ఏమిటీ రహస్యం?

ABN , First Publish Date - 2022-03-17T08:01:34+05:30 IST

ఏమిటీ రహస్యం?

ఏమిటీ రహస్యం?

ఏపీకి అప్పులు ఎందుకిస్తున్నట్టు? 

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తీరుపై కేంద్ర అధికారుల ఆరా 

మిగిలిన బ్యాంకులన్నీ తప్పుకొన్నా పట్టించుకోరా? 

సూట్‌కేసు కార్పొరేషన్లకు రుణాలివ్వడానికి ఆరాటమేల? 

కేంద్రం, ఆర్‌బీఐ హెచ్చరించినా లెక్కచేయట్లేదేంటి? 

ఏపీఆర్‌డీసీ, బేవరేజెస్‌, సివిల్‌ సప్లైస్‌కి భారీగా రుణాలు 

వైసీపీ సర్కారుకు మితిమీరిన సహకారంపై కూపీ


బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా... వైసీపీ ప్రభుత్వానికి అప్పుల వర్షం కురిపించే కామధేనువైంది. ఎస్‌బీఐ సహా మిగిలిన బ్యాంకులన్నీ దూరంగా ఉంటున్నా... ఈ ఒక్కటీ మాత్రం రాష్ట్రం అడిగినంత అప్పు ఇచ్చేందుకు తహతహలాడుతోంది. కేంద్రం, ఆర్‌బీఐ హెచ్చరించినా ఖాతరు చేయడం లేదు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి) 

వైసీపీ ప్రభుత్వం సృష్టించే సూట్‌కేసు కార్పొరేషన్లకు రుణాలిచ్చేందుకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ఆరాటపడుతోంది. అందుకు అవసరమైన పరిస్థితులు ఏర్పాటు చేసుకుని మరీ ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఆయా కార్పొరేషన్లకు అప్పులివ్వడానికి ఎలాంటి జీవోలు, ఆర్డినెన్స్‌లు, చట్టాలు, ఆదాయ మార్గాలు కావాలో అడిగి మరీ చేయించుకుంటోంది. జగన్‌ సర్కారు కూడా అప్పుల కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించి మరీ ఆ బ్యాంకు కోరిన రీతిలో ఆగమేఘాలపై జీవోలు, ఆర్డినెన్సులు, చట్ట సవరణలు చేస్తోంది. వాస్తవానికి సూట్‌కేసు కార్పొరేషన్ల వ్యవహారం వెలుగులోకి వచ్చాక ఎస్‌బీఐ సహా మిగిలిన అన్ని బ్యాంకులు వాటికి అప్పులివ్వడానికి వెనుకంజ వేస్తున్నాయి. అదే సమయంలో బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం మితిమీరిన ఉత్సుకత చూపడంపై కేంద్ర అధికారులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. ఒకప్పుడు రాష్ట్రంలోని సూట్‌కేసు కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చేందుకు, ఇతర బ్యాంకులతోఇప్పించేందుకు ఎస్‌బీఐ ఉత్సాహం చూపేది. ప్రభుత్వం సృష్టించిన ఏపీఎ్‌సడీసీకి ఎస్‌బీఐ క్యాప్‌ మధ్యవర్తిత్వం వహించి, ఎస్‌బీఐ, ఇతర బ్యాంకులతో రూ.23,200 కోట్లు రుణం ఇప్పించింది. ఒప్పందం ప్రకారం ఏపీఎ్‌సడీసీకి ఎస్‌బీఐ ఇంకా రూ.1,800 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ ఈలోపే ఏపీఎ్‌సడీసీ మోడల్‌ రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తేల్చింది. కేంద్ర ఆర్థికశాఖలోని ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ విభాగం క్లియరెన్స్‌ ఇవ్వకపోవడంతో ఎస్‌బీఐ వెనక్కి తగ్గి ఆ రూ.1,800 కోట్లను ఆపేసింది. బ్యాంకింగ్‌ రంగంలో ఈ ఎపిసోడ్‌ పెను సంచలనమైంది. ఏపీలోని కార్పొరేషన్లకు అప్పులు ఇచ్చేముందు ఆలోచించుకోవాలని అటు కేంద్రం, ఇటు ఆర్‌బీఐ చెప్పడంతో బ్యాంకులు దూరంగానే ఉంటున్నాయి. కానీ బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మాత్రం లెక్క చేయకుండా కార్పొరేషన్లకు రుణాలిచ్చే విషయంలో దూకుడుగా వ్యవహరిస్తోంది. 


