జయశంకర్‌ స్మృతివనంలోని శిల్పాలపై వివాదం

ABN , First Publish Date - 2021-03-01T05:30:00+05:30 IST

తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్‌..

జయశంకర్‌ స్మృతివనంలోని శిల్పాలపై వివాదం
హన్మకొండ ఏకశిల పార్కులో గోడలపై వేసిన కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలు

ఇదేమి ‘సిత్రం’!?

రూ.10 లక్షల వ్యయంతో స్పెషల్‌ వాల్‌ నిర్మాణం
సారు కంటే కేసీఆర్‌, కేటీఆర్‌ చిత్రాలకే ప్రాధాన్యం ఇచ్చారని విపక్షాల విమర్శలు

వరంగల్‌(ఆంధ్రజ్యోతి ప్రతినిధి):
తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త  కొత్తపల్లి జయశంకర్‌ స్మారకార్థం హన్మకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న స్మృతి వనంలోని శిల్పాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. వరంగల్‌ నగర సుందరీకరణ పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలు వెచ్చించి పబ్లిక్‌ పార్కులు, జంక్షన్లను అభివృద్ధి చేస్తున్నారు. ఇందులో భాగంగా హన్మకొండ ఏకశిల పార్కును సుందరీకరిస్తున్నారు. జయశంకర్‌ మరణాంతరం ఈ పార్కుకు ఆయన పేరు పెట్టారు. గతంలోనే ఇందులో జయశంకర్‌ విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రత్యేకశ్రద్ధతో ఈ పార్కు నిర్మాణాన్ని హైదరాబాద్‌ నుంచే పర్యవేక్షిస్తున్నారని గ్రేటర్‌ అధికారులు చెబుతున్నారు. పార్కులో భారీ సిమెంట్‌ గోడ నిర్మించి దానిపై శిల్పాలను చెక్కారు. తెలంగాణ ఉద్యమ దిక్సూచి జయశంకర్‌ జీవిత విశేషాల పేరుతో చెక్కిన శిల్పాల్లో కేసీఆర్‌, కేటీఆర్‌ల చిత్రాలకే ప్రాధాన్యమిచ్చారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 


జయశంకర్‌ స్మృతివనంలో టీఆర్‌ఎస్‌ చరిత్ర, సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ల జీవిత విశేషాలను ఫోకస్‌ చేస్తూ శిల్పాలు చెక్కుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజాధనం ఖర్చు చేసి వ్యక్తిగత ప్రతిష్ట కోసం తాపత్రయపడుతున్నట్లు స్పష్టమవుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం జయశంకర్‌ జీవిత విశేషాలను వివరించే యత్నం చేస్తున్నామని చెబుతున్నారు. ఈ పార్కులో జయశంకర్‌ బాల్యం, కేయూ వీసీగా పదవీ బాధ్యతలు, 1971లో తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్రకు సంబంధించిన చిత్రాలు మాత్రమే దర్శనమిస్తున్నాయి. ఆయన జీవిత విశేషాల్లో చెప్పుకోదగ్గవి.. కేసీఆర్‌తో కలిసిన క్షణాలు, అప్పట్లో వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగ సభలో కేసీఆర్‌తో కలిసి చేతులెత్తి ప్రజలకు అభివాదం చేయడం, తెలంగాణ కోసం కేసీఆర్‌ చేపట్టిన దీక్ష విరమణ సందర్భంగా నిమ్మరసం ఇస్తున్న దృశ్యం.. వేదికపై మంత్రి కేటీఆర్‌తో పాటు చెయ్యెత్తి నినాదం చేస్తున్న చిత్రాలు కనిపిస్తున్నాయి.  వీటితో పాటు తెలంగాణ తల్లి, అమరవీరుల స్థూపం, కాళేశ్వరం ప్రాజెక్ట్‌, ఉచిత, నిరంతర విద్యుత్‌ సరఫరాను తలపిస్తూ విద్యుత్‌ స్తంభాల శిల్పాలు ఉన్నాయి.


