వయసులో పదేళ్లు పెద్దోడితో పెళ్లి.. మళ్లీ చదువుకుంటానంటూ కాలేజీలోకి ఎంట్రీ.. ఈమె జీవితంలో ఎన్ని ట్విస్టులో..!

ABN , First Publish Date - 2021-11-20T23:59:13+05:30 IST

మధ్యప్రదేశ్‌లో 17 ఏళ్ల వయసున్న బాలికను.. తనకంటే పదేళ్ల పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత చదువుకుంటానంటే.. భర్త కూడా అంగీకరించాడు. అయితే తర్వాత ఆమె జీవితంలో

వయసులో పదేళ్లు పెద్దోడితో పెళ్లి.. మళ్లీ చదువుకుంటానంటూ కాలేజీలోకి ఎంట్రీ.. ఈమె జీవితంలో ఎన్ని ట్విస్టులో..!

భర్త అనే వాడు.. భార్యకు అన్ని విషయాల్లో మద్దతుగా నిలవాలి. అప్పుడే వారి సంసారం పది కాలాల పాటు పచ్చగా ఉంటుంది. కొందరు యువతులకు ఎన్నో ఆశయాలు, ఆశలు ఉంటాయి. అయితే అవి నెరవేరకుండానే.. మధ్యలోనే పెద్దవాళ్లు వారికి పెళ్లిళ్లు చేస్తుంటారు. ఆర్థిక సమస్యల కారణంగా ఇలా చాలా మంది తల్లిదండ్రులు త్వరగా పెళ్లిళ్లు చేస్తుంటారు. దీంతో చేసేదేమీ లేక.. వైవాహిక జీవితంతో రాజీ పడి అసంతృప్తిగానే కాలం గడుపుతుంటారు చాలా మంది. అయితే కొన్ని కుటుంబాల్లో మాత్రం భార్య మాటకు భర్త విలువ ఇచ్చి.. వారి ఆశయాలను నెరవేర్చుకునేందుకు సహరిస్తుంటారు. మధ్యప్రదేశ్‌లో 17 ఏళ్ల వయసున్న బాలికను.. తనకంటే పదేళ్ల పెద్దవాడికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లయిన తర్వాత చదువుకుంటానంటే.. భర్త కూడా అంగీకరించాడు. అయితే తర్వాత ఆమె జీవితంలో ఎన్ని ట్విస్టులు చోటు చేసుకున్నాయో తెలుసుకుంటే షాక్ అవుతారు..


మ‌ధ్యప్ర‌దేశ్ అనుప్పుర్ జిల్లా కోట్మా అనే గ్రామంలో ఓ మధ్య తరగతి కుటుంబం నివాసం ఉంటోంది. వారికి అనిత ప్రభ అనే కుమార్తె ఉంది. బాగా చదువుకుని మంచి ఉద్యోగం సాధించాలని ఆమె జీవిత లక్ష్యం. అయితే ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో తమ కుమార్తెను కేవలం ఇంటర్ వరకే చదివించారు. తర్వాత కూతురు కంటే పదేళ్లు పెద్దవాడైన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. అసంతృప్తితోనే అత్తవారింట్లో అడుగుపెట్టిన ఆమెకు.. ఎలాగైనా చదువును కొనసాగించాలని తపన ఉండేది. ఇదే విషయాన్ని ఓ రోజు భర్తకు తెలియజేసింది. భార్య తపనను అర్థం చేసుకున్న అతను.. అనితను డిగ్రీలో చేర్పించాడు. పొద్దున కళాశాలకు వెళ్లడం, సాయంత్రం నుంచి ఇంటి పనులు చేసుకోవడం చేస్తుండేది. ఇలా సాగుతున్న ఆమె జీవితంలో అనుకోని సమస్యలు తలెత్తాయి.


కొన్నాళ్లకు భర్త, అత్తమామల నుంచి వేధింపులు మొదలయ్యాయి. రోజురోజుకూ తీవ్రమవుతుండడంతో చివరకు భ‌ర్త‌కు విడాకులు ఇచ్చి.. సొంత కాళ్ల మీద జీవించడం ప్రారంభించింది. ఓ వైపు బ్యూటీ పార్ల‌ర్ నడుపుకొంటూ.. మరోవైపు కళాశాలకు వెళ్తూ ఉండేది. డిగ్రీ పూర్తయ్యాక.. 2013లో ఫారెస్ట్ గార్డ్ ప‌రీక్ష పాసైంది. ఆ ఉద్యోగం చేసుకుంటూనే, ఎస్ఐ ప‌రీక్షలు రాస్తూ ఉండేది. మొదటిసారి విఫలమైనా.. రెండోసారి గట్టిగా ప్రయత్నించి ఎస్ఐ ఉద్యోగం సాధించింది. అంతటితో ఆగకుండా.. మ‌ధ్య‌ప్ర‌దేశ్ స్టేట్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ప‌రీక్ష రాసి.. 17వ ర్యాంక్ తెచ్చుకుంది. దీంతో చివరకు డీఎస్పీ స్థానంలో కూర్చుని.. తన లక్ష్యాన్ని నెరవేర్చుకుంది. భర్త దూరం చేసినా, సొంత కష్టంతో చదువుకుని.. చివరకు అనుకున్నది సాధించిన ఆమె.. అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.

Updated Date - 2021-11-20T23:59:13+05:30 IST