భార్య, ఇద్దరు కూతుళ్లు ఇంట్లో నిద్రపోతున్నారు.. అర్ధరాత్రి అకస్మాత్తుగా అతడిలో మార్పు.. తర్వాత ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-11-28T21:42:20+05:30 IST

త్రిపురలో ఓ వ్యక్తి అప్పటి వరకూ ఎంతో మంచిగా ఉండేవాడు. గతంలో ఎలాంటి నేర చరిత్రా లేదు. కానీ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా అతడు ఊహించని విధంగా మారిపోయాడు.. వివరాల్లోకి వెళితే..

భార్య, ఇద్దరు కూతుళ్లు ఇంట్లో నిద్రపోతున్నారు.. అర్ధరాత్రి అకస్మాత్తుగా అతడిలో మార్పు.. తర్వాత ఏం జరిగిందంటే..
ప్రతీకాత్మక చిత్రం

మనిషి ఒక్కోసారి ఎలా ప్రవర్తిస్తాడో అతడికే తెలీదు. అప్పటి వరకూ మంచిగా ఉన్నవారు.. ఉన్నట్టుండి ఉన్మాదులుగా మారుతుంటారు. ఈ క్రమంలో అత్యాచారాలు, హత్యలూ చేస్తుంటారు. ఇంకొందరు సీరియల్ కిల్లర్లుగా మారి బీభత్సం సృష్టిస్తుంటారు. త్రిపురలో ఓ వ్యక్తి అప్పటి వరకూ ఎంతో మంచిగా ఉండేవాడు. గతంలో ఎలాంటి నేర చరిత్రా లేదు. కానీ అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా అతడు ఊహించని విధంగా మారిపోయాడు.. వివరాల్లోకి వెళితే..


త్రిపురలోని ఖొవాయ్‌ జిల్లాలోని ష్యురాటలీ గ్రామానికి చెందిన ప్రదీప్‌ దేవ్‌రాయ్(40)‌.. భార్యా, ఇద్దరు కూతుళ్లతో కలిసి నివాసం ఉంటున్నాడు. వారి కుటుంబంలో ఎప్పుడూ ఎలాంటి గొడవలూ లేకుండా చాలా అన్యోన్యంగా ఉండేవారు. గ్రామంలో కూడా ప్రదీప్ రాయ్‌కి మంచి పేరు ఉండేది. ఎవరితో ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా.. తన పని తాను చేసుకుంటూ వెళ్లేవాడు. అయితే ఏమైందో తెలీదు గానీ.. ఇటీవల మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. గతంలో కంటే భిన్నంగా ప్రవర్తించేవాడు. అయితే దీనిపై ఇంట్లో వారికి ఎలాంటి అనుమానమూ రాలేదు.


ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రలో ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో ప్రదీప్‌ దేవ్‌రాయ్‌.. ఒక్కసారిగా నిద్రలేచాడు. అతడిలో అనుకోని మార్పులు వచ్చాయి. ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోయాడు. అటూ ఇటూ చూసి ఓ ఇనుపరాడ్ తీసుకున్నాడు. ఇంకో గదిలో నిద్రపోతున్న భార్య, కూతుళ్లపై దాడి చేశాడు. వారిని తీవ్రంగా కొట్టడంతో కూతుళ్లు అక్కడికక్కడే మృతి చెందారు. అడ్డుగా వచ్చిన తమ్ముడిని కూడా చితక్కొట్టడంతో మృతి చెందాడు. తర్వాత రోడ్డు మీదకు పరుగెత్తుకుంటూ వెళ్లి.. అటుగా వెళ్తున్న ఆటోను ఆపాడు. డ్రైవర్, అతడి కుమారుడిని కూడా తీవ్రంగా కొట్టాడు. ఈ దాడిలో డ్రైవర్ అక్కడికక్కడే చనిపోయాడు.


సమాచారం అందుకున్న ఇన్‌స్పెక్టర్‌ సత్యజిత్‌ మల్లిక్‌.. సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నాడు. ఉన్మాదిని అడ్డుకునే క్రమంలో ఇన్‌స్పెక్టర్‌పై కూడా దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన అతన్ని అగర్తల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందితుడి భార్య, ఆటో డ్రైవర్ కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. అనంతరం దేవ్‌రాయ్‌ని అతి కష్టం మీద అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచిన అనంతరం.. మానసిక వైద్యశాలకు తరలించారు. అనుకోని ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

Updated Date - 2021-11-28T21:42:20+05:30 IST