వ్యాక్సిన్ తీసుకోండి.. లేదంటే నరకం చూస్తాం: అమెరికన్లను వేడుకుంటున్న నిపుణులు

ABN , First Publish Date - 2021-07-25T11:24:54+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా డెల్టా దెబ్బకు వణుకుతోంది. ఇక్కడ రోజురోజుకూ డెల్టా వేరియంట్ సోకిన వారి సంఖ్య పెరిగిపోతోంది.

వ్యాక్సిన్ తీసుకోండి.. లేదంటే నరకం చూస్తాం: అమెరికన్లను వేడుకుంటున్న నిపుణులు

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా డెల్టా దెబ్బకు వణుకుతోంది. ఇక్కడ రోజురోజుకూ డెల్టా వేరియంట్ సోకిన వారి సంఖ్య పెరిగిపోతోంది. ఈ వేరియంట్ ధాటికి అమెరికాలో నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్య గడిచిన రెండు వారాల్లో 166శాతం పెరిగింది. ఈ క్రమంలో జరిగిన ఒక అధ్యయనం భయంతో నిద్ర దూరం చేసే నిజాలు బయటపెట్టింది. వ్యాక్సినేషన్ గనుక ఇదే వేగంతో సాగితే.. అక్టోబరు నెలలో ఈ మహమ్మారి పీక్స్ చేరుతుందని ఈ సర్వేలో తేలింది. ఒక మ్యాథమెటికల్ మోడల్‌ సాయంతో ఈ అంచనా వేశారు. అంతేకాదు అప్పటికి ప్రతిరోజూ 2,40,000 కరోనా కేసులు నమోదవుతాయని, కనీసం 4వేల మంది ప్రతిరోజూ చనిపోతారని ఈ అధ్యయనం తేల్చింది. ప్రస్తుతం అమెరికాలో కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో డెల్టా వేరియంట్ సోకిన వారే 82శాతం ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆందోళన కనబరుస్తున్న నిపుణులు ప్రజలందరూ త్వరగా వ్యాక్సిన్ తీసుకోవాలంటూ అభ్యర్థించారు. కాగా, కరోనా ఇంతలా పెరుగుతున్నా కూడా కొన్ని రాష్ట్రాలు కరోనా కేసుల లెక్కలను రోజువారీగా కాకుండా వారానికి ఒకసారి విడుదల చేయడం విమర్శలకు దారితీస్తోంది.

Updated Date - 2021-07-25T11:24:54+05:30 IST