మొదట కోవాగ్జిన్.. రెండో డోసుగా కోవిషీల్డ్ వేసుకున్నాడో వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2021-05-22T20:13:07+05:30 IST

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ భారత్‌లో మొదలైంది. తాజాగా 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

మొదట కోవాగ్జిన్.. రెండో డోసుగా కోవిషీల్డ్ వేసుకున్నాడో వ్యక్తి.. చివరకు ఏం జరిగిందంటే..

కరోనా మహమ్మారిని నియంత్రించడానికి ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సిన్ డ్రైవ్ భారత్‌లో మొదలైంది. తాజాగా 18ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మన దేశంలో ప్రస్తుతం కొవ్యాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవలే రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ వాడకానికి కూడా భారత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడు ప్రజల్లో తలెత్తుతున్న కొత్త ప్రశ్న.. తొలి డోస్ కొవ్యాక్సిన్ తీసుకుంటే రెండో  డోసును కోవిషీల్డ్ తీసుకోవచ్చా? ఇలా తీసుకుంటే ఏం జరుగుతుంది.? అలా తీసుకున్న వారి పరిస్థితి ఏంటి? ఎటువంటి హాని జరుగుతుంది? ఈ ప్రశ్నలు చాలా మందిలో కలుగుతున్నాయి. మరి ఈ ప్రశ్నలకు నిపుణులు ఎటువంటి సమాధానాలు ఇస్తున్నారో ఓ లుక్కేయండి. 


సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తున్న ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కోవిషీల్డ్ లేదంటే భారత్ బయోటెక్ లిమిటెడ్ తయారు చేసిన కోవ్యాక్సిన్.. ఈ రెండే మనదేశంలో ప్రధానంగా తీసుకుంటున్న టీకాలు. భారతదేశంలో ఇప్పటికి సుమారు 17.7 కోట్ల మంది ప్రజలకు ఈ రెంటిలో ఏదో ఒక వ్యాక్సిన్ అందింది. వీరిలో 3.9 కోట్లమంది రెండో డోసు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా వినిపిస్తున్న ప్రశ్న ఏంటంటే.. కొవ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్న వ్యక్తి రెండో డోసుగా కొవిషీల్డ్ తీసుకోవచ్చా? లేదంటే కొవిషీల్డ్ తీసుకున్న వ్యక్తి రెండో డోసులో కోవ్యాక్సిన్ తీసుకోవచ్చా?. నిపుణులు మాత్రం ప్రస్తుతం ఇలాంటి పనులు వద్దనే చెప్తున్నారు. తొలి డోసు ఏ టీకా తీసుకుంటే రెండో డోసు అదే తీసుకోవాలని సూచిస్తున్నారు.


ప్రస్తుతం సైంటిస్టులను కూడా ఈ ప్రశ్న వేధిస్తోంది. అందుకే ఈ విషయంలో ట్రయల్స్ వేస్తున్నారట. ఇలా రెండు రకాల వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల ప్రజలకు మరింత మేలు కలుగుతుందా? అనే దిశగా పరిశోధనలు చేస్తున్నారు. తాజాగా ఇలా వ్యాక్సిన్ల మిక్సింగ్‌పై చేస్తున్న పరిశోధనలో మోడెర్నా, నోవావ్యాక్స్ టీకాలను కూడా చేర్చినట్లు సమాచారం. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ కూడా ఇలాంటి ప్రయోగాలే చేస్తోంది. ఆక్స్‌ఫర్డ్/ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇచ్చిన వారికి రెండో డోసుగా ఫైజర్ టీకా వంటి ఇతర వ్యాక్సిన్లు ఇచ్చి పరిశోధన చేస్తోందీ వర్సిటీ. ఇలా చేయడం వల్ల వచ్చే శరీరంలో వచ్చే రియాక్షన్లు, రోగనిరోధక వ్యవస్థ స్పందనలను శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు.


మనదేశంలో కూడా ఉత్తరప్రదేశ్‌లో ఇలాంటి ఒక ఘటన జరిగింది. యూపీలోని మహారాజ్‌గంజ్‌కు చెందిన ఉమేష్ అనే వ్యక్తికి పొరపాటున రెండు రకాల వ్యాక్సిన్లు ఇచ్చారట. స్థానిక చీఫ్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ వద్ద ఉమేష్ ఉద్యోగం చేస్తున్నాడు. తొలిసారి కోవ్యాక్సిన్ తీసుకున్న ఉమేష్‌కు పొరబాటున రెండో డోసుగా కోవిషీల్డ్ ఇచ్చారట. అయితే ఇలా జరగడం వల్ల ఉమష్‌లో ఇప్పటి వరకూ ఎలాంటి సైడ్ ఎఫెక్టులూ రాలేదని ఇక్కడి చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో) ఏకే శ్రీవాత్సవ స్పష్టం చేశారు. కానీ సాధ్యమైనంత వరకు తొలి డోసుగా ఏ వ్యాక్సిన్ తీసుకుంటే రెండోసారి కూడా అదే వ్యాక్సిన్ తీసుకోవడం ఉత్తమం.

Updated Date - 2021-05-22T20:13:07+05:30 IST