ఏమిటీ బదిలీలు..?

ABN , First Publish Date - 2022-08-08T07:57:10+05:30 IST

ఏమిటీ బదిలీలు..?

ఏమిటీ బదిలీలు..?

సీఎస్‌ ఏం చేస్తున్నారు?

తన పదవీకాలం పొడిగించుకుంటే చాలా?

మమ్మల్ని 3 నెలలకోసారి మార్చేస్తారా?

కీలక పోస్టుల్లో నాన్‌-కేడర్‌ వాళ్లా?

మాకివ్వాల్సినవి వారికెలా ఇస్తారు?

అసోసియేషన్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో పలువురు ఐఏఎస్‌ల ఫైర్‌

తీర్మానం చేసి ఇవ్వాలని నిర్ణయం


రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గితే మంచి మంచి పోస్టింగులు.. లేదంటే అప్రాధాన్య పదవులు.. విచక్షణ లేకుండా పదే పదే బదిలీలు.. ఇతర రాష్ట్రాల నుంచి డిప్యుటేషన్‌పై వచ్చిన వారికి అందలం.. ఐఏఎస్‌లకు ఇవ్వాల్సిన కేడర్‌ పోస్టుల్లో అస్మదీయులైన నాన్‌-ఐఏఎస్‌లకు పట్టం కట్టడంపై రాష్ట్ర ఐఏఎస్‌ అధికారులు పలువురు ఆగ్రహంతో ఉన్నారు. దీనికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తమ సమస్యలపై ప్రత్యేక తీర్మానం చేసి ఆయనకు అందజేయాలని తీర్మానించుకున్నారు.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

చీటికీ మాటికీ తమను ఇష్టారాజ్యంగా బదిలీలు చేస్తుండడంపై రాష్ట్ర ఐఏఎ్‌సల సంఘం మండిపడింది. ప్రతిభ ఆధారంగా కాకుండా ఇతర కారణాలతో పోస్టింగులు ఇవ్వడం.. మూడు నెలల వ్యవధిలోనే ఒక చోట నుంచి మరో చోటకు బదిలీలు చేయడం సరైన పద్ధతి కాదని పలువురు ఐఏఎ్‌సలు మండిపడ్డారు. అసోసియేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ (ఈసీ) శనివారం సాయంత్రం 7 గంటల నుంచి దాదాపు రాత్రి 11 గంటల వరకూ సుదీర్ఘంగా తమ సమస్యలపై చర్చించింది. ఈ మధ్య కాలంలో ఇంత సమయం పాటు ఈసీ మీటింగ్‌ నిర్వహించిన దాఖలాలు లేవు. శనివారం మాత్రం ప్రత్యేకంగా జూమ్‌ కాన్ఫరెన్స్‌ పెట్టుకుని మరీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అభ్యంతరం వ్యక్తం చేసింది.  అలాగే దాదాపు 22 పోస్టుల్లో నాన్‌-ఐఏఎ్‌సలకు పోస్టింగులు ఇవ్వడాన్ని ఆక్షేపించారు. రాష్ట్రంలో ఐఏఎ్‌సల కొరత లేదని.. అయినా నాన్‌-ఐఏఎ్‌సలకు కీలక పోస్టింగులు ఇవ్వడం.. ప్రత్యేకంగా ఐఏఎ్‌సలకు కేటాయించాల్సిన పోస్టుల్లో ఇతర కేడర్‌ అధికారులను  కూర్చోబెట్టడాన్ని తప్పుబట్టారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మే  ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఉండాల్సిందని ఒకరిద్దరు సభ్యులు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. సీఎస్‌ ఎంత సేపూ తన పదవీ కాలాన్ని పొడిగించుకోవడంపైనే ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారని.. ఇతర అధికారుల సర్వీసు అంశాలపై శ్రద్ధ చూపించడం లేదన్న ధోరణిలో చాలా సమయం చర్చ జరిగినట్లు సమాచారం. ఐఏఎ్‌సల పోస్టింగులపై ఆయన ప్రభుత్వానికి పలు సూచనలు ఇవ్వాల్సి ఉండగా.. అసలు పట్టించుకోవడం లేదని.. దీనిని అసోసియేషన్‌ తరఫున తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. అందులో భాగంగా ఇతర సర్వీసుల నుంచి వచ్చిన వారికి కీలక పదవులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ.. చీటికీమాటికీ విచక్షణరహితంగా బదిలీలు చేయడాన్ని నిరసిస్తూ అసోసియేషన్‌ ప్రత్యేక తీర్మానం చేయాలని పలువురు ఈసీ సభ్యులు సూచించారు. దీనిపై త్వరగా సరైన నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.


