Advertisement

ఏమున్నది గర్వ కారణం?

Jun 28 2020 @ 00:22AM

దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా ఒకే రోజు 30 లక్షల ఇళ్లస్థలాలను మంజూరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వ పెద్దలు అందులో జరిగిన అవినీతిని చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. టార్గెట్‌ను చేరుకోవాలన్న ఆరాటంలో నివాసానికి ఉపయోగపడని ప్రాంతాలను కూడా ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్నారు. లబ్ధిదారులకు సదరు స్థలాలు కేటాయించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ‘‘ఎందుకూ పనికిరాని స్థలాలను ఇస్తారా?’’ అంటూ లబ్ధిదారులే నిందిస్తారు. అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కేటాయించకుండా వికృతానందం పొందుతున్నారు. సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలను వంచిస్తున్నారు. ‘ఆ కులానికి అంత.. ఈ కులానికి ఇంత’ అంటూ కాకి లెక్కలు చెబుతున్నారు. లబ్ధి పొందుతున్నవారి సంఖ్యను గమనిస్తే రాష్ట్రంలో జనాభా తగ్గిపోయిందా? అన్న అనుమానం కలుగుతోంది. ఇందులోని మర్మాన్ని తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతో సమయం పట్టదు.


రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే విధానానికి జగన్‌రెడ్డి స్వస్తి చెప్పని పక్షంలో ఆయనను సమర్థించేవారు కూడా ఆత్మరక్షణలో పడిపోతారు. మందబలం ఉందన్న కారణంగా గిట్టనివారిని అదేపనిగా వేధిస్తూపోతే నష్టపోయేది ఎవరు? ఒకప్పుడు జగన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి జైలులో పెట్టడం వల్లనే కదా ఆయన పట్ల ప్రజలు సానుభూతి చూపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, చివరకు యనమల, చినరాజప్ప వంటివారిని ఇలాగే వేధిస్తే సానుభూతి పవనాలు వారివైపు మళ్లకుండా ఉంటాయా? రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా వంటి ప్రధాన వ్యవస్థలన్నీ ఇవ్వాళ జగన్‌రెడ్డి ప్రభుత్వ బాధితులుగానే మిగిలాయి. అధికార వ్యవస్థలో కూడా గిట్టనివారిని బాధితులుగా మార్చే శారు. ‘‘వ్యవస్థలతో శత్రుత్వం ఏమిటి? అందరూ ఎల్వీ సుబ్రహ్మణ్యం వలె చేతులు ముడుచుకుని కూర్చోరు.. జాగ్రత్త!’’ అని ఉండవల్లి చేసిన హెచ్చరిక జగన్‌ మంచికే!


‘‘ప్రభుత్వానికి సరైన న్యాయ సలహాలు అందడం లేదు. సరైన సలహాలు ఇవ్వకుండా కోర్టులను నిందిస్తే ఎలా? మాకూ అంతంత మాత్రంగానే ఆ సలహాదారుల సహకారం. ఏ వ్యక్తికీ, ఏ ప్రభుత్వానికీ కోర్టులు వ్యతిరేకం కాదు’’.. మూడు రోజుల క్రితం ఏపీ హైకోర్టు ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు ఇవి! ‘‘ఇదేమి పాలన? ఎన్నికల కమిషన్‌తో, న్యాయమూర్తులతో గొడవలా? ప్రత్యర్థులను అణచివేయడానికేనా అధికారం?’’ అంటూ అదే రోజు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పలు ప్రశ్నలు సంధించారు. ఈ రెండు పరిణామాలు ఒకే రోజు జరగడం యాదృచ్ఛికం కావొచ్చు గానీ, నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే ప్రస్తుత ప్రభుత్వంపై వ్యవస్థలలోని ప్రముఖులలో గూడు కట్టుకున్న అసంతృప్తికి సంకేతాలుగా భావించవచ్చు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయమై ఏర్పడిన వివాదంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో సోషల్‌ మీడియాలో న్యాయమూర్తులను దారుణంగా కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై హైకోర్టు ధర్మా సనం తమ మనోగతాన్ని వివరించింది. ప్రభుత్వానికి సరైన న్యాయ సలహాలు అందడంలేదని న్యాయస్థానం అభిప్రాయపడుతున్నది గానీ, వాస్తవంలో జరుగుతున్నది వేరు.


ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి సలహాలు ఇవ్వగల మొనగాడు ఎవ్వరూ రాష్ట్రంలో లేరన్నది పచ్చి నిజం. ప్రభుత్వాలు సలహాదారులను నియమించుకోవడం పరిపాటి! ఆయా అంశాలపై సలహాలు, సూచనలు చేయవలసిందిగా ప్రభుత్వాధినేతలు సంబంధిత సలహాదారులను కోరుతుంటారు. జగన్మోహన్‌రెడ్డికి మాత్రం ఈ సూత్రం వర్తించదు. పూర్వాశ్రమంలో తనకు సహాయపడిన లేదా సహకరించిన వారికి పునరావాసం కల్పించడానికే ఆయన కొంత మందిని సలహాదారుల పదవుల్లో నియమించుకున్నారు. అడ్వకేట్‌ జనరల్‌ను కూడా తప్పదు కనుక నియమించుకున్నారు. న్యాయ నిపుణుల సలహాలను పాటించిన పక్షంలో హైకోర్టులో గానీ, సుప్రీంకోర్టులో గానీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇన్ని తీర్పులు వచ్చి ఉండేవి కావు. మన వ్యవస్థలో న్యాయ వ్యవస్థకు ఉన్న ప్రాధాన్యాన్ని అంగీకరించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం గానీ, ఆ రాష్ట్ర అధికారులు గానీ విజ్ఞత ప్రదర్శిస్తున్నారు. కరోనా విషయమై ప్రతిరోజూ సమగ్ర వివరాలను మీడియాకు అందించాలన్న హైకోర్టు ఆదేశాన్ని తెలంగాణలోని ప్రభుత్వ అధికారులు అమలుచేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల వివరాల విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదన్న అనుమానాలు పలువురిలో ఉన్నాయి. జిల్లా స్థాయిలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ధ్రువీకరిస్తున్న కేసులను కూడా జిల్లా కలెక్టర్లు ప్రకటించడం లేదు. అదేమని ప్రశ్నించిన విలేకరులపై కేసులు పెడతామంటూ కొంతమంది జిల్లా కలెక్టర్లు బెదిరిస్తున్నారు. ‘యథా రాజా.. తథా అధికారులు’ అన్నట్టుగా పరిస్థితి ఉంది.


జగన్మోహన్‌రెడ్డి రాజ్యంలో న్యాయస్థానాల ఆదేశాలకు కూడా విలువ లేకుండా పోయింది. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఉదంతమే ఇందుకు నిదర్శనం. చికిత్స అందిస్తున్న ఆసుపత్రిలోనే అచ్చెన్నాయుడుని విచారించాలని ఏసీబీ న్యాయస్థానం ఆదేశించినప్పటికీ, ఆయనను అర్ధరాత్రి సమయంలో డిశ్చార్జి చేయాల్సిందిగా ఆసుపత్రి వైద్యులపై ఒత్తిళ్లు తెచ్చారు. ఇలా చేయవచ్చునని ఏ న్యాయ ప్రముఖుడు కూడా ఏ ప్రభుత్వానికీ సలహా ఇవ్వడు. ప్రత్యర్థులపై పగతో రగిలిపోతున్న జగన్మోహన్‌రెడ్డి మాత్రమే ఇలా ఆలోచించగలరు. అచ్చెన్నాయుడిని ఎలాగైనా జైలుకు పంపాలన్న పట్టుదల ఉన్నప్పుడే ప్రభుత్వ పెద్దలు ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడతారు. ఇలాంటి సంఘటనలను గమనించే ఏ న్యాయస్థానం అయినా ప్రభుత్వ చర్యలను సమర్థించగలదా? ‘‘రాజ్యాంగబద్ధమైన సంస్థలలో నియమితులైన వారితో ఆటలా?’’ అని సుప్రీంకోర్టే ఆక్షేపించినప్పటికీ.. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ విషయంలో జగన్‌ ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవడం లేదు. ఈనెల 13వ తేదీన హైదరాబాద్‌లోని పార్క్‌ హయత్‌ హోటల్‌లో భారతీయ జనతా పార్టీ ఎంపీ సుజనాచౌదరిని, అదే పార్టీకి చెందిన కామినేని శ్రీనివాస్‌, ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌ కలుసుకోవడాన్ని జగన్‌ అండ్‌ కో భూతద్దంలో పెట్టి చూపించడానికి ప్రయత్నించింది. రమేశ్‌కుమార్‌ను సస్పెండ్‌ చేయాలని అధికార పార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే తన అజ్ఞానాన్ని ఒలకబోసుకున్నారు. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించిన తర్వాత కూడా రమేశ్‌కుమార్‌ను పదవీ బాధ్యతలు చేపట్టకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటున్న విషయం విదితమే! ప్రభుత్వం దృష్టిలో ఆయన ఎన్నికల కమిషనర్‌ కాదు.


