డిజిటల్ విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు దీనికి తేడాలేమిటో తెలుసా?

ABN , First Publish Date - 2022-02-03T15:46:15+05:30 IST

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్..

డిజిటల్ విశ్వవిద్యాలయం అంటే ఏమిటి? డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌కు  దీనికి తేడాలేమిటో తెలుసా?

2022-23 కేంద్ర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దేశంలో డిజిటల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బడ్జెట్-2022ను సమర్పిస్తూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయాన్ని ప్రకటించారు. కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా విద్యార్థుల చదువులపై ప్రభావం పడిన ప్రస్తుత తరుణంలో డిజిటల్ విశ్వవిద్యాలయ ఏర్పాటును ప్రకటించారు. డిజిటల్ యూనివర్సిటీ ద్వారా అనేక భాషల్లో విద్య అందుబాటులోకి వస్తుందని ఆర్థిక మంత్రి తెలిపారు. దేశంలోని ఏ మారుమూల ప్రాంతాల్లోని విద్యార్థులైనా ఈ యూనివర్సిటీ ద్వారా చదువుకోవచ్చు. దేశంలోని ప్రధాన కేంద్రీయ విశ్వవిద్యాలయాల సహకారంతో దీనిని ప్రారంభించనున్నారు. ఇంతకీ డిజిటల్ యూనివర్శిటీ అంటే ఏమిటి? అది ఎలా ఉండబోతోంది? దూరవిద్యా కార్యక్రమాలను అందించే విశ్వవిద్యాలయాల కన్నా ఇది ఎంత భిన్నంగా ఉండబోతోందనే ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. డిజిటల్ విశ్వవిద్యాలయం పూర్తిగా ఆన్‌లైన్‌ మాధ్యమంలో ఉంటుంది. డిజిటల్ యూనివర్సిటీలో చేరిన విద్యార్థులు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఇంట్లో కూర్చొనే ఆన్‌లైన్‌లో స్టడీస్ పూర్తిచేయవచ్చు. 


దేశంలోని ఏ మారుమూల ప్రాంతం నుంచి అయినా విద్యార్థులు చదువుకునే అవకాశం దీనిలో ఉంటుంది. వివిధ సబ్జెక్టుల నిపుణులు ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా విద్యార్థులకు విద్యను అందిస్తారు. విదేశాల్లోని డిజిటల్ యూనివర్సిటీలు ఈ తరహాలో పనిచేస్తున్నాయి.  స్పెయిన్‌లోని మియా విశ్వవిద్యాలయం దీనికి ఉదాహరణగా నిలుస్తుంది. ఆన్‌లైన్ మాస్టర్, సర్టిఫికేట్ ఎగ్జిక్యూటివ్ ప్రోగ్రామ్‌లను ఇక్కడ అందిస్తున్నారు. ఫ్యాషన్, మార్కెటింగ్, బిజినెస్, కంప్యూటర్ సైన్స్ మొదలైన అనేక విభాగాల్లో పలు కోర్సులు డిజిటల్ యూనివర్శిటీలో అందుబాటులో ఉన్నాయి. మన దేశంలో ఏర్పాటు చేయనున్న డిజిటల్ యూనివర్శిటీలో సర్టిఫికేట్, డిప్లొమా కోర్సులు చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. అయితే దీని గురించి ఇంకా అధికారిక సమాచారం విడుదల కాలేదు. దూరవిద్యా కార్యక్రమాన్ని అందించే ఇగ్నో విశ్వవిద్యాలయం కంటే డిజిటల్ విశ్వవిద్యాలయం ఎలా భిన్నంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. దూరవిద్య విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌లను అందించవు. ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు స్టడీ మెటీరియల్‌ను వారి ఇంటికి.. వర్శిటీ పంపిస్తుంది. ఈ మెటీరియల్‌ సాయంతో వారు చదువుకుంటారు. డిజిటల్ విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యను అందిస్తాయి. సిలబస్‌తో పాటు ఇతర సమాచారం ఆన్‌లైన్‌లో తెలియజేయనున్నారు.  ఆన్‌లైన్ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్రోగ్రామ్‌ల ద్వారా విద్యార్థులు తమ అధ్యయనాలను పూర్తి చేయగలుగుతారు. దేశంలోని మొట్టమొదటి డిజిటల్ యూనివర్శిటీ కేరళలో ఇప్పటికే ప్రారంభమైంది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్ కేరళ (ఐఐఐటీఎం-కే)డిజిటల్ యూనివర్సిటీగా అప్‌గ్రేడ్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లతో పాటు అనేక రకాల కోర్సులు ఇక్కడ అందిస్తున్నారు. సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, మెషీన్ లెర్నింగ్ సహా అనేక సబ్జెక్టుల్లో కోర్సులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో డిజిటల్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ.400 కోట్ల వ్యయంతో డిజిటల్ యూనివర్సిటీ ఏర్పాటు కానున్నదని తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం వెలువడాల్సివుంది. 



Updated Date - 2022-02-03T15:46:15+05:30 IST