ఆదిలోనే కేన్సర్‌ కొమ్ములు వంచాలంటే ఏం చేయాలి...?

ABN , First Publish Date - 2022-06-14T17:02:11+05:30 IST

కేన్సర్‌ వ్యాధిని అంతం చేసే సమర్ధవంతమైన ఔషధాల కోసం ప్రపంచవ్యాప్త పరిశోధనలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రూపొందిన ‘డోస్టర్‌లిమాబ్‌’ అనే ఓ కొత్త..

ఆదిలోనే కేన్సర్‌ కొమ్ములు వంచాలంటే ఏం చేయాలి...?

కేన్సర్‌ వ్యాధిని అంతం చేసే సమర్ధవంతమైన ఔషధాల కోసం ప్రపంచవ్యాప్త పరిశోధనలు నిరంతరంగా జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో రూపొందిన ‘డోస్టర్‌లిమాబ్‌’ అనే ఓ కొత్త కేన్సర్‌ డ్రగ్‌, నూరు శాతం సత్ఫలితాన్నిచ్చి, కేన్సర్‌ చికిత్సలో కొత్త అధ్యాయానికి తెరలేపింది. తాజాగా తెరపైకొచ్చిన ఈ ఔషధం గురించీ, భిన్న కేన్సర్లు, వాటి తత్వాల గురించీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం!


న్నవాహిక మొదలు, పురీషనాళం వరకూ కొన్ని అంతర్గత అవయవ కేన్సర్లు తలెత్తుతూ ఉంటాయి. ఆహార, జీవనశైలులు, అలవాట్ల ఆధారంగా తలెత్తే ఈ కేన్సర్లు విజృంభించే వేగం, వాటి తత్వం ప్రతి వ్యక్తికీ భిన్నంగా ఉంటాయి. అలాగే ఆయా కేన్సర్‌ చికిత్సలకు స్పందించే గుణం కూడా ప్రతి వ్యక్తికీ మారిపోతూ ఉంటుంది. కాబట్టే ఫలానా చికిత్సతో కేన్సర్‌ను సమూలంగా నయం చేయవచ్చని బల్ల గుద్ది చెప్పగలిగే పరిస్థితి ఉండడం లేదు. కాబట్టే కేన్సర్‌ సోకకుండా అప్రమత్తంగా వ్యవహరించడం, సోకిన తర్వాత ప్రారంభ దశలోనే కనిపెట్టి సత్వర చికిత్స అందించడం కేన్సర్‌ నివారణకు మార్గాలని వైద్యులు చెప్తున్నారు. కొన్ని కేన్సర్లలో లక్షణాలను ఇతరత్రా స్వల్ప రుగ్మతలుగా పొరబడి నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు.  బదులుగా వెంటనే అప్రమత్తమై, వైద్యులను ఆశ్రయించగలిగితే, కేన్సర్‌ నుంచి విముక్తి పొందడం తేలికవుతుంది. మిగతా కేన్సర్లతో పోలిస్తే, జీర్ణసంబంధ కేన్సర్లను గుర్తించడం తేలిక. 


జీర్ణకోశ కేన్సర్‌

జీర్ణకోశం లోపలి పొరలోని కణాల్లో కేన్సర్‌ మొదలవుతుంది. జీర్ణాశయంలోని కణాలు గ్యాస్ట్రిక్‌ కేన్సర్‌గా వృద్ధి చెందడానికి ఏళ్ల తరబడి సమయం పడుతుంది. కాబట్టే 60 నుంచి 80 ఏళ్ల పెద్దల్లో ఈ కేన్సర్‌ కనిపిస్తూ ఉంటుంది. 

