మనసు అలసిపోతే ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే.!

ABN , First Publish Date - 2022-06-21T19:25:54+05:30 IST

ఒంటరితనం ఒక జీవిత దశ. అది ఏ వయసులోనైనా పలకరించవచ్చు. అయితే కదిలే రైలు ఎలాగైతే స్టేషన్లను దాటుకుని ముందుకు వెళ్లిపోతుందో, అలాగే ప్రతి వ్యక్తీ ఈ జీవిత దశను..

మనసు అలసిపోతే ఏం చేయాలి? దానికి పరిష్కారం ఏంటి? నిపుణులు ఏమంటున్నారంటే.!

ఒంటరితనం ఒక జీవిత దశ. అది ఏ వయసులోనైనా పలకరించవచ్చు. అయితే కదిలే రైలు ఎలాగైతే స్టేషన్లను దాటుకుని ముందుకు వెళ్లిపోతుందో, అలాగే ప్రతి వ్యక్తీ ఈ జీవిత దశను కూడా దాటుకుని ముందుకు సాగిపోతూ ఉండాలి. కానీ కొందరు అక్కడే ఆగిపోయి, దాన్లోనే ఇరుక్కుపోయి, అంతిమంగా జీవితాలను అంతం చేసుకుంటూ ఉంటారు. ఇందుకు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ ప్రత్యూష గరిమెళ్ల ఆత్మహత్య ఒక ఉదాహరణ. విజయవంతమైన కెరీర్‌, కీర్తి ప్రతిష్ఠలు, అద్భుతమైన భవిష్యత్తు.. ఇవేవీ ఆమె ఆత్మహత్యను ఆపలేకపోయాయి. ఇందుకు కారణాలు, పరిష్కారాల గురించి మానసిక నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం!


అన్నీ ఉన్నా ఏదో తెలియని లోటు. అందరి మధ్యన ఉన్నా, అంతుపట్టని ఏకాంతం. స్నేహితులు, సన్నిహితులు... చుట్టూరా ఎంత మంది ఉన్నా, నా అన్నవాళ్లు, మనసు విప్పి మాట్లాడుకోగలిగే వాళ్లు లేకపోవడం... ఇలాంటి ఒంటరితనం జీవితంలో ఉన్నత స్థానానికి ఎదిగిన విజయవంతమైన వ్యక్తులకు ఎదురయ్యే అత్యంత సాధారణ సమస్య. నా కోసం ఎదురు చూసే వ్యక్తి, నా గురించి ఆలోచించే వ్యక్తి, నా కోసం పరితపించే వ్యక్తి ఒకరుండాలని ఆశపడడం తప్పు కాదు. కానీ సదరు వ్యక్తుల లోపం వల్ల ఒంటరివాళ్లమనే భావనలో కూరుకుపోవడం, జీవించడం వ్యర్థం అనే ఆలోచనతో ఆత్మహత్యకు పూనుకోవడం మాత్రం సరి కాదు. నిజానికి ఇలాంటి ఒంటరి భావనను... ఎవరికి వారు, లేదా వారి సన్నిహితులు, కుటుంబసభ్యులు గ్రహించి, దాని తీవ్రతను, పర్యవసానాలను పసిగట్టి, మానసిక నిపుణుల సహాయం తీసుకోగలిగితే, ఆత్మహత్యకు అడ్డుకట్ట వేయవచ్చు.


దొరకని దాని కోసం వెంపర్లాడుతూ...