అలాంటప్పుడు ఆయన ఎవరిని కలిస్తే ఏమిటంట? ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం యాదృచ్ఛికం కావొచ్చు. అంతమాత్రాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడికి ఈ వ్యవహారంతో ముడిపెట్టవచ్చునా.. అంటే ఆ విషయాన్ని ఎంపీ విజయసాయిరెడ్డిని అడగాల్సి ఉంటుంది! ‘‘దేవుడు రాసిన స్ర్కిప్ట్‌ ఎంతో గొప్పగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీకి చెందిన 23మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు ఎంపీలను చేర్చుకున్నందుకు శిక్షగా చంద్రబాబు పార్టీ తరఫున అంతేమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారు’’ అని జగన్మోహన్‌రెడ్డి ఎగతాళి చేశారు. గత ఎన్నికలలో జగన్మోహన్‌రెడ్డి మొత్తం 151 మంది ఎమ్మెల్యే సీట్లను, 22 మంది ఎంపీ సీట్లను గెలుచుకోవడంపై పలువురు ఆశ్చర్యపోయారు. నిజానికి దేవుడు రాసిన గొప్ప స్ర్కిప్ట్‌ ఇదే! ఇంత భారీ మెజారిటీ రావడం వల్లనే హద్దు–అదుపు లేకుండా జగన్మోహన్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. ప్రత్యర్థులను వేటాడటానికి అధికారాన్ని విశృంఖలంగా వాడుకోగలుగుతున్నారు. ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌కుమార్‌తో పోరాడటానికై ఆయనకు అంతటి భారీ మెజారిటీని ప్రజలు సమకూర్చలేదు కదా? న్యాయమూర్తులతో ఘర్షణపడటానికి అధికారం ఇవ్వలేదు కదా? మాస్కులు అడిగిన డాక్టర్‌ సుధాకర్‌ను, ఫేస్‌బుక్‌లో ఒక పోస్టును షేర్‌ చేసిన రంగనాయకమ్మను వేధించడానికి ప్రజలు అంతటి ఘన విజయాన్ని కట్టబెట్టలేదు కదా? 2024లో జరిగే ఎన్నికలలో వీళ్లెవ్వరూ ముఖ్యమంత్రి పదవికి పోటీ పడరు కదా? మరి ఇంకెందుకు? అంటే.. జగన్మోహన్‌రెడ్డి మాత్రమే సమాధానం చెప్పాలి. అధికార దుర్వినియోగం పరాకాష్ఠకు చేరిందంటే పతనం కాచుకుని ఉన్నట్టే! ఇవన్నీ చూస్తుంటే ముఖ్యమంత్రిలో అభద్రతాభావం ఏమైనా ఉందా? అన్న అనుమానం కలుగకమానదు. తెలుగుదేశం పార్టీని ప్రత్యర్థిగా భావించారంటే అర్థంచేసుకోవచ్చు.