కారణాలు: గ్యాస్ట్రిక్‌ కేన్సర్‌కు సరైన కారణాన్ని కనిపెట్టలేకపోయినా, అల్సర్లకు దారి తీసే హెచ్‌ పైలోరీ అనే సాధారణ బ్యాక్టీరియల్‌ ఇన్‌ఫెక్షన్‌, ఇన్‌ఫ్లమేషన్‌, పొట్టలో పెరిగే పాలిప్స్‌ అంతిమంగా కేన్సర్లుగా మారతాయని పరిశోధనల్లో తేలింది. ఊబకాయం, ధూమపానం, బొగ్గు, లోహం, రబ్బరు పరిశ్రమల్లో దీర్ఘకాలం పని చేయడం వల్ల కూడా గ్యాస్ర్టిక్‌ కేన్సర్‌ రిస్కును పెంచుతాయి.

చికిత్స: వ్యాధితో బాధపడుతున్న కాలం, శరీరంలో ఆ కేన్సర్‌ విస్తరించిన వైనం ఆధారంగా తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. మొదట సర్జరీతో వ్యాధి సోకిన ప్రాంతం, లింఫ్‌ గ్రంథులను తొలగించడం, లేదా వీటికి అదనంగా సర్జరీకి ముందు, తర్వాత కీమోథెరపీ, రేడియేషన్‌ చికిత్సలను అందించడం జరుగుతుంది. సర్జరీకి ముందు కణితి పరిమాణం తగ్గించడం కోసం కీమో, రేడియేషన్‌ చికిత్సలు ఉపయోగపడితే, సర్జరీ తర్వాత ఇవే చికిత్సలు మిగిలిన కేన్సర్‌ కణాలను చంపడంలో తోడ్పడతాయి.

ఎప్పుడు అనుమానించాలి: అజీర్తితో పాటు, తిన్న వెంటనే కడుపు ఉబ్బరం, ఛాతీలో మంట వేధిస్తున్నా, ఆకలి తగ్గినా, మందులతో ఈ లక్షణాలు తాత్కాలికంగా తగ్గి, తిరగబెడుతూ, పదే పదే వేధిస్తున్నప్పుడు వైద్యులను కలవాలి.

నివారణ: ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, జీవనశైలితో జీర్ణాశయ కేన్సర్‌ను నివారించుకోవచ్చు. అలాగే ప్రాసె్‌సడ్‌ ఫుడ్‌, తీపి పదార్థాలు తగ్గించడం ద్వారా కూడా ఈ కేన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చు.


కేన్సర్‌కు కొత్త మందు 

కేన్సర్‌ వ్యాధి మీద విజయం కోసం ప్రపంచ దేశాలన్నీ నిరంతరంగా పరిశోధనలు, ప్రయోగాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో తాజాగా చేపట్టిన ఓ పరిశోధనలో ‘డోస్టర్‌లిమాబ్‌’ అనే ఓ సరికొత్త ఔషధంతో క్యాన్సర్‌ చికిత్సలో ఆశాజనకమైన ఫలితాలను సాధించవచ్చని రుజువైంది. అమెరికా, మన్‌హట్టన్‌లోని, మెమోరియల్‌ స్లోవన్‌ కెట్టెరింగ్‌ క్యాన్సర్‌ సెంటర్‌లో ఈ ఔషధం సామర్థ్యాన్ని పరీక్షించడం కోసం ఒక చిన్న క్లినికల్‌ ట్రయల్‌ను చేపట్టారు. ఈ ప్రయోగంలో భాగంగా, మూడు నెలలకోసారి చొప్పున ఆరు నెలల పాటు రెక్టల్‌ క్యాన్సర్‌ రోగులకు ఈ ఔషధాన్ని ఇచ్చి చూశారు. ఆరు నెలల తర్వాత ఎమ్మారై, పెట్‌ స్కాన్‌ మొదలైన పరీక్షలు చేసినప్పుడు, ఆ రోగుల్లోని కేన్సర్‌ కణితులు కుంచించుకుపోయి, పరీక్షల్లో నెగటివ్‌ ఫలితాలొచ్చాయి. దాంతో డోస్టర్‌లిమాబ్‌ను, క్యాన్సర్‌ను తుదముట్టించే మహత్తరమైన ఔషధంగా వైద్యులు ప్రకటించడం జరిగింది. అయితే ఈ ఔషధం గురించి మరిన్ని లోతైన పరిశోధనలు జరపవలసి ఉంది. డోస్టర్‌లిమాబ్‌, అన్ని విధాలా సురక్షితమైన ఔషధంగా నిరూపణ అయితే, వైద్య రంగం క్యాన్సర్‌ మహమ్మారి మీద శాశ్వత విజయం సాధించగలుగుతుంది.