అప్పులకు బీఓబీనే దిక్కు 

రాష్ట్రానికి రుణాలిచ్చే విషయంలో ఎస్‌బీఐ తప్పుకోవడంతో రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లకు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడానే దిక్కయింది. ఏపీఎ్‌సడీసీ ద్వారా వైజాగ్‌ కలెక్టరేట్‌, ఎమ్మార్వో కార్యాలయాలు, పాలిటెక్నిక్‌ కాలేజీలు, వందల ఎకరాల ప్రభుత్వ భూములు ఎస్‌బీఐ క్యాప్‌కి తాకట్టు పెట్టినట్టే.. ఏపీఆర్‌డీసీ ద్వారా రోడ్లు, భవనాల శాఖకు ఉన్న స్థలాలు, గెస్ట్‌హౌ్‌సలు, ఇతర స్థిరాస్తులను బ్యాంకులకు తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. ఈ కార్పొరేషన్‌ ద్వారా ఇప్పటికే రూ.5,000 కోట్లు అప్పు తెచ్చినట్టు సమాచారం. ఇప్పుడు కొత్తగా బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి అప్పు తేవడం కోసం ముందుగా ఏపీ రోడ్డు డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ కోసం ఆ బ్యాంకు విజయవాడ బెంజ్‌సర్కిల్‌ శాఖలో ప్రభుత్వం ఎస్ర్కో ఖాతాను తెరిచింది. రాష్ట్రంలో ప్రతి లీటర్‌ పెట్రోల్‌, డీజిల్‌పై జగన్‌ సర్కారు విధిస్తున్న సెస్‌ను ఆ ఖాతాకు మళ్లిస్తున్నారు. ఈ సెస్‌ ఆదాయం ఏడాదికి రూ.750కోట్లు వస్తుంది. దీన్ని ఏపీఆర్‌డీసీ ఆదాయంగా చూపి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి అప్పు తెస్తున్నారు. ఆ బ్యాంకే ఎందుకు సహకరిస్తోంది? రహస్యమేంటనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది. 


అప్పు కోసం అగచాట్లు 

కేవలం అప్పుల కోసమే చట్టబద్ధ హోదా కల్పించిన బేవరేజెస్‌ కార్పొరేషన్‌ను అడ్డంపెట్టుకుని రూ.40 వేల కోట్ల అప్పు తేవాలని జగన్‌ సర్కారు భావించింది. అయితే, ఏపీఎ్‌సడీసీ విషయంలో బ్యాంకులకు ఎదురైన ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా కొన్ని నిబంధనలు విధించింది. వాటిని నెరవేర్చేందుకే స్పెషల్‌ మార్జిన్‌పై జీవో 313, ఆ తర్వాత బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు చట్టబద్ధత కల్పించే ఆర్డినెన్స్‌, ప్రభుత్వం నిర్వహించాల్సిన మద్యం వ్యాపారం, ఆస్తులను బేవరేజెస్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేస్తూ ఇచ్చిన జీవో, తాజాగా ఖజానాకు రావాల్సిన స్పెషల్‌ మార్జిన్‌ ఆదాయాన్ని బేవరేజెస్‌ కార్పొరేషన్‌కే కట్టబెడుతూ గుట్టుచప్పుడు కాకుండా మరో ఆర్డినెన్స్‌ ఇచ్చింది. జీవో 313తో పాటు ఆ ఆర్డినెన్సు రాజ్యాంగ విరుద్ధమైనవి కావడం గమనార్హం. అప్పుల కోసం రాజ్యాంగాన్ని, చట్టాలను ఉల్లంఘించడం మూడేళ్ల నుంచి జగన్‌ ప్రభుత్వానికి సర్వసాధారణమైంది. గత డిసెంబరులో సివిల్‌ సప్లైస్‌ కార్పొరేషన్‌ రూ.5,000కోట్ల అప్పులు తెచ్చుకునేందుకు ఆర్థికశాఖ గ్యారంటీ ఇచ్చింది. అందులో ఇప్పటి వరకు ఎంత తెచ్చారు, అసలు తెచ్చారో లేదో బయటకు రాలేదు. కానీ ఆ రూ.5,000 కోట్లలో రూ.500 కోట్లు బ్యాంకు ఆఫ్‌ బరోడా నుంచి తెచ్చుకునేందుకు ఆ కార్పొరేషన్‌కు అనుమతిస్తూ తాజాగా ఆ శాఖ ఎక్స్‌అఫీషియో సెక్రటరీ జీవో ఇచ్చారు. 

Updated Date - 2022-03-17T08:01:34+05:30 IST