వ్యర్థమైన మోదీ మర్యాదలు

Published: Wed, 11 Nov 2020 05:15:27 ISTfb-iconwhatsapp-icontwitter-icon
వ్యర్థమైన మోదీ మర్యాదలు

ప్రధాని మోదీ దౌత్య సంప్రదాయాలు విస్మరించి డొనాల్డ్ ట్రంప్‌కు అమిత ప్రాధాన్యం ఇచ్చారు. ఎంతగా ఇచ్చారంటే అమెరికా ఎన్నికలలో ట్రంప్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు కూడ ప్రయత్నించారు. చివరకు దౌత్యనిపుణుల హెచ్చరికలే నిజమయ్యాయి. అమెరికాకు ఎంత తలవంపులు! ప్రపంచంలోనే అతి పురాతన ప్రజాస్వామిక దేశంలో అధ్యక్ష పదవీ ఎన్నికలు ఒక ప్రహసనంగా మారాయి. ఇందుకు బాధ్యుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అని అనడానికి ఎవరూ సంకోచించడం లేదు. ఇరాన్ అధినేత అయతుల్లా ఖోమెనీ సైతం అమెరికాను ఎద్దేవా చేశారు.


దేశాధినేతలుగా ఉన్నవారు హుందాగా వ్యవహరించాలి. లేని పక్షంలో జాతి ప్రతిష్ఠ మంటగలుస్తుంది. ఇందుకు ట్రంపే ఒక చక్కని ఉదాహరణ. తమ దేశం కంటే తామే గొప్ప అనే భ్రమలో ఒక వాదాన్ని ముందుకు తీసుకు వచ్చి వేగంగా ముందుకెళ్ళిన ముగ్గురు దేశాధినేతలలో ట్రంప్ ఒకరు. మిగిలిన ఇరువురిలో ఒకరు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాగా మరొకరు టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్. ప్రజా సంక్షేమం ఎలా ఉన్నా రాజకీయంగా తమ స్థానాలను బలోపేతం చేసుకోవడానికే ఈ ముగ్గురు నేతలు ప్రాధాన్యమిచ్చారు. శ్వేతజాతి పక్షపాతంతో వ్యవహరించిన ట్రంప్ అధ్యక్ష పదవీ ఎన్నికల్లో పునర్విజయం సాధించడంలో విఫలమయ్యారు. ట్రంప్ వ్యక్తిగత వ్యవహరణ శైలిని పక్కనపెడితే, ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రయోజనాల విషయంలో ఆయన ఎక్కడా రాజీపడలేదు. గల్ఫ్ దేశాలకు సైనిక సహాయం గానీ, భారత్ నుంచి ఉద్యోగాల కొరకు వచ్చే వారి విషయంలో గానీ, చైనాతో వాణిజ్యపోరులో గానీ ట్రంప్ ఖరాఖండిగా వ్యవహరించారు.

అమెరికా ఎన్నికలలో యూదుల పలుకుబడి, పరోక్ష ప్రభావం గణనీయం. విదేశాలలో అమెరికా ఓటర్లు అధికంగా ఉన్న మూడు దేశాలలో ఇజ్రాయేల్ ఒకటి. ఆ దేశం కేంద్రీకృతంగా అమెరికా యూదు రాజకీయాలు కొనసాగుతాయి. ఈ యూదు ఓట్ల కోసం ఇజ్రాయేల్, అరబ్ దేశాల మధ్య సంబంధాలను నెలకొల్పే దిశగా హడావిడి చేసి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్ దేశాలతో ఇజ్రాయేల్‌కు దౌత్య సంబంధాలకు నాంది పలికి అరుదైన ప్రతిష్ఠను ట్రంప్ దక్కించుకున్నారు. అదే విధంగా చైనా సామ్రాజ్య విస్తరణ ఆకాంక్షను కూడా ఆయన అమెరికా ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా గట్టిగా వ్యతిరేకించారు. కానీ ఇవేమీ ట్రంప్‌ను మరోసారి శ్వేత సౌధానికి చేర్చలేకపోయాయి. విదేశీ దేశాధినేతలతో వ్యవహరించే విషయంలో ప్రతి దేశానికి కొన్ని సంప్రదాయాలు, మర్యాదలతో పాటు జాతి ప్రయోజనాలు ఉంటాయి.


అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ అన్ని మర్యాదమన్ననలు, దౌత్య సంప్రదాయాలను విస్మరించారు. ట్రంప్‌తో అవసరానికి మించి చెట్టాపట్టాలేసుకోవడానికి ఆరాటపడ్డారు. అయితే అమెరికా ఆర్థిక ప్రయోజనాల విషయంలో ట్రంప్ పట్టుదల చూపినట్లుగా మోదీ భారత్ ప్రయోజనాల కోసం మొరాయించలేదు. స్వల్పధరకు లభించే ఇరాన్, వెనిజులా చమురును కాదని ధర అధికంగా ఉండే అమెరికన్ చమురును దిగుమతి చేసుకోవడానికి మోదీ ప్రభుత్వం ఆసక్తి చూపడమే ఇందుకొక నిదర్శనం. విద్యార్థులు, ఉద్యోగుల వీసాల జారీపై ట్రంప్ నిబంధనల కారణంగా భారతీయులు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారో అందరికి తెలిసిందే. వాతవరణ కాలుష్యంపై భారత్‌ను కించపరుస్తూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలూ విదితమే.


ఈ సందర్భంగా ఇక్కడ ఒక విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించాలి. అతిథిగా వచ్చిన ఒక దేశాధ్యక్షుడు లేదా ప్రధానమంత్రికి అమెరికా ప్రభుత్వం తరఫున శ్వేత సౌధంలో ఇచ్చే విందును నరేంద్ర మోదీకి ట్రంప్ ఇవ్వలేదు. మన్మోహాన్ సింగ్‌కు మాత్రమే బరాక్ ఒబామా ఈ గౌరవాన్ని నిండుగా ఇచ్చారు. ఈ వాస్తవాన్ని ఉపేక్షించి ట్రంప్‌కు మోదీ అమిత ప్రాధాన్యత ఇచ్చారు. ఎంతగా ఇచ్చారంటే అమెరికా ఎన్నికలలో ట్రంప్‌కు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు కూడా ప్రయత్నించారు. గత ఏడాది ఏకంగా హ్యూస్టన్ నగరంలో పరోక్షంగా ఎన్నికల సభను నిర్వహించి తాను కూడ పాల్గొని ‘అబ్‌ కీ బార్ ట్రంప్‌కి సర్కార్’ అనే నినాదం ఇచ్చి మోదీ సంచలనం సృష్టించారు. దానికి కొనసాగింపుగా, అహ్మదాబాద్‌లో కరోనా వ్యాప్తి ప్రారంభకాలంలో ‘నమస్తే ట్రంప్’ పేరిట భారీసభ నొకదాన్ని మోదీ విజయవంతంగా నిర్వహించారు. రానున్న ఎన్నికలలో ట్రంప్ ఓడితే, ఈ రకమైన చర్యలు భారత్‌కు శ్రేయస్కరం కాదని దౌత్యనిపుణులు, జాతి హితులు అప్పట్లో హెచ్చరించారు. ప్రస్తుత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాలో భారతీయ రాయబారిగా ఉన్నప్పుడు బైడెన్ ఆంతరంగికులతో సన్నిహితంగా ఉండడం ఇప్పుడు మోదీకి కలిసి వచ్చే అంశం.

మొహమ్మద్ ఇర్ఫాన్

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.