జీఏడీలో మరో ఐఏఎస్‌ ఉండాలి!

ఐఏఎ్‌సల పోస్టింగులు, బదిలీలు, సర్వీసు అంశాలు చూసేందుకు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ)లో గతంలో ఓ ఐఏఎస్‌ అధికారి ఉండేవారు. తమకేమైనా ఇబ్బందులుంటే అధికారులు ఆయన్ను కలిసి చెప్పుకొనేవారు. ఆయన ద్వారా సీఎ్‌సకు సమాచారం చేరేది. అయితే ఇప్పుడు పోస్టింగులు, బదిలీలన్నీ సీఎస్‌ చూస్తున్నారు. విభాగాధిపతి ఆయనే అయినప్పటికీ.. ఐఏఎ్‌సలు చిన్నా పెద్దా ప్రతి అంశాన్నీ నేరుగా ఆయనకు చెప్పుకొనే వీల్లేకుండా పోయింది. ఎందుకంటే వివిధ సమీక్షలు, సమావేశాలు, విధుల్లో ఆయన తీరిక లేకుండా ఉంటారు. అందుచేత ఆయన్ను కలిసే అవకాశం ఐఏఎ్‌సలకు దొరకడం లేదు. ఈ నేపథ్యంలో జీఏడీలో మరో ఐఏఎస్‌ అధికారిని నియమించాల్సిందిగా కోరాలని సంఘం నిశ్చయించింది.


వసూల్‌ రాజా అంశం పక్కకు..

ఐఏఎ్‌సల అసోసియేషన్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు వెనుక పెద్ద తతంగమే నడిచింది. వాస్తవంగా ‘వసూల్‌ రాజా’ వ్యవహారంపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రచురించిన కథనాలను ఖండించాలన్న ప్రధాన ఎజెండాతో ఏర్పాటు చేయగా.. తొలుత చాలా మంది ఐఏఎ్‌సలు వ్యతిరేకించారు. అయితే కొందరు ఐఏఎ్‌సలు ప్రభుత్వం వద్ద మెప్పు కోసం జూమ్‌ కాన్ఫరెన్స్‌ పెట్టాల్సిందే.. వసూల్‌ రాజా అంశంపై చర్చించాల్సిందేనని పట్టుబడ్డారు. దీంతో అసోసియేషన్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌ ఏర్పాటు చేయాల్సి వచ్చింది. అయితే ఆ అంశాన్ని ఎజెండాలో పెట్టలేదు. కేవలం మూడు అంశాల ఎజెండాను విడుదల చేశారు. కానీ ఆ ఎజెండాను కూడా దాటి అనూహ్యంగా కొత్త విషయాలను సభ్యులు తెరపైకి తెచ్చారు.  వసూల్‌ రాజా అంశంపై చర్చించాల్సిన జూమ్‌ కాన్ఫరెన్స్‌ బూమరాంగ్‌ అయి.. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై సుదీర్ఘంగా చర్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చెప్పినట్లు వినని ఐఏఎ్‌సలను కొద్ది రోజుల వ్యవధిలోనే వేర్వేరు పోస్టులకు బదిలీ చేస్తున్న విషయాన్ని ‘ఆంధ్రజ్యోతి’ ఆయా సందర్భాల్లో వెలుగులోకి తీసుకొచ్చింది. సరిగ్గా అదే పంథాలో ఐఏఎ్‌సల అసోసియేషన్‌ జూమ్‌ కాన్ఫరెన్స్‌లో చర్చించడం గమనార్హం. మరో కీలక విషయం ఏమిటంటే.. వసూల్‌ రాజా అంశంపై ఖండించేందుకు ఏర్పాటు చేసిన ఈ జూమ్‌ కాన్ఫ్‌రెన్స్‌ను చాలా మంది ఐఏఎ్‌సలు వ్యతిరేకించారు. దూరంగా ఉంటే మంచిదని కొందరు.. మనకెందుకులే అని మరికొంత మంది తొలుత పాల్గొనలేదు. కానీ ఐఏఎ్‌సలకు జరుగుతున్న అన్యాయం. ఇబ్బందులపై చర్చ జరుగుతుందని తెలుసుకుని చాలా మంది జూమ్‌ లింక్‌ ద్వారా కాన్ఫరెన్స్‌లో చేరారు. ఇందులో పాల్గొన్న వారిలో ఎడాపెడా బదిలీలకు గురైన ఒక సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కూడా ఉండడం విశేషం.

Updated Date - 2022-08-08T07:57:10+05:30 IST