కాగా, పార్కులో చెక్కిన శిల్పాలు జయశంకర్‌ జీవిత విశేషాల కంటే కేసీఆర్‌, కేటీఆర్‌, ప్రభుత్వ పథకాల నమూనాలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఉద్యమంలో జైళ్లకు వెళ్లి న సీనియర్‌ నాయకులు ఎందరో ఉన్నప్పటికీ పార్కు గోడలపై కేటీఆర్‌ చిత్రం ఉంచడంలో ఔచిత్యమేమిటని ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్‌తో కలిసి జై తెలంగాణ నినాదం ఇవ్వడం కూడా  జయశంకర్‌ జీవిత విశేషాల్లో ఒకటవుతుందా? అని సందేహిస్తున్నారు. ఈ గోడపై రూపొందించిన వాటిల్లో మూడు చిత్రాలు మాత్రమే జయశంకర్‌ జీవితానికి సంబంధించినవి కాగా, మిగిలినవన్నీ కేసీఆర్‌తో కలిసి, కేసీఆర్‌కు నిమ్మరసం ఇస్తున్న జయశంకర్‌, కేసీఆర్‌తో కలిసి ప్రజలకు అభివాదం చేస్తున్నట్లున్న శిల్పం, కేటీఆర్‌తో  కలిసి జై తెలంగాణ నినాదం ఇస్తున్నట్లు ఉన్న శిల్పాలు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం అవన్నీ సార్‌ జీవిత విశేషాలేనని స్పష్టం చేస్తున్నారు.




‘సారు’ విలువను దిగజార్చారు: ఉద్యమ నేతలు గాదె ఇన్నయ్య, పాశం యాదగిరి విమర్శ

సుబేదారి: తెలంగాణ ఉద్యమంలో లేని కేటీఆర్‌ ఫొటోతో జయశంకర్‌ సార్‌ ప్రతిష్టకు భంగం కలిగించి ‘సారు’ విలువను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగజార్చిందని తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్య, సీనియర్‌ పాత్రికేయుడు పాశం యాదగిరి నిరసన వ్యక్తం చేశారు. హన్మకొండలోని ఏకశిల పార్కులో ఏర్పాటు చేస్తున్న ‘సారు’ స్మృతివనంలో జయశంకర్‌తో పాటు కేసీఆర్‌, కేటీఆర్‌, విద్యాసాగర్‌రావు లాంటి వాళ్ల ఫొటోలు శిలాఫలకంపై చెక్కడాన్ని గమనించిన వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటాలు చేసిన ఉద్యమ అమరుల పక్కన బతికున్న వాళ్ల బొమ్మలు పెట్టడం సరికాదన్నారు. చరిత్రలో ఎక్కడా అమరుల పక్కన బతికున్న వాళ్ల ఫొటోలు పెట్టలేదని చెప్పారు.


‘సారు’కు ఉద్యమ పాఠాలు నేర్పిన వారి గురువు ప్రొఫెసర్‌ ఫర్మాజీ, శ్రీధరస్వామి, ఆనందరావు, సత్యనారాయణ, తెలంగాణను ఇచ్చిన సోనియాగాంధీ, సహకరించిన సుష్మాస్వరాజ్‌, మీరాకుమార్‌ బొమ్మలు పెట్టాలని సూచించారు. స్మృతివనం తెలంగాణ ఉద్యమ ప్రతీకగా ఉండాలని అలా లేని పక్షంలో తెలంగాణ ఉద్యమకారులుగా మరో ఉద్యమానికి శ్రీకారం చుడతామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సుప్రీంకోర్టు న్యాయవాది నిరూ్‌పరెడ్డి, కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులు దోనేటి కృష్ణలత, మాసు సావిత్రి, రైల్వే కార్మిక సంఘ నాయకులు కర్ర యాదవరెడ్డి, బీఎల్‌ఎఫ్‌ నాయకులు సాయిని నరేందర్‌, ప్రజాసంఘాల నాయకులు సోమ రామమూర్తి, నలిగంటి చంద్రమౌళి, నల్లెల రాజయ్య, కొండ రాధాకృష్ణ, ఈసంపెల్లి వేణు, జన్ను ప్రమీల, కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T05:30:00+05:30 IST