నేను ఏది మాట్లాడినా కాంగ్రెస్‌ ఎదుగుదల కోసమే

ABN , First Publish Date - 2022-07-05T09:45:57+05:30 IST

తాను ఏది మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదల, విజయం కోసమేనని, తన మాటలను ప్రతికూలంగా తీసుకోవద్దని కాం పార్టీ శ్రేణులకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు.

నేను ఏది మాట్లాడినా కాంగ్రెస్‌ ఎదుగుదల కోసమే

  • రాజకీయాల్లో ఎత్తుగడలు ఉంటాయి
  • నేను మాట్లాడిందీ వ్యూహమే అనుకోండి
  • కార్యకర్తలు గందరగోళపడొద్దు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, జూలై 4 (ఆంధ్రజ్యోతి): తాను ఏది మాట్లాడినా కాంగ్రెస్‌ పార్టీ ఎదుగుదల, విజయం కోసమేనని, తన మాటలను ప్రతికూలంగా తీసుకోవద్దని కాం పార్టీ శ్రేణులకు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. రాజకీయ రంగంలో అనేక ఎత్తుగడలు, వ్యూహాలూ ఉంటాయని చెప్పారు. తాను మాట్లాడిన మాటలూ వ్యూహంలో భాగమే అనుకోవాలని, కార్యకర్తలు ఎవరూ గందరగోళ పడవద్దన్నారు. తన లైన్‌ ఎప్పుడూ కాంగ్రెస్‌ పార్టీనేనని, సోనియా, రాహుల్‌ల నాయకత్వంలోని కాంగ్రెస్‌కు ఎప్పుడూ విశ్వాసపాత్రుడిగానే ఉంటానని స్పష్టం చేశారు. గాంధీభవన్‌లో సోమవారం మీడియా సమావేశంలో కిసాన్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేశ్‌ రెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేతలు వీరన్న, కంది కృష్ణతో కలిసి ఆయన మాట్లాడారు. 


మూడు రోజులుగా మీడియాలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలనే చూపిస్తున్నారని, సరిగ్గా ప్రధాని వచ్చే రోజునే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాను ఆహ్వానించిన సీఎం కేసీఆర్‌ మీడియా స్పేస్‌లో తానూ జొరపడ్డారని వ్యాఖ్యానించారు. బీజేపీది ఎత్తుగడ అయితే.. కేసీఆర్‌ది పై ఎత్తుగడని, తమది ఇంకో ఎత్తుగడని చెప్పారు. మోదీ, యశ్వంత్‌సిన్హాలు వచ్చిన రోజున.. సాయంత్రం ఐదున్నర గంటలకు తాను పత్రికా సమావేశం పెట్టిన తర్వాత మీడియా మొత్తం కాంగ్రెస్‌ వైపే దృష్టి సారించిందన్నారు. పది మందికి ఏది ఉపయోగపడుతుందో.. అదే తాను మాట్లాడతానని, కాంగ్రెస్‌ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే తాను మాట్లాడతానని తెలిపారు. తాను కాంగ్రెస్‌లోనే ఉంటానని, పార్టీని అధికారంలోకీ తీసుకువస్తానన్నారు. వ్యవస్థ, సమాజానికి మంచి జరుగుతుందంటే తాను దేనికైనా సిద్ధపడతానని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇసుక మాఫియాకు డాన్‌.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు సంతో్‌షకుమార్‌ అంటూ జగ్గారెడ్డి ఆరోపించారు. కరీంనగర్‌ కేంద్రంగా ఇసుక మాఫియా నడుస్తోందని, దీనికి కేసీఆర్‌ కుటుంబ సభ్యుల మద్దతు ఉందన్నారు.


మోదీ సభ ఫెయిల్‌ 

పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రధాని మోదీ సభ ఫెయిల్‌ అయిందని జగ్గారెడ్డి ఆరోపించారు. ఆ సభకు పది లక్షల మంది వస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పారని, కానీ వచ్చింది 50 వేల మందేనని చెప్పారు. మోదీ పర్యటన, బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల వల్ల తెలంగాణకు ఎలాంటి ఉపయోగమూ లేదన్నారు. ప్రతి పేదవాడి ఖాతాలో రూ.15 లక్షల జమ, ఇతర హామీల గురించి ప్రధాని మోదీ చెబుతాడేమోనని ప్రజలు ఆశపడ్డారని, కానీ నిరాశే ఎదురైందన్నారు. ఇక ఏం ముఖం పెట్టుకుని రాష్ట్రంలో పాదయాత్ర చేస్తున్నారంటూ బండి సంజయ్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిలను ప్రశ్నించారు. సంజయ్‌ ఎప్పుడు పాదయాత్ర మొదలు పెడితే అప్పుడు తాను వెళ్లి హామీల గురించి అడుగుతానని చెప్పారు. జిల్లాల వారీగా దేవుళ్ల పేర్లు చెప్పిన ప్రధాని మోదీ..  వేములవాడ రాజన్న, సమ్మక్క సారలమ్మ, మెదక్‌ చర్చి, సికింద్రాబాద్‌ దర్గాల గురించి మాత్రం మర్చిపోయారన్నారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌లు ప్రజలకు చేసిన వాగ్దానాలను అమలు చేయడంలేదని ఆయన విమర్శించారు.

Updated Date - 2022-07-05T09:45:57+05:30 IST