అన్నవాహికలో...

ప్రపంచవ్యాప్త కేన్సర్‌ మరణాలకు అన్నవాహిక కేన్సర్‌ అత్యంత సాధారణమైన ఆరవ కారణంగా ఉంటోంది. ఈ కేన్సర్‌లో నోటి నుంచి జీర్ణాశయం వరకూ సాగి ఉండే అన్నవాహిక లోపలి పొరలోని కణాల్లో కేన్సర్‌ పెరుగుతుంది. 

కారణాలు: ధూమపానం, మద్యపానం, అస్తవ్యస్థ ఆహారశైలి, ఊబకాయం

చికిత్స: అన్నవాహిక కేన్సర్‌ రకాన్ని బట్టి తగిన చికిత్సను వైద్యులు ఎంచుకుంటారు. కేన్సర్‌ కణితి మరీ చిన్నదిగా ఉండి, ఆ ప్రదేశానికే పరిమితమై ఉంటే, ఎండోస్కోప్‌ ద్వారా సర్జరీ చేసి, కేన్సర్‌ సోకిన భాగాన్ని తొలగిస్తారు. అవసరాన్ని బట్టి ‘ఈసోఫీజెక్టమీ’ చేసి, వ్యాధి సోకిన అన్నవాహికతో పాటు, జీర్ణకోశం పైభాగం, లింఫ్‌ గ్రంథులు కూడా తొలగించవలసి వస్తుంది. అలాగే కేన్సర్‌ కణాలను చంపడం కోసం సర్జరీకి ముందూ, తర్వాతా కీమోథెరపీ, కొన్ని సందర్భాల్లో కీమోథెరపీతో పాటు రేడియేషన్‌ థెరపీలు కూడా అవసరపడతాయి. 

ఎప్పుడు అనుమానించాలి?: గొంతులో ఆహారం అడ్డుపడినట్టు అనిపిస్తున్నా, మింగడం ఇబ్బందిగా ఉన్నా, ఆహారం జీర్ణం కాకపోతున్నా, ఛాతీలో నొప్పిగా ఉంటున్నా, అసిడిటీ విడవకుండా వేధిస్తున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. నివారణ: దురలవాట్లకు దూరంగా ఉండాలి. అలాగే రోజులు, వారాల తరబడి గొంతులో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రతించాలి.


పెద్ద పేగులో...

పెద్ద పేగుల్లో ఏర్పడే పాలిప్స్‌ కోలన్‌ కేన్సర్‌గా అభివృద్ధి చెందే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఆ పాలిప్స్‌ కేన్సర్‌గా మారేలోపే, వాటిని సర్జరీతో తొలగించే నివారణ చికిత్సను వైద్యులు ఎంచుకుంటూ ఉంటారు. 

కారణాలు: పెద్ద పేగుల లోపలి పొరల్లో ఏర్పడే ఎడినోమేటస్‌ పాలిప్స్‌ కేన్సర్‌గా మారే అవకాశాలు ఎక్కువ. పెద్ద పేగుల్లోని హైపర్‌ప్లాస్టిక్‌ కణాలు కూడా క్యాన్సర్‌గా మారతాయి. 