న్యాయమూర్తులు ప్రత్యర్థులు కారే? రాష్ట్రపతి హోదాలో వి.వి.గిరి సుప్రీంకోర్టులో స్వయంగా హాజరైన ఉదంతాన్ని ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చక్కగా వివరించారు. మన వ్యవస్థలో న్యాయమూర్తుల ముందు ఎవరైనా చేతులు కట్టుకుని నిలబడాల్సిందే! అవినీతికి సంబంధించి 11 కేసులలో విచారణను ఎదుర్కొంటున్న జగన్మోహన్‌రెడ్డి ఎంత? జగన్‌ అవినీతికి పాల్పడలేదనీ, పులుకడిగిన ముత్యమనీ ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టలేదు. రాజశేఖర్‌రెడ్డి కుమారుడు అవడం, దాదాపు పదేళ్లపాటు ముఖ్యమంత్రి పదవి కోసం కలవరిస్తూ ప్రజల్లోనే ఉండిపోవడంతో జాలిపడి అధికారం కట్టబెట్టారు. జగన్‌ విషయంలో ఎవరి అభిప్రాయాలు వారికి ఉన్నాయి. ప్రైవేటు సంభాషణలలో ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేస్తారో అందరికీ తెలిసిందే! అయితే ఇప్పుడాయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక ఆ పదవికి ఉన్న ఔన్నత్యం వల్ల ఆయనను అందరూ గౌరవిస్తున్నారు. ఇది గమనించని జగన్‌ తనను తాను మహాశక్తివంతుడిగా ఊహించుకుని రాజ్యాంగానికి కూడా తాను అతీతుడను అన్నట్టు దుందుడుకుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో అధికార పార్టీకి చెందిన కొంతమంది ఆయన భజన చేస్తూ పునీతులవుతున్నారు. కరోనా వైరస్‌ గురించి ప్రపంచానికే తెలియని సమయంలో.. అంటే గత ఏడాది డిసెంబరులోనే ఈ వైరస్‌ గురించి మంత్రిమండలి సమా వేశంలో ముఖ్యమంత్రి హెచ్చరించారని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమైన అపోలో టైర్స్‌ కంపెనీ శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్‌లో ఉత్పత్తి చేసిన తొలి టైర్‌ను ప్రదర్శించగా..


‘‘జగన్మోహన్‌రెడ్డి అనుసరిస్తున్న విధానం ఫలితమే ఇది’’ అని ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు కోసం జగన్‌ ప్రభుత్వం వీసమెత్తు ప్రయత్నం చేయకపోగా.. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ను ఏకంగా ముఖ్యమంత్రి ఎగతాళి చేశారు. అయినా అపోలో టైర్స్‌ ఏర్పాటును తమ ఖాతాలో వేసుకోవడానికి విజయసాయిరెడ్డి ప్రయత్నం చేశారు. వైసీపీకి చెందిన కొంతమంది మంత్రులు, శాసనసభ్యులైతే హద్దులు లేని అభిమానం ప్రదర్శిస్తూ దేవుడు తర్వాత అంతటివాడు జగన్మోహన్‌రెడ్డి అని కీర్తిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ‘గోపాల.. గోపాల’ సినిమాలో హీరో వెంకటేశ్‌ను కొంతమంది స్వార్థపరులు ఏకమై దేవుడుగా మార్చడానికి ప్రయత్నించిన సన్నివేశం గుర్తుకువస్తోంది. వైసీపీలో ముఖ్యమంత్రి భజన చేస్తున్నవాళ్లంతా కలిసి జగన్‌ను కూడా ఎప్పుడో ఒకప్పుడు దేవుడే అని ముద్ర వేసేస్తారేమో తెలియదు! కొంతమందికి డబ్బు పంచినంత మాత్రాన దేవుళ్లు అయిపోరు. సంక్షేమ పథకాల ఫలాలు అనుభవిస్తున్నవాళ్లు కష్టపడి సంపాదించి పన్నులు చెల్లిస్తున్నవారికి కృతజ్ఞతలు చెప్పాలి గానీ, రాజకీయ నాయకులకు కాదు. జగన్‌ గానీ, చంద్రబాబు గానీ, కేసీఆర్‌ గానీ.. మరొకరు గానీ తమ జేబులో నుంచి తీసి పంచిపెట్టడంలేదు.


