ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకమేదీ?

ABN , First Publish Date - 2021-02-28T05:30:00+05:30 IST

ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహకంగా రూ. 15 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు.

ఏకగ్రీవ పంచాయతీలకు ప్రోత్సాహకమేదీ?
కోహీర్‌ మండలం గొటిగార్‌పల్లిలో పగుళ్లువారి శిథిలావస్థకు చేరుకున్న పంచాయతీ భవనం

సంగారెడ్డి జిల్లాలో 101 గ్రామాల్లో పాలకవర్గాలు ఏకాభిప్రాయంతో ఎన్నిక

అందాల్సిన రూ.15.15 కోట్లు 

మంజూరు చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం

రెండేళ్లుగా పంచాయతీల నిరీక్షణ


సంగారెడ్డి టౌన్‌, ఫిబ్రవరి 28: ఏకగ్రీవంగా ఎన్నికైన పంచాయతీలకు ప్రోత్సాహకంగా రూ. 15 లక్షలు మంజూరు చేస్తామని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. కొత్త పాలకవర్గాలు కొలువుతీరి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ ఈ నిధులు విడుదల చేయలేదు. నిధులు వస్తే గ్రామాభివృద్ధికి ఉపయోగపడతాయని సంగారెడ్డి జిల్లాలో 101 పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రోత్సాహకం అందకపోవడంతో ఆయా పంచాయతీల ప్రజలు ఉసూరుమంటున్నారు.

గ్రామ పంచాయతీ ఎన్నికలు 2019 ఫిబ్రవరి 2వ తేదీన జరిగాయి. ఈ ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో పోటాపోటీ వాతావరణాన్ని నివారించడానికి ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తున్న ప్రోత్సాహకాన్ని భారీగా పెంచింది. సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆయా పంచాయతీలకు రూ.15 లక్షల చొప్పున కేటాయిస్తామని అప్పట్లో సీఎం కేసీఆర్‌ స్వయంగా ప్రకటించారు. గతంలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రోత్సాహకం రూ.7 లక్షలు ఉండేది. 2019 పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రభుత్వం ఈ మొత్తాన్ని రూ.10 లక్షలకు పెంచింది. దీనికి అదనంగా ఎమ్మెల్యే నిధుల నుంచి రూ.5 లక్షలు ఇస్తామని వెల్లడించారు. తమ గ్రామాలకు ప్రోత్సాహక నిధులు వస్తే సమస్యలు పరిష్కరించుకోవచ్చనే ఆశతో అనేక పంచాయతీల్లో గ్రామస్థులు పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 647 పంచాయతీలుండగా 101 గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ పంచాయతీ పాలకవర్గాల కొలువుదీరి రెండేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క పైసా కూడా సర్కారు విడుదల చేయలేదు. 


జిల్లాకు రావాల్సింది రూ.15.15 కోట్లు

సంగారెడ్డి జిల్లాలో 26 మండలాల్లో మొత్తం 647 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో 101 పంచాయతీల్లో పాలకవర్గాలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఒక్కో పంచాయతీకి సర్కారు నుంచి నజరానాగా రూ.15 లక్షల చొప్పున మొత్తం 101 పంచాయతీలకు రూ.15.15 కోట్లు విడుదల కావాల్సి ఉన్నది. ప్రోత్సాహక నిధులోస్తే గ్రామాల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించుకుంటామని సర్పంచ్‌లు ఆశించారు. నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం రెండేళ్లుగా జాప్యం చేస్తుండడంతో సర్పంచ్‌లు నిరుత్సాహం వ్యక్తంచేస్తున్నారు.


అత్యధికం ‘ఖేడ్‌’ నియోజకవర్గంలోనే

జిల్లాలో మొత్తం 101 పంచాయతీలు ఏకగ్రీవం కాగా.. ఇందులో అత్యధికం నారాయణఖేడ్‌ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఖేడ్‌ పరిధిలో 52 పంచాయతీల పాలకవర్గాలను ఏకాభిప్రాయంతో ఎన్నుకున్నారు. 


పంచాయతీల్లో సమస్యల తిష్ఠ

జిల్లాలోని ఆయా గ్రామాల్లో సమస్యలు తిష్ఠ వేశాయి. అంతర్గత రహదారులు ధ్వంసమయ్యాయి. మురుగు కాల్వలు అధ్వాన్నంగా మారాయి. ఇళ్ల మధ్యలో రోడ్లపైనే మురుగు ప్రవహిస్తున్నది. కొత్త పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో చెట్ల కింద, పాఠశాల భవనాల్లో సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు అందించే నిధులు విడుదలైతే గ్రామాల రూపురేఖలు మారే అవకాశం ఉంటుందని పలువురు సర్పంచ్‌లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2021-02-28T05:30:00+05:30 IST