Advertisement

ఈ భావోద్వేగంలో భావమేమి?

Feb 10 2021 @ 01:15AM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజురోజుకూ సాధువులా మారిపోతున్నారు. తెల్ల మబ్బులా గడ్డం రోజురోజుకూ పెరుగుతుండగా ఆయన మహర్షిలా కనిపిస్తున్నారు. సాధారణంగా మహర్షులు ప్రగాఢ ఆధ్యాత్మికత, వేదాంతం మూర్తీభవించిన మహానుభావులు కనుక వారికి రాగద్వేషాలు ఉండవు. బాధ, ఆవేశం, కోపం లాంటివి వారిని పట్టి పీడించవు. భగవద్గీతలో ‘జ్ఞానినః స్తత్వ దర్శినః’ అని చెప్పినట్లు ఆయన తత్వ జ్ఞానం పరిపూర్ణంగా తెలిసిన వ్యక్తిలా మారిపోతున్నారు. భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యలకు అన్నిటికీ తన వద్దే సమాధానం ఉన్నదని భావిస్తున్నారు. అలాంటి నరేంద్రమోదీ మంగళవారం నాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ వీడ్కోలు కార్యక్రమం సందర్భంగా ఎందుకు కంటతడి పెట్టారు? 


సాధారణంగా రాజ్యసభలో ప్రతి ఏడాది కొంతమంది సభ్యులు పదవీ విరమణ చేస్తూనే ఉంటారు. పదవీ విరమణ చేసిన వారిలో కొందరు తిరిగి వస్తారు. కొందరు తిరిగి రారు. లోక్‌సభలో అందరి పదవీ కాలం ఒకే సారి ముగుస్తుంది కనుక ఒకరికొకరు వీడ్కోలు చెప్పుకునే అవకాశం ఉండదు. రాజ్యసభలో ఆరేళ్లు పదవిలో ఉన్నప్పటికీ ఆ ఆరేళ్ల పదవీ కాలం పూర్తయిన వారు ప్రతి ఏడాదీ ఏదో ఒకరోజు పదవీవిరమణ చేస్తారు. అయినప్పటికీ తమ మధ్య నిన్నటి వరకూ ఉన్న సభ్యుడు ఉన్నట్లుండి పదవీవిరమణ చేసి వెళ్లిపోతే చుట్టూ ఉన్న వారికి బాధాకరంగా ఉంటుంది. అందరికీ తామూ వెళ్ళిపోయే రోజు కూడా ఏదో ఒక నాడు వస్తుందని తెలిసినప్పటికీ వెళ్లిపోయే వారి గురించి నాలుగు మంచి మాటలు మాట్లాడడం సహజం. నిజానికి నిన్నటి వరకూ ఒకరితో మరొకరు తీవ్రంగా విభేదించినప్పటికీ, వెల్‌లోకి దూసుకువచ్చినప్పటికీ, సభా కార్యక్రమాలు స్తంభింపచేసినప్పటికీ పదవీ విరమణ చేస్తున్న సభ్యుల గురించి సద్భావంతో మాట్లాడడం కద్దు. వారి కంటే గొప్ప పార్లమెంటేరియన్లు, ప్రజాస్వామిక వాదులు, అజాతశత్రువులు లేరని ప్రశంసించడంలోనూ ఆశ్చర్యం లేదు. ఇది పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి తగిన ఆరోగ్యకరమైన లక్షణమే. అంతేకాని రాజకీయాల్లో సహజంగా జరిగే ఒక పరిణామం గురించి ఎవరైనా కంటతడి పెడితే చాలా విచిత్రంగా ఉంటుంది. మరి ఆజాద్ రాజ్యసభ నుంచి వెళ్లిపోవడం పట్ల నరేంద్ర మోదీ ఎందుకు కన్నీరు కార్చారు?