 వేధింపులు.. ఓ హెచ్చరిక!

ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వాళ టెర్రర్‌ వాతావరణం నెలకొన్నది. సోషల్‌ మీడియా వేదికగా వ్యాఖ్యలు చేస్తున్నవారిపై పుంఖానుపుంఖాలుగా కేసులు పెడుతున్నారు. మరోవైపు ప్రతిపక్షానికి చెందినవారిపై అవినీతి కేసులతోపాటు ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు పెడుతున్నారు. అయ్యన్నపాత్రుడు వంటివారిపై నిర్భయ చట్టాన్ని కూడా ప్రయోగిస్తున్నారు. ప్రశ్నించే మీడియాపైనా కేసులు పెట్టుకుంటూపోతున్నారు. గుంటూరు జిల్లా మాచర్లలో వైసీపీకి చెందినవాళ్లు తెలుగుదేశం సానుభూతిపరుడిపై దాడి చేశారని వార్తలు వచ్చాయి. ఈ వార్త ప్రసారం చేసినందుకుగాను ‘‘దాడి చేసిన వాళ్లు వైసీపీ వాళ్లు అనడానికి మీ వద్ద ఆధారాలు ఉన్నాయా? లేకపోతే మీపై చర్యలు తీసుకుంటాం’’ అని స్థానిక పోలీస్‌ అధికారి మీడియా ప్రతినిధులు కొందరికి నోటీసులు ఇచ్చారు. ఇలాంటి నోటీస్‌ జారీ చేసే అధికారాన్ని సదరు పోలీస్‌ అధికారికి ఎవరు ఇచ్చారో తెలియదు! మహా అయితే వైసీపీ వాళ్లు అభ్యంతరం చెబుతారు. దాడి చేసిన వాళ్లు వైసీపీ వాళ్లు కాకపోతే ఆ పార్టీ పరువునష్టం కేసులు వేసుకుంటుంది. పోలీసాయనకు వచ్చిన ఇబ్బందేమిటో తెలియదు! సోషల్‌ మీడియాలో కామెంట్లు చేయడం నేరమైతే.. ముందుగా అధికార పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిని అరెస్ట్‌ చేయాలి. ఎంతోమందిని కించపరుస్తూ ఆయన వ్యాఖ్యలు పోస్ట్‌ చేశారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. విశాఖపట్టణానికి చెందిన ఒక మహిళకు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్‌ మధ్య ఏదో జరిగిందంటూ సోషల్‌ మీడియాలో పోస్టులను పంచుకున్న వారిపై కేసులు పెట్టించిన విజయసాయిరెడ్డి.. తన పోస్టుల విషయంలో ఆదర్శంగా ఎందుకు ఉండలేకపోతున్నారు? అధికార పార్టీలో ఆయన నెంబర్‌ టూగా చలామణి అవుతున్నారు కదా! ఆ స్థాయికి చేరుకున్న వ్యక్తి హుందాగా వ్యవహరించాల్సింది పోయి చిల్లరగా వ్యాఖ్యలు చేస్తూ ట్వీట్లు చేయడం ఏంటి? ఈ నేపథ్యంలోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సైతం విజయసాయిరెడ్డి ధోరణిని పేరెత్తకుండా విమర్శించారు. తనకు గాడ్‌ ఫాదర్‌ వంటివాడైన రాజశేఖర్‌రెడ్డి కుమారుడు కావడం వల్ల కాబోలు జగన్మోహన్‌రెడ్డి విషయంలో ఉండవల్లి ఇంతకాలం మౌనంగా ఉన్నారు.