జీవితం విజయవంతంగా సాగిపోతున్న వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడినప్పుడు, ఆ అవసరం ఏముంటుందా? అని ఆశ్చర్యపోతూ ఉంటాం. కానీ సకలం ఉన్నా, వాటన్నిటినీ అనుభవించాలనే ఆలోచన వీళ్లలో కొరవడుతుంది. మనం అపురూపంగా భావించే కెరీర్‌ పరమైన విజయాలను కూడా వీళ్లు విజయాల్లా పరిగణించరు. సక్సెస్‌ అనేది రావాలి కాబట్టి వచ్చిందనే అభిప్రాయంతో ఉంటారే తప్ప, తమ స్వయంకృషిగా భావించరు. పైగా డబ్బుతో కొనలేని వాటి కోసం వెంపర్లాడుతూ, ‘ఆ అదృష్టం నాకు లేదు, నాకు ప్రాప్తం లేదు, ఇక ఈ జీవితం ఇలా ముగిసిపోవలసిందే’ అనే ధోరణితోనే వ్యవహరిస్తారు. ఇలా ఒంటరితనానికి లోనైన వాళ్లు జీవితంలోని అనుకూలతలకు బదులుగా ప్రతికూలతలకే ప్రాధాన్యం ఇస్తూ ఉంటారు. ఆ ప్రతికూలతలు డబ్బుతో కొనలేనివి కాబట్టి, పూడ్చలేని లోటుగానే మిగిలిపోయి, డిప్రెషన్‌కు దారి తీస్తూ ఉంటాయి. ఈ రకమైన మానసిక కుంగుబాటు అంతిమంగా ఆత్మహత్యకు పురిగొల్పుతుంది.


ఆత్మపరిశీలన అవసరం

నిరాశ, నిస్సహాయత... మానసిక కుంగుబాటుకు ప్రధాన సంకేతాలు. నా సమస్య పరిష్కారమయ్యే మార్గాలే లేవు, నా సమస్యను ఎవరూ పరిష్కరించలేరు... లాంటి నిరాశ, నిస్సహాయతలు జీవితం మీద విరక్తిని కలిగిస్తాయి. నిజానికి ఆత్మహత్యకు ముందు, ఈ నిరాశ, నిస్సహాయ పరిస్థితికి లోనవకుండా ఉండడం కోసం, సదరు వ్యక్తులు వీలున్న ప్రయత్నాలన్నీ చేసే ఉంటారు. అందుకోసం వంద అడుగులు వేసి ఉంటారు. ఫలితం దొరకకపోవడంతో, నూట ఒకటో అడుగు వేసినా ఉపయోగం ఉండదేమోననే భావన కలిగి, వాళ్లలో ఆత్మహత్య ఆలోచనలు మొదలవుతాయి. అయితే ఆ ఆలోచనలు నిర్ణయానికి దారి తీయకుండా ఉండాలంటే ఎవరికి వారు కొన్ని లక్షణాలను గమనించుకోవాలి. అవేంటంటే...


  • ఇష్టపడి చేసే పనుల మీద ఆసక్తి, ఏకాగ్రత తగ్గుతాయి
  • జీవితం బోర్‌గా, ఖాళీగా అనిపించడం
  • మనసులోని బాధను ఇతరులతో పంచుకోడానికి వెనకాడడం, సిగ్గుపడడం
  • చేద్దామని మొదలుపెట్టిన పనిని, మధ్యలోనే వదిలేస్తూ ఉండడం
  • నిద్ర పట్టకపోవడం, ఆకలి లేకపోవడం
  • శ్రేయస్సును కోరే వ్యక్తులతో సైతం మనసులోని బాధను పంచుకోవాలని అనిపించకపోవడం
  • ఎవరికి చెప్పినా ప్రయోజనం ఉండదు, నా సమస్యను ఎవరూ తీర్చలేరు అనే ‘సైలకాజికల్‌ లోన్లీనెస్‌’కు గురవడం
  • చనిపోవడమే పరిష్కారం అనే ఆలోచన కలగడం

ఆత్మహత్యను ఇలా ఆపుదాం

ఎవరికి వారు ఒంటరితనం తాలూకు డిప్రెషన్‌ లక్షణాలను గ్రహించినప్పుడు, వాటిని తమలోనే దాచుకోకుండా, సన్నిహితులు, స్నేహితులు, కుటుంబ సభ్యులకు తెలియపరచాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఒంటరితనానికి లోనైనప్పుడు, మనసును మెలిపెట్టే బాధను ఇతరులతో మాటల్లో వ్యక్తపరచాలి. ఇందుకు సిగ్గుపడకూడదు. గుండె, కాలేయం, మూత్రపిండాలు.. ఈ అవయవాలన్నీ పని చేసీ, చేసీ ఎలా అలసిపోతాయో, మెదడు కూడా ఒక సమయానికి అలసిపోతుంది. దాన్ని డిప్రెషన్‌ లాంటి పేర్లతో సంబోధించడం అనవసరం. గుండె ఉన్న వాళ్లకు గుండె సమస్యలు ఎంత సహజమో, మనసు ఉన్న ప్రతి ఒక్కరికీ మానసిక సమస్యలు అంతే సహజం అనే విషయాన్ని అర్థః చేసుకోవాలి. కాబట్టి అలసిన మనసు సేద తీరడం కోసం మనసు విప్పి మాట్లాడాలి. 