గులాంనబీ ఆజాద్ ఏమీ ప్రధానమంత్రికి బాల్యస్నేహితుడు కాడు. ఇద్దరూ ఒక రాష్ట్రానికి చెందిన వారు కూడా కాదు. ఒకటి రెండు సందర్భాల్లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోదీ అడిగిన సహాయాన్ని కేంద్ర మంత్రిగానో, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగానో ఆజాద్ చేసి పెట్టి ఉండవచ్చు రాజకీయాల్లో ఉన్నప్పడు ఇది సహజం. గత ఆరేళ్ళుగా మోదీ ప్రధానిగా ఉన్న కాలంలో ప్రతిపక్ష నేతగా గులాంనబీ ఆజాద్ బిజెపి ప్రభుత్వంతో అడుగడుగునా ఢీకొన్నారు. ఎన్నో సార్లు సభను స్తంభింపచేశారు. గత ఏడాది జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించిన అధికరణ 370ని రద్దు చేసినప్పడు ఆజాద్ సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. ప్రతిపక్ష నేత అన్న విషయం కూడా మరిచిపోయి ఆయన వెల్ లోకి వచ్చి చైర్మన్ సీటు ముందు కూర్చున్నారు. ‘భారతదేశ కిరీటాన్ని ధరించిన జమ్మూ కశ్మీర్ తలను మీరు నరికేస్తారని నేను అనుకోలేదు. జమ్మూ కశ్మీర్‌కు ఉనికి లేకుండా చేశారు. ఇది భారతదేశ చరిత్రకు తీరని కళంకం. హోంమంత్రి అమిత్ షా తన మాటలతో సభలో అణుబాంబు పేల్చారు. జమ్మూ కశ్మీర్‌ను భారత చిత్రపటం నుంచే వేరు చేశారు. ఆ రాష్ట్రాన్ని దేశం నుంచి చీల్చివేశారు..’ అని ఆజాద్ తీవ్ర పదజాలంతో విమర్శించారు.


అయినప్పటికీ ఆజాద్‌తో తన స్నేహాన్ని తలుచుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కన్నీరు కార్చారు. కశ్మీర్‌లో ఉగ్రవాద దాడిలో మరణించిన గుజరాతీల మృతదేహాలను తమ రాష్ట్రానికి పంపించడంలో ఆజాద్ చూపిన చొరవను తలుచుకుని ఆయన గద్గద స్వరంతో మాట్లాడారు. తన సహజ శైలిలో కన్నీటిని పంటి క్రింద అదిమిపెట్టుకుని మంచినీరు తాగారు, అక్కడితో ఆగకుండా ఆజాద్ తనకు ‘నిజమైన స్నేహితుడు’ అని అభివర్ణించారు, ఆజాద్‌ను తాను రిటైర్ కానివ్వనని, ఆయన సలహాలు తీసుకుంటూ ఉంటానని, తన ద్వారాలు ఆయనకోసం తెరిచి ఉంటాయని కూడా మోదీ చెప్పడం అనేకమందిని ఆశ్చర్యపరిచింది.


గత ఆరేళ్లలో కాంగ్రెస్ పూర్తిగా క్షీణించిపోగా, ఏడు పదులు నిండిన ఆజాద్ కూడా ప్రాభవం కోల్పోయారు. ఆజాద్ వంటి వ్యూహకర్తలను కొత్త తరంలో కాంగ్రెస్ సృష్టించుకోలేకపోయింది, అయినప్పటికీ రాజకీయ నాయకుడు రాజకీయనాయకుడే. తన రాజ్యసభ సీటు ఈ ఏడాదితో ముగుస్తుందని తెలిసినప్పటి నుంచీ ఆయన రాజకీయ ఎత్తుగడలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ను పునర్మిర్మాణం చేయాలని, ప్రజాస్వామికంగా ఎన్నికలు జరగాలని డిమాండ్ చేస్తూ 23 మంది నేతలతో కలిసి సోనియాకు గత ఏడాది లేఖాస్త్రం సంధించి సంచలనం సృష్టించారు. అనేక సందర్భాల్లో పార్టీ నేతృత్వానికి తిరుగులేదంటూ వందిమాగధత్వం ప్రదర్శించిన ఆజాద్ స్వభావానికి ఇది భిన్నమైనది, బహుశా నాయకత్వం తనను విస్మరించకూడదని, కేరళ నుంచో మరో చోటి నుంచో తనను తిరిగి రాజ్యసభకు ఎంపిక చేయాలని ఆయన భావిస్తుండవచ్చు. ప్రస్తుత పరిస్థితిలో అది జరిగే అవకాశం లేదని కాంగ్రెస్ అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. 


