింది. నిజానికి ఏడాది క్రితమే యెస్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌గా రాణా కపూర్ పునః నియామకాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆమోదించలేదు. బ్యాంక్ వ్యవహారాలను పర్యవేక్షించేందుకుగాను రిజర్వ్ బ్యాంక్ అధికారి ఒకరిని యెస్ బ్యాంక్ డైరెక్టర్‌గా నియమించారు. ఆ తరువాత కొద్దికాలానికే యెస్ బ్యాంక్ ఇచ్చిన రుణాలు తిరిగి వసూలయ్యే పరిస్థితిలేదన్న విషయం స్పష్టమయింది. కొత్త పెట్టుబడులు సమకూర్చుకోవాలని, తద్వారా రుణాల ఎగవేతతో వాటిల్లిన నష్టాలను భర్తీ చేసుకోవాలని యెస్ బ్యాంక్ యాజమాన్యానికి రిజర్వ్ బ్యాంక్ సూచించింది. బ్యాం కులు రుణాలు ఎంత మొత్తంలో ఇస్తున్నాయో అంతే మొత్తంలో విధిగా మూలధనాన్ని సదా నిర్వహించుకోవాలని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిస్తున్నది. సమాన మూల ధనాన్ని నిర్వహించుకోవడం వల్ల రుణాల ఎగవేతల వల్ల వాటిల్లే నష్టాలను సమర్థంగా ఎదుర్కోవచ్చనేది ఆ నిబంధన వెనుక వున్న ఆర్థిక సూత్రం.


కరోనా సంక్షోభం పుణ్యంతో సమీప భవిష్యత్తులో ఇటువంటి సమస్యాత్మక పరిస్థితులను రిజర్వ్ బ్యాంక్ మరింతగా ఎదుర్కోవలసివచ్చే పరిస్థితి వున్నది. ప్రజలు ఆదా చేసుకున్న ధనానికి భద్రత సమకూర్చేందుకు ప్రైవేట్ బ్యాం కులను జాతీయీకరణ చేయాలనే డిమాండ్ ఉధృతమయినా ఆశ్చర్య పోవలసిన అవసరం లేదు.  


అయితే అసలు వాస్తవం భిన్నంగా వున్నది సుమా! ప్రైవేట్ రంగంలోని పది బ్యాంకులలో ఒకటి దివాలా తీయగా ప్రభుత్వ రంగంలోని పది బ్యాంకులలో తొమ్మిది ఇప్పటికే విఫలమయ్యాయి. అయితే పాలకుల పుణ్యమా అని ప్రభుత్వ రంగ బ్యాంకుల నిజ పరిస్థితి ప్రజలకు వెల్లడికావడం లేదు. ప్రభుత్వం ఎప్పటికప్పుడు విఫలమైన ప్రభుత్వరంగ బ్యాంకులకు కొత్త మూలధనాన్ని సమకూర్చడం వల్లే బ్యాంకింగ్ వ్యవస్థకు సంబంధించిన ఆ కఠోర వాస్తవం ప్రజల దృష్టికి రావడం లేదు. యెస్ బ్యాంక్‌లో తమ సొమ్మును దాచుకున్న చిన్న ఖాతాదారుల ప్రయోజనాలను పరిరక్షించడంలో రిజర్వ్ బ్యాంక్ ప్రశస్తమైన చర్యలు చేపట్టింది. అయితే రాబోయే రోజుల్లో దివాలా అంచుకు చేరే బ్యాంకులను కూడా యెస్ బ్యాంక్‌ను ఆదుకున్న విధంగా ఆదుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ప్రయత్నిస్తుందా? ఇదీ, ఇప్పుడు మనముందున్న ప్రశ్న.


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2020-04-28T05:50:04+05:30 IST