కొట్టిపారేయకూడదు

‘‘నీకు డిప్రెషన్‌ ఏంటి? నీకేం తక్కువ. నీ స్థానంలో నేనుంటేనా?’’... అన్ని విధాలా ఉన్నతమైన జీవితం గడిపే వ్యక్తులు తమ మానసిక పరిస్థితి గురించి చెప్పినప్పుడు, స్నేహితులు, సన్నిహితుల నుంచి వచ్చే సమాధానాలివి. కానీ ఇలా వాళ్లను ఆత్మన్యూనతకు, సిగ్గుకు లోను చేయకూడదు. డిప్రెషన్‌ను... అంతగా పట్టించుకోవలసిన అవసరం లేని విషయంగానో, పనిలేని వాళ్లు అవసరానికి మించి ఆలోచించి తెచ్చుకునే విషయంగానో తేలికగా తీసిపారేసేలా మాట్లాడకూడదు. బదులుగా సదరు వ్యక్తి, ఇటీవలి కాలంలో అనుకోని ఒత్తిడికీ, బాధకూ, ఊహించని పరిణామానికీ లోనయ్యారా? అనేది గమనించాలి. దీర్ఘకాలికంగా హుషారు తగ్గినా, ఆసక్తి లోపించినా, మాటల్లో, ప్రవర్తనలో తేడాలు కనిపించినా, ‘ఈ జీవితం వేస్ట్‌, చూడండి... నేను ఏదో ఒక రోజు చచ్చిపోతాను, నేను చస్తే పీడా పోతుంది’ లాంటి మాటలు మాట్లాడుతున్నా, ఉద్యోగానికీ, కాలేజీకి వెళ్లకపోతున్నా, గదిలో ఒంటరిగా ఉండిపోతూ ఉండడం, ఎక్కువగా మెబైల్‌ ఫోన్‌తో గడుపుడూ ఉంటున్నా...వెంటనే అప్రమత్తం కావాలి. సాధారణంగా ఎవరైనా మానసికంగా కుంగిపోయినప్పుడు, అందరూ చుట్టూ చేరి, భుజం తట్టి, భరోసా ఇచ్చి ఎవరి దారిన వాళ్లు వెళ్లిపోతారు. కానీ అలా చేతులు దులుపుకుని వెళ్లిపోకుండా, డిప్రెషన్‌కు గురైన వ్యక్తి చెప్తున్నది సానుకూలంగా వినాలి. అంతకంటే ముఖ్యంగా వైద్య సహాయం అవసరమనే నమ్మకాన్ని వాళ్లకు కలిగించాలి.


  • ఒంటరితనం ఇలా దూరం
  • అభిరుచులు ఏర్పరుచుకోవాలి
  • నచ్చిన పనులు చేయడానికి పూనుకోవాలి
  • సోషల్‌ గ్రూప్స్‌ ఏర్పరుచుకోవడం, స్పోర్ట్స్‌ యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవడం చేయాలి
  • బుక్‌ ఫ్రెండ్స్‌, పెన్‌ ఫ్రెండ్స్‌ను పెంచుకోవాలి
  • అభిప్రాయాలూ, అభద్రతాభావాలను సన్నిహితులతో పంచుకుంటూ ఉండాలి
  • పరిస్థితుల ప్రభావంతో ఆవరించే ఒంటితనం తాత్కాలికం అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి

ఆ ధోరణి మారాలి

మానసిక వైద్యులను కలవడాన్ని  చిన్నతనంగా భావించే ధోరణిలో మార్పు రావాలి. ‘ఈ సమస్యను పరిష్కరించడమెలాగో మాక్కూడా అర్థం కావడం లేదు. పద మనందరం కలిసి మానసిక వైద్యుల సలహా తీసుకుందాం’ అంటూ, సమస్యను ఒక కుటుంబ వ్యవహారంగా పరిగణించే ధోరణి అలవరుచుకోవాలి. అలాగే ‘నీ మెదడు అలసిపోయింది. పద ఆ శక్తిని నింపగలిగే వ్యక్తిని కలుద్దాం’ అంటూ సానుకూలంగా మాట్లాడాలి. అంతే తప్ప డిప్రెషన్‌, యాంగ్జయిటీ, స్కిజోఫ్రోనియా’...లాంటి పదాలను వాడి, సమస్యతో వాటిని ముడిపెట్టి మాట్లాడకూడదు. బదులుగా ‘మానసికంగా నీ మనసు అలసిపోయింది. నీ మనసుకు విశ్రాంతి కావాలి. అందుకు ఉపాయాలు మానసిక వైద్యులే అందించగలుగుతారు’ లాంటి మాటలు మాట్లాడాలి. కుటుంబసభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో పాటు, కాలేజీలో లెక్చరర్లు, ఆఫీసులో సహోద్యోగులు... ఇలా అందరూ ధోరణిని మార్చుకోవాలి.


శాశ్వత చికిత్స సాధ్యమే!

మానసిక సమస్యలకు దీర్ఘకాలిక చికిత్స సత్ఫలితాన్నిస్తుంది. మందులు, కౌన్సెలింగ్‌ వైద్యులు సూచించినంత కాలం వాడవలసి ఉంటుంది. మందులు మెదడును మార్పులకు గురి చేసే రసాయనాల పనితీరును చక్కబరిస్తే, కౌన్సెలింగ్‌.. సమస్యను చూసే దృక్కోణాన్ని సరిదిద్దుకోడానికి సహాయపడుతుంది. అయితే చాలా మంది, కొంత కాలం మందులు వాడిన తర్వాత, పరిస్థితి చక్కబడింది కదా అని అర్థాంతరంగా మానేస్తూ ఉంటారు. దీంతో సమస్య మళ్లీ తిరగబెట్టే వీలుంటుంది.


ప్లానింగ్‌ ఉండొచ్చు, ఉండకపోవచ్చు

ప్రత్యూషలా సూసైడ్‌ను పగడ్బంగీగా ప్లాన్‌ చేసుకునే వాళ్లు తక్కువ. జీవితంలో పదే పదే మోసపోవడం, పదే పదే దెబ్బలు తినడం, పదే పదే బంధాలు ఏర్పడుతూ తెగిపోతూ ఉండడం, జీవితంలో ఎంత దూరం ప్రయాణం చేసినా ఒంటరిగా మిగిలిపోతూ ఉండడం... ఇవన్నీ తీవ్రమైన డిప్రెషన్‌కు దారి తీసి, ఆత్మహత్య ఆలోచన బలపడడానికి దోహదపడతాయి. కానీ 80ు నుంచి 90ు ఆత్మహత్య నిర్ణయాలు ఒక రోజు ముందు తీసుకునే ‘ఇంపల్సివ్‌ సూసైడ్స్‌’ మాత్రమే! వీటికి అంతగా ప్లానింగ్‌ ఉండదు. అయితే ఆత్మహత్య ఆలోచనే డిప్రెషన్‌ తీవ్ర స్థాయికి చేరుకుందనడానికి సూచన. అప్పటికే ఎంతో ఆలస్యం జరిగిపోయిందని అర్థం చేసుకోవాలి. ‘నేను బ్రతకడం వృథా, చనిపోవడమే సరైన పని’ అనే ఆలోచన ఆత్మహత్యకు రెండు నుంచి మూడు  నెలల ముందే తలెత్తుతుంది. అయితే దాన్ని అమల్లో పెట్టాలనే నిర్ణయం వ్యక్తులను బట్టి మారుతుంది. ఎక్కువ మంది అప్పటికప్పుడు అమలు చేస్తే, అరుదుగా కొందరు పక్కా ప్రణాళికతో, పగడ్బందీగా ప్రాణాలు తీసుకుంటారు. 




-డాక్టర్ కల్యాణ చక్రవర్తి

కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్,

ల్యూసిడ్ డయాగ్నొస్టిక్స్,

బంజారాహిల్స్, హైదరాబాద్.



Updated Date - 2022-06-21T19:25:54+05:30 IST