రాజశేఖర్‌రెడ్డి హయాంలో జరిగింది కలెక్షన్‌ మాత్రమేననీ, కరప్షన్‌ కాదనీ ఒక ప్లీడర్‌గా తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించిన ఉండవల్లి.. ఇప్పుడు జగన్‌ విషయంలో తన ఆవేదనను కొంతమేర కక్కేశారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరిట దోపిడీ జరుగుతోందని అంటూనే ఇది ప్రభుత్వ అసమర్థత కావొచ్చని జగన్‌కు కొంత వెసులుబాటు కల్పించే ప్రయత్నం చేశారు. అయితే అర్థంపర్థం లేని బ్రాండ్‌ల మద్యాన్ని అధిక ధరలకు విక్రయించడంలో ఏదో మతలబు ఉందని చెప్పకనే చెప్పారు. ఉండవల్లి మాత్రమే కాదు.. విజ్ఞులందరూ రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాల పట్ల ఆవేదన చెందుతున్నారు. కేసుల భయంతో కొందరు నోరు మెదపలేక పోవచ్చు గానీ, జరుగుతున్నది ఏమిటో అందరికీ అర్థమవుతోంది. దేశ చరిత్రలోనే ఎక్కడా జరగని విధంగా ఒకే రోజు 30 లక్షల ఇళ్లస్థలాలను మంజూరు చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న ప్రభుత్వ పెద్దలు అందులో జరిగిన అవినీతిని చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. టార్గెట్‌ను చేరుకోవాలన్న ఆరాటంలో నివాసానికి ఉపయోగపడని ప్రాంతాలను కూడా ఇళ్ల స్థలాల కోసం సేకరిస్తున్నారు. లబ్ధిదారులకు సదరు స్థలాలు కేటాయించిన తర్వాత అసలు కథ మొదలవుతుంది. ‘‘ఎందుకూ పనికిరాని స్థలాలను ఇస్తారా?’’ అంటూ లబ్ధిదారులే నిందిస్తారు. అంతేకాదు.. చంద్రబాబు ప్రభుత్వం నిర్మించిన ఇళ్లను కూడా కేటాయించకుండా వికృతానందం పొందుతున్నారు. సంక్షేమ పథకాల విషయంలో కూడా ప్రజలను వంచిస్తున్నారు.


‘ఆ కులానికి అంత.. ఈ కులానికి ఇంత’ అంటూ కాకి లెక్కలు చెబుతున్నారు. లబ్ధి పొందుతున్నవారి సంఖ్యను గమనిస్తే రాష్ట్రంలో జనాభా తగ్గిపోయిందా? అన్న అనుమానం కలుగుతోంది. ఇందులోని మర్మాన్ని తెలుసుకోవడానికి ప్రజలకు ఎంతో సమయం పట్టదు. ప్రభుత్వం అనుసరిస్తున్న లిక్కర్‌ పాలసీ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయి అధికార పార్టీ నాయకులు ఆ మేరకు లాభపడుతున్నారు. జిల్లాలలో ఎక్కడికక్కడ నాటుసారా బట్టీలు వెలుస్తున్నాయి. ఇసుక విషయంలో గత ప్రభుత్వంలోనే పరిస్థితి మెరుగ్గా ఉందన్న అభిప్రాయం ఇప్పటికే ప్రజలలో ఏర్పడింది. మైన్స్‌– వైన్స్‌ అధికార పార్టీ పెద్దలకు ప్రధాన వనరులుగా మారిపోయాయి. రాష్ట్రంలో ఇంత జరుగుతున్నా అవినీతిరహిత పాలన అని చెప్పుకోవడం జగన్‌కే చెల్లింది. జగన్‌కు అండగా ఉంటూ వచ్చిన భారతీయ జనతా పార్టీకి చెందిన కొంతమంది పెద్దలు కూడా ఇప్పుడు జరుగుతున్న తంతు గమనించాక నోరు విప్పక తప్పడం లేదు. ఉండవల్లి బాటలోనే మున్ముందు మరికొంతమంది నోటికి పనిచెప్పే అవకాశముంది. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూసే విధానానికి జగన్‌రెడ్డి స్వస్తి చెప్పని పక్షంలో ఆయనను సమర్థించేవారు కూడా ఆత్మరక్షణలో పడిపోతారు. మందబలం ఉందన్న కారణంగా గిట్టనివారిని అదేపనిగా వేధిస్తూ పోతే నష్టపోయేది ఎవరు? ఒకప్పుడు జగన్‌రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేసి జైలులో పెట్టడం వల్లనే కదా ఆయన పట్ల ప్రజలు సానుభూతి చూపించారు. అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, చివరకు యనమల, చినరాజప్ప వంటివారిని ఇలాగే వేధిస్తే సానుభూతి పవనాలు వారివైపు మళ్లకుండా ఉంటాయా? రాజకీయ వ్యవస్థ, న్యాయ వ్యవస్థ, మీడియా వంటి ప్రధాన వ్యవస్థలన్నీ ఇవ్వాళ జగన్‌రెడ్డి ప్రభుత్వ బాధితులుగానే మిగిలాయి. అధికార వ్యవస్థలో కూడా గిట్టనివారిని బాధితులుగా మార్చేశారు. ‘‘వ్యవస్థలతో శత్రుత్వం ఏమిటి? అందరూ ఎల్వీ సుబ్రహ్మణ్యం వలె చేతులు ముడుచుకుని కూర్చోరు.. జాగ్రత్త!’’ అని ఉండవల్లి చేసిన హెచ్చరిక జగన్‌ మంచికే!