చికిత్స: కేన్సర్‌ పాలిప్స్‌ వరకే పరిమితమైతే, పాలీపెక్టమీతో వాటిని తొలగిస్తారు. లేదంటే కోలెక్టమీతో పెద్ద పేగులో కొంత భాగాన్ని తొలగించి, విసర్జక క్రియకు ఆటంకం లేకుండా చేస్తారు. తీవ్రతను బట్టి ఎండోస్కోపీ లేదా ల్యాప్రోస్కోపీ విధానాలను వైద్యులు ఎంచుకుంటారు. వీటికి కీమోథెరపీ, రేడియేషన్లు అదనం.

ఎప్పుడు అనుమానించాలి: మలంలో రక్తం కనిపించడం, విరోచనాలు లేదా మలబద్ధకం పదే పదే వేధించడం, మలవిసర్జన తర్వాత కూడా ఆ పని పూర్తిగా జరగలేదని అనిపించడం, రక్తహీనత, వాంతులు మొదలైన లక్షణాలు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.

నివారణ: పాలిప్స్‌ ఏర్పడే అవకాశాలను ముందుగానే గుర్తించగలిగితే కోలన్‌ కేన్సర్‌ నుంచి తప్పించుకోవచ్చు. అలాగే బరువును అదుపులో ఉంచుకుంటూ ఆరోగ్యకరమైన జీవనశైలిని కొనసాగిస్తూ ఈ వ్యాధి నుంచి రక్షణ పొందవచ్చు.


పురీషనాళంలో...

పెద్ద పేగు, పురీషనాళం రెండింట్లో తలెత్తే కేన్సర్లను కోలోరెక్టల్‌ కేన్సర్‌ అని సంబోధిస్తూ ఉంటారు. ఈ రెండు ప్రదేశాలూ చేరువగా ఉండడం మూలంగా, తలెత్తే లక్షణాలు కూడా ఒకేలా ఉన్నప్పటికీ, చికిత్సా విధానాలు భిన్నంగా ఉంటాయి. 

కారణాలు: ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ సిండ్రోమ్‌, మధుమేహం, సూక్ష్మ పోషకాల లోపం, ఊబకాయం, మద్యపానం సేవించడం

చికిత్స: పురీషనాళ కేన్సర్‌ చికిత్స క్లిష్టమైనది. సర్జరీతో కేన్సర్‌ సోకిన భాగాన్ని తొలగించినా, ఇతర అవయవాలకు వ్యాధి సోకిన అనుమానం కలిగినప్పుడు, కీమోథెరపీ, రేడియేషన్‌ చికిత్సలను కలిపి అందించవలసి వస్తుంది. ఎంతో అరుదుగా పెద్ద పేగుతో పాటు పురీషనాళం కూడా తొలగించవలసి వచ్చినప్పుడు మాత్రమే, మిగిలిన పెద్ద పేగు ఓపెనింగ్‌ను పొట్ట దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ఎప్పుడు అనుమానించాలి: డయేరియా, మలబద్ధకం, మలంలో ముదురు ఎరుపు రక్తం కనిపించడం, మలవిసర్జన తర్వాత పొట్ట ఖాళీ కాలేదని అనిపించడం, పొత్తికడుపు నొప్పి, బరువు తగ్గడం, బలహీనత వేధిస్తుంటే రెక్టల్‌ కేన్సర్‌గా అనుమానించాలి. ప్రధానంగా పొట్టలో నొప్పి, మలబద్ధకం, విరోచనాలు మార్చి మార్చి వేధిస్తున్నప్పుడు, మలంలో రక్తం పడుతున్నప్పుడు ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి.

నివారణ: పెద్ద పేగుల్లో పాలిప్స్‌ను ముందుగానే పసిగట్టడం ద్వారా రెక్టల్‌ కేన్సర్‌ను నివారించుకోవచ్చు. అలాగే సమతులాహారం, వ్యాయామాలతో బరువును అదుపులో పెట్టుకోగలిగితే రెక్టల్‌ కేన్సర్‌ నుంచి రక్షణ దక్కుతుంది.





Updated Date - 2022-06-14T17:02:11+05:30 IST