‘పెంపు’ ఏది జగనన్నా!

ABN , First Publish Date - 2022-08-07T09:50:14+05:30 IST

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తాము అండగా ఉంటామంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ వారిని గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

‘పెంపు’ ఏది జగనన్నా!

  • నేటికీ కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌కు వర్తించని సీఎం జగన్‌ ఆదేశాలు
  • ‘పర్మినెంట్‌’పైనా కమిటీలతో కాలక్షేపం
  • ఇదేం అన్యాయమని ఉద్యోగుల ఆవేదన
  • ఎన్నికల సమయంలో ఓట్ల కోసం హామీలిచ్చి ఇప్పుడు మడమ తిప్పేశారని ఆక్రోశం


(అమరావతి-ఆంధ్రజ్యోతి) : కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు తాము అండగా ఉంటామంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ వారిని గాలికి వదిలేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్‌ చేస్తామంటూ హామీ ఇచ్చిన ఆయన ఇప్పుడు కమిటీల పేరుతో కాలక్షేపం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పదవీ విరమణ పెంపును వీరికి వర్తింపజేయడంపైనా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వస్తే తమకు న్యాయం జరుగుతుందనుకున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు ఇప్పుడు ఆయన వ్యవహరిస్తున్న తీరు చూసి ఆవేదన చెందుతున్నారు. తమ సమస్యల పరిష్కారానికి కమిటీల పేరుతో కాలక్షేపం చేయడమేనా.. లేక చేసేదిఏమైనా ఉందా అని ప్రశ్నిస్తున్నారు.

 

ప్లీజ్‌.. ప్లీజ్‌.. అంటున్నా!

రాష్ట్ర ప్రభుత్వంలో వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు సుమారు 2 లక్షల మంది వరకు ఉంటారు. వారి ఓట్లు కొల్లగొట్టేందుకు... గత ఎన్నికల ముందు పాదయాత్రలో ‘‘మేం ఉన్నాం.. అధికారంలోకి వచ్చిన వెంటనే పర్మినెంట్‌ చేస్తా’’మంటూ కాంట్రాక్టు ఉద్యోగులపై జగన్‌ హామీల వర్షం కురిపించారు. అయితే, అధికారంలోకి వచ్చాక మాత్రం ఈ ఉద్యోగుల పర్మినెంట్‌ విషయంపై కమిటీలను నియమించారు. ఆ కమిటీలు ఏం చేస్తున్నాయో.. ఎవరికీ తెలియని పరిస్థితి నెలకొందని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇదిలావుంటే, సాధారణ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును పెంచినప్పటికీ.. కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సంబంధించి పదవీ విరమణ వయసు పెంపుపై మాత్రం జగన్‌ సర్కార్‌ మౌనంగా ఉంది. పీఆర్సీలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60 నుంచి 62 ఏళ్లు పెంచుతున్నట్లు ఏ ఉద్యోగ సంఘ నాయకులు, ఏజేఏసీ నాయకులు అడగకుండానే సీఎం ప్రకటించారు. సీఎం అడగని వరం ఇచ్చారు కాబట్టి కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, సొసైటీలు, పబ్లిక్‌ సెక్టార్‌ ఉద్యోగులు, గురుకులాలకు ఇలా అన్నింటికీ వర్తించేలా ఒకేసారి జీవో ఇస్తారని అందరూ ఎదురు చూశారు. అయితే, ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో తమకు ప్రత్యేకంగా మరో జీవో ఇస్తారని కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు భావించారు. కానీ, ఇప్పటికి 7 నెలలు గడిచినా.. ఈ విషయంపై సర్కారు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జగన్‌ సర్కార్‌ పదవీ విరమణ పెంపులోనూ తమకు ఝలక్‌ ఇచ్చినట్లేనా? అని ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. 


అరకొర వేతనాలతో.. 

ప్రభుత్వం ఇచ్చే అరకొర వేతనంతో కుటుంబాలను నెట్టుకొస్తున్నామని.. కనీసం పదవీ విరమణ వయసు పెంచితే.. కొన్నాళ్లపాటు తమకు ఆర్థిక భరోసా దక్కినట్టు అవుతుందని కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సహా ఇతర ఉద్యోగులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఉద్యోగ జేఏసీలు, పలు ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంతో చర్చలు జరిపిన ప్రతిసారీ వీరి సమస్యలను సర్కారు పెద్దలకు విన్నవిస్తూనే ఉన్నారు. ఇటీవల మంత్రివర్గ ఉపసంఘంతో జరిగిన సమావేశంలోనూ ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ ప్రభుత్వం నుంచి మాత్రం ఏ విధమైన స్పందనా రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. కాగా, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సహా వివిధ సొసైటీల్లోని ఉద్యోగులకు పదవీ విరమణ వయసు పెంచకపోవడంతో వారు 60 ఏళ్లకే ఇంటిబాట పడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇచ్చి అన్ని విధాలా న్యాయం చేస్తామని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చి.. ఇప్పుడు అదీ ఇవ్వకపోగా.. కనీసం పదవీ విరమణ వయసుపై కూడా మడమతిప్పేయడం ఏంటని వారు మండిపడుతున్నారు.


‘ఉపాధి’ ఉద్యోగి వినతి

నెల్లూరు జిల్లాకు చెందిన ఉపాధి హామీ పథకం ఉద్యోగి ఒకరు తనకు పదవీ విరమణ వయసు పెంచాలంటూ పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌కు లేఖ రాశారు. తనకు జూలై-1, 2022తో 60 ఏళ్లు నిండుతాయని, ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసు 2 సంవత్సరాలు పెంచిన విధంగానే తమకు కూడా 62 ఏళ్లకు పెంచాలని ఆయన విన్నవించారు. అయితే.. దీనిపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం. 

Updated Date - 2022-08-07T09:50:14+05:30 IST