కులాంతర వివాహ జంటలకు రక్షణ ఏది?

ABN , First Publish Date - 2022-05-28T06:16:48+05:30 IST

హిందూనిచ్చెన మెట్ల కుల వ్యవస్థ బలంగా వేళ్లూనుకుని ఉండడానికి కారణం అంతర్ వివాహాలు అంటే ఏ కులం వారు ఆ కులం వారినే వివాహాలు చేసుకునే పద్ధతి అని సామాజిక శాస్త్రవేత్తలు సూత్రీకరించారు.

కులాంతర వివాహ జంటలకు రక్షణ ఏది?

హిందూనిచ్చెన మెట్ల కుల వ్యవస్థ బలంగా వేళ్లూనుకుని ఉండడానికి కారణం అంతర్ వివాహాలు అంటే ఏ కులం వారు ఆ కులం వారినే వివాహాలు చేసుకునే పద్ధతి అని సామాజిక శాస్త్రవేత్తలు సూత్రీకరించారు. సమాజంలో ఉత్పత్తి సాధనాలు, ఉత్పత్తి సంబంధాల మధ్యలో వచ్చిన మార్పు, విద్య తదితర ప్రభావిత అంశాల కారణంగా అంతర్ వివాహాలతో పాటు, కులాంతర వివాహాలు చేసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. కొంతమంది తల్లిదండ్రులు అండగా నిలబడుతుంటే, మరి కొంతమంది పిల్లలపై దాడులకు, హత్యలకు పాల్పడుతున్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు సమాజంలో మద్దతు కరువై అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.


కులాంతర వివాహాల వేదిక, కుల వివక్ష పోరాట సమితి నివేదిక ప్రకారం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించాక కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై దాడులు, ‘పరువు’ పేరిట హత్యలు పెరిగాయి. అందులో ప్రధానమైనవి 2017లో మంథని మధుకర్, 2018లో మిర్యాలగూడకు చెందిన పెరుమాళ్ళ ప్రణయ్ హత్యలు, హైదరాబాద్ కు చెందిన సందీప్, మాధవిలపై దాడి, 2019 ఫిబ్రవరిలో సుశ్రుత ఆమె నాలుగు నెలల కుమారుడిని అత్యంత పాశవికంగా బతికుండగానే కాల్చి చంపేయడం. నిజానికి పరువు సమస్య అనేది ఒక అగ్రకులాలకు కాకుండా అన్ని కులాలకు వర్తిస్తుంది, కాబట్టి పరువు పేరిట జరిగేవి అన్నీ కులోన్మాద హత్యలే. దానికి ఉదాహరణే యాదాద్రి జిల్లా, లింగరాజుపల్లి గ్రామం ఎరుకల రామకృష్ణ గౌడ్ హత్య, హైదరాబాద్ బేగంబజార్‌లో నీరజ్ హత్య. వీటిని కుల ఉన్మాదానికి పరాకాష్ఠగా చెప్పవచ్చు.


కులాంతర వివాహాలు జరిగినప్పుడు స్థానిక రాజకీయ నాయకులు, పోలీసులు సంయమనం పాటించి ఇరువురి పిల్లల తల్లిదండ్రులను పిలిపించి మాట్లాడాలి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బాధ్యత తీసుకోవాలి. కానీ అలా జరగడం లేదు. వారు ఏదో ఒక వర్గానికి మద్దతు ఇవ్వడం వల్ల కులాంతర వివాహాలు చేసుకున్న వారిపై హత్యలు, దాడులు పెరుగుతున్నాయి. పౌర సమాజం, విద్యార్థులు, ప్రొఫెసర్లు మేధావులు, ప్రగతిశీల శక్తులు కులాంతర వివాహాలు చేసుకున్న వారికి సకాలంలో సహకారం అందించి, అండగా నిలబడాలి. కులాంతర వివాహాల వల్ల ఏ విధంగా సామాజిక అంతరాలు తొలగి సమానత్వ సమాజం ఆవిర్భవిస్తుందో ప్రజలకు అవగాహన కల్పించాలి. కుల నిర్మూలనకు సరైన పద్ధతి వర్ణాంతర వివాహాలే.


కేంద్ర ప్రభుత్వం సామాజిక న్యాయం, సాధికారత శాఖ ద్వారా కులాంతర వివాహాలు చేసుకున్న జంటలకు ఆర్థిక సహకారం అందిస్తుంది కానీ, క్షేత్రస్థాయిలో ఆ పథకం పట్ల ప్రజలకు అవగాహన లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై అవగాహన కల్పించి ఆర్థిక సహకారం త్వరగా చేరేటట్లు చూడాలి. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రత్యేకమైన పథకం అమలు చేసి ప్రోత్సాహం అందించాలి. భారత రాజ్యాంగం ప్రకారం 21సంవత్సరాలు నిండిన ప్రతి పురుషుడు, 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళ తమకు ఇష్టమైన వారిని వివాహం చేసుకునే హక్కు ఉంది. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల ఇష్టాయిష్టాలను గౌరవించాలి. అదేవిధంగా సమాజం కులాంతర వివాహాలు చేసుకున్న వారికి అండగా నిలబడాలి.


సత్య నెల్లి

ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - 2022-05-28T06:16:48+05:30 IST