కేంద్ర ప్రభుత్వంపై ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి ఆగ్రహం

ABN , First Publish Date - 2022-03-03T22:01:24+05:30 IST

ఈ చేసే సహాయం ఏదో మేము ఉక్రెయిన్‌లో ఉన్నప్పుడు చేయవచ్చు కదా.. ఇక్కడికి వచ్చాక గులాబీలు ఇస్తున్నారు. ఏం చేసుకొమ్మంటారు ఇప్పుడు వీటితో? మాకు మేముగా అనేక కష్టనష్టాలకు ఓర్చి ఉక్రెయిన్ సరిహద్దు దాటి హంగేరి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి మాకు సహాయం అందింది..

కేంద్ర ప్రభుత్వంపై ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థి ఆగ్రహం

న్యూఢిల్లీ: ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారత విద్యార్థులను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకువస్తోంది. ఇలా వస్తున్న క్రమంలో ఒక విద్యార్థి భారత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. ఇక్కడికి వచ్చాక గులాబీలు ఇవ్వడం కాదు, మేము ఉక్రెయిన్‌లో చిక్కుకున్నప్పుడే ఏదైనా చేసి ఉండాల్సిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ విద్యార్థి మాట్లాడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉక్రెయిన్ సరిహద్దు దాటి వస్తున్న విద్యార్థుల కోసం సరిహద్దు దేశాల్లో భారత ప్రభుత్వం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసింది. ఇలా ఏర్పాటు చేసిన విమానాల్లో ఒకటి హంగేరి నుంచి గురువారం ఉదయం ఢిల్లీకి చేరుకుంది. ఈ విమానంలో వచ్చిన విద్యార్థులను ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో మీడియా ప్రశ్నించింది. విద్యార్థులు ఒక్కొక్కరుగా తమ ప్రయాణంలోని అనుభవాల్ని, ఉక్రెయిన్‌లోని భయానక పరిస్థితుల గురించి చెప్పుకుంటూ వచ్చారు. ఇంతలో బిహార్‌లోని మొతిహారికి చెందిన దివ్యన్షు సింగ్ అనే విద్యార్థిని ప్రశ్నించగా కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించాడు.


‘‘ఈ చేసే సహాయం ఏదో మేము ఉక్రెయిన్‌లో ఉన్నప్పుడు చేయవచ్చు కదా.. ఇక్కడికి వచ్చాక గులాబీలు ఇస్తున్నారు. ఏం చేసుకొమ్మంటారు ఇప్పుడు వీటితో? మాకు మేముగా అనేక కష్టనష్టాలకు ఓర్చి ఉక్రెయిన్ సరిహద్దు దాటి హంగేరి వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం నుంచి మాకు సహాయం అందింది. అంతకు ముందు మాకు ఎలాంటి సహాయం అందలేదు. పది మంది గ్రూపుగా ఏర్పడి ఒక ట్రైన్ పట్టుకుని సరిహద్దు వరకు వచ్చాము. ఆ ట్రైన్ చాలా మందితో నిండిపోయింది. అందులోనే సరిహద్దుకు చేరుకున్నాం. స్థానికులు మాకు సహాయం చేశారు. మాతో ఎవరూ దురుసుగా ప్రవర్తించలేదు. పొలాండ్ సరిహద్దులో విద్యార్థులపై దురుసుగా ప్రవర్తిస్తున్నారని విన్నాం. దానికి మన ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చాక పూలు ఇవ్వడం కాదు. క్లిష్ట పరిస్థితి వస్తుందని తెలినప్పుడే స్పందించాలి. అమెరికా వారి విద్యార్థుల్ని ఎంతో ముందుగానే తీసుకెళ్లింది. మన ప్రభుత్వం అలా ఎందుకు చేయలేదు? అక్కడి నుంచి వస్తున్న విద్యార్థులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. సరిహద్దు దాటాక కాదు, ఉక్రెయిన్‌లో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఏది చేసినా అక్కడి నుంచే ప్రారంభించండి’’ అని దివ్యన్షు సింగ్ అన్నాడు.

Updated Date - 2022-03-03T22:01:24+05:30 IST