నరేంద్రమోదీకి మాత్రం ప్రతిపక్షంలో ఏ చిన్న నిప్పురవ్వ రగిలినా సంతోషకరమే అవుతుందనడంలో సందేహం లేదు. సోమవారం ఆయన రాజ్యసభలో మాట్లాడుతూ ఆజాద్‌తో పాటు 23 మంది నేతలు సోనియాకు రాసిన అసమ్మతి లేఖను ప్రస్తావించారు. మంగళవారం ఏకంగా ఆజాద్ పదవీవిరమణ పట్ల కంటతడి పెట్టడమే కాక తన ద్వారాలు తెరిచి ఉన్నాయని అనడంలో ఏదో ఒక సందేశం ఉండే ఉంటుంది. ఆజాద్ కూడా ఇందుకు జవాబిస్తూ తాను ఎన్నడూ పాకిస్థాన్ వెళ్లలేదని, తాను హిందుస్తానీ ముస్లింనేనని చెప్పడంలో అంతరార్థమేమైనా ఉన్నదా అని ఆలోచించాల్సి ఉంటుంది, జమ్మూ కశ్మీర్‌లో కొన్ని దశాబ్దాలుగా ఆజాద్‌కు మించిన నాయకుడు కాంగ్రెస్‌కు దొరకలేదు. ఆయన హయాంలో కశ్మీర్‌లో ఎన్నో ఘాతుకాలు జరిగాయి. అయినప్పటికీ ఆజాద్ లాంటి నేతను ఏ పార్టీ అయినా రాజకీయంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది. కాంగ్రెస్‌లో ప్రాధాన్యత కోల్పోతే ఇన్నేళ్ల బంధాలను వదులుకుని మోదీ తెరిచిన ద్వారాల్లోకి ఆజాద్ ప్రవేశిస్తారా, కల్లోల కశ్మీర్‌లో మోదీకి ఆయన ఏ రూపంలోనైనా ఉపయోగపడతారా ఆలోచించాల్సి ఉంటుంది. బహుశా మోదీ కన్నీరు వెనుక ఈ ఆర్థం ఉండి ఉంటుంది.


అయినా గతంలో కూడా మోదీ అనేక సార్లు కంటతడి పెట్టుకున్నారు. తన తల్లి అంట్లు తోమిందని చెబుతూ ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. గుజరాత్‌ను వదిలిపెట్టి వచ్చినందుకు దుఃఖించారు. ఆడ్వాణీ తనపై దయ ఉంచమని చెప్పినందుకు గద్గద స్వరుడయ్యారు. డెహ్రాడూన్‌లో ప్రధానమంత్రి జనఔషద్ యోజన పథకం తన భర్తను బతికించిందని, దీనితో తాను మోదీని దేవుడుగా కొలుస్తున్నానని ఒక మహిళ అన్నందుకు ఆయన కళ్లలో నీళ్లు నిండాయి. ఈ ఉదంతాలన్నీ ప్రధానమంత్రి ఎంత సున్నిత మనస్కుడో మనకు తెలియజేస్తున్నాయి. రాజ్యసభలో ఒక ప్రతిపక్ష నేత పదవీ విరమణ చేసినప్పుడు కూడా ఆయన భావోద్వేగానికి గురి కావడం ఆయన సున్నితత్వాన్ని మరింత స్పష్టం చేసింది. బహుశా ఢిల్లీ సరిహద్దుల్లో రెండున్నర నెలలుగా రైతులు చేస్తున్న నిరసన ప్రదర్శన కూడా ఆయనను లోలోపల చలింప చేస్తూ ఉండాలి. ఇప్పటికే 70 మందికి పైగా రైతులు ఈ ప్రదర్శనలో మరణించగా సోమవారం టిక్రీలో మరో రైతు చెట్టుకు వేళ్లాడుతూ కనిపించాడు. ప్రధాని తన ప్రసంగంలో నిత్యం ఆందోళన జీవులను విమర్శించినప్పటికీ ఆయన మనసులో కూడా ఆందోళన రగులుతూనే ఉండాలి.


భారతదేశ రాజకీయాల్లో నరేంద్ర మోదీని విమర్శించే అవకాశం ఉన్నప్పటికీ విస్మరించే అవకాశం లేదు. మన ఆలోచనల్లో, మన చర్చల్లో మోదీ పూర్తిగా భాగమయ్యారనడంలో అతిశయోక్తి లేదు. ఇద్దరు సామాన్య జీవులైనా, ఇద్దరు మేధావులైనా, ఇద్దరు పారిశ్రామికవేత్తలైనా, ఇద్దరు రాజకీయనాయకులైనా, చివరకు ఇద్దరు సాహిత్యకారులైనా పది నిమిషాలు చర్చించుకుంటే మోదీ అన్న పదం ఎప్పుడో ఒకప్పుడు దొర్లక మానదు. తన మాటలు, చేతలతోనే కాదు, తన ఆకారం, హావభావాలతో ఆయన మన మధ్య అప్రయత్నంగా ప్రత్యక్షమవుతున్నారు. ఆయన కంటతడి సంపాదించడం అంత సులభం కాదు.

 

ఎ. కృష్ణారావు

ఆంధ్రజ్యోతి ఢిల్లీ ప్రతినిధి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.