దగ్గు ఆగకపోతే?

ABN , First Publish Date - 2022-09-22T21:10:18+05:30 IST

డాక్టర్‌! నేను తరచూ దగ్గుతో ఇబ్బంది పడుతున్నాను. అయితే మందులు వాడినప్పుడు తగ్గుతూ, ఆపిన తర్వాత తిరగబెడుతూ దగ్గు నిరంతరంగా వేధిస్తూనే ఉంది

దగ్గు ఆగకపోతే?

డాక్టర్‌! నేను తరచూ దగ్గుతో ఇబ్బంది పడుతున్నాను. అయితే మందులు వాడినప్పుడు తగ్గుతూ, ఆపిన తర్వాత తిరగబెడుతూ దగ్గు నిరంతరంగా వేధిస్తూనే ఉంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లేదా?


దగ్గుకు కారణాన్ని కనిపెట్టి, చికిత్స తీసుకుంటే కచ్చితంగా దగ్గు అదుపులోకి వస్తుంది. విడవకుండా వేధించే దగ్గుకు లెక్కలేనన్ని కారణాలుంటాయి.


పొడి దగ్గు: వైర్‌సతో వచ్చే సాధారణ దగ్గు, దగ్గు మందులతో వారం రోజుల్లో తగ్గిపోతుంది. అలా తగ్గకపోతే అది ఎలర్జిక్‌/సీజనల్‌ బ్రాంఖైటిస్‌ (ఎలర్జీ కారక దగ్గు)గా భావించాలి. ఇది సాధారణ మందులతో తగ్గకుండా చల్లగాలి సోకినా, సాయంత్రం వేళ వాతావరణం చల్లబడినా పెరుగుతూ ఉంటుంది. మరీ ముఖ్యంగా రాత్రివేళ దగ్గు ఎక్కువవుతుంది. ఈ దగ్గులో కఫం ఉండదు. మాట్లాడేటప్పుడు కూడా దగ్గు ఎక్కువవుతూ ఉంటుంది. ఆగకుండా దగ్గుతూ ఉండడం మూలంగా పెద్ద వయసు మహిళల్లో ‘యూరినరీ ఇన్‌కాంటినెన్స్‌’ (మూత్రం లీక్‌ అవడం), పొత్తికడుపులో నొప్పి లాంటి ఇబ్బందులూ మొదలవవచ్చు. ఈ దగ్గు చికిత్స చేసినా, వారం నుంచి 15 రోజులపాటు వేధించి క్రమంగా తగ్గుతుంది.


ఎలర్జీ కారకాలు: దుమ్ము, ధూళి, చలి, చల్లని నీళ్లు, పానీయాలు, ఐస్‌క్రీమ్‌లు, కాలుష్యం, పూల పుప్పొడి, పొగ...ఇవన్నీ దగ్గుకు దారితీసే ఎలర్జీ కారకాలు. వీటిని కనిపెట్టి దూరంగా ఉండడం, వైద్యుల పర్యవేక్షణలో యాంటీహిస్టమిన్‌ మందులు వాడడం ద్వారా ఎలర్జీలను అదుపులో ఉంచుకోవచ్చు. ఈ ఎలర్జీను నిర్లక్ష్యం చేస్తే ఇన్‌ఫెక్షన్‌ తోడై కఫం కూడా మొదలవుతుంది. కాబట్టి రాత్రి పూట, మాట్లాడేటప్పుడు దగ్గు పెరుగుతున్నా, సాధారణ దగ్గు మందులతో తగ్గకపోతున్నా ఆలస్యం చేయకుండా వైద్యులను కలవాలి. 


ఎలర్జీ మందులు: సాధారణంగా ఎలర్జీ కారక దగ్గుకూ మెడికల్‌ షాపులో ‘సెట్రిజిన్‌’ లాంటి మందులు కొని వాడేస్తూ ఉంటారు. ఈ మందులు కేవలం లక్షణాలను మాత్రమే కొంతమేరకు అదుపు చేయగలుగుతాయి. కానీ మూల కారణాన్ని సరి చేయలేవు. కాబట్టి దగ్గుకు అసలు కారణాన్ని కనిపెట్టి, తగిన చికిత్సను ఎంచుకోవాలి.


-డాక్టర్‌ సుధీర్‌ రెడ్డి తళ్లపురెడ్డి

కన్సల్టెంట్‌ ఇ.ఎన్‌.టి, హెడ్‌ అండ్‌ నెక్‌ సర్జన్‌,

3 సెన్సెస్‌ ఇ.ఎన్‌.టి స్పెషాలిటీ క్లినిక్‌, హైదరాబాద్‌.

Updated Date - 2022-09-22T21:10:18+05:30 IST