 ఆరేళ్ల తర్వాత కూడానా..

ఆంధ్రా విషయం అలా ఉంచితే, తెలంగాణలో కూడా పరిస్థితులు ఏమంత గొప్పగా లేవు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పుడు ఏమి చెబుతారో, ఏ మాటలు నమ్మాలో అర్థం కావడం లేదు. కరోనా వైరస్‌ ప్రభావం మన మీద పడకముందే ఆదాయం పడిపోతున్నదనీ, దేశంలో ఆర్థిక మందగమనం మొదలైందనీ చెప్పిన పెద్దమనిషి.. ఇప్పుడు మళ్లీ తెలంగాణ బరాబర్‌గా ధనిక రాష్ట్రమేననీ, డబ్బుకు కొదవలేదనీ చెబుతున్నారు. ఈ రెండింటిలో దేన్ని నమ్మాలి? లాక్‌డౌన్‌ సమయంలో ప్రభుత్వ ఆదాయం దారుణంగా పడిపోయిందంటూ మూడు నెలలపాటు ఉద్యోగుల జీతాలలో కోత పెట్టారు. ఇప్పుడేమో రైతుబంధు పథకం కింద రైతులకు ఇవ్వడానికే జీతాల్లో కోత అంటున్నారు. రైతులకు ఇవ్వాలంటే ఉద్యోగుల జీతాలు తగ్గిస్తారా? అలా అయితే ధనిక రాష్ట్రం ఎలా అవుతుంది? మూడు నెలల్లోనే పది వేల కోట్ల వరకు అప్పు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? కరోనా విషయంలో కూడా కేసీఆర్‌ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ వచ్చారు. కరోనా వైరస్‌కు మందు లేదని హడావుడి చేసి.. దేశంలో అందరికంటే ముందే లాక్‌డౌన్‌ ప్రకటించి.. ఇప్పుడు హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్నా నోరు మెదపడం లేదు. బంగారు తెలంగాణలో కూడా ఆసుపత్రులలో పడకల కొరత ఉంటుందా? అన్న అనుమానాన్ని కలిగించారు. మొదట్లో ప్రధాని నరేంద్ర మోదీని పొగడాల్సినంత పొగిడి... ఇప్పుడేమో కేంద్ర ప్రభుత్వం ఏమిచ్చింది? ఏమి చేసింది? అని నిందిస్తున్నారు. కరోనాను అరికట్టలేకపోతున్నారని ఎవరైనా అంటే హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ దెబ్బతీస్తారా? అంటూ హూంకరిస్తున్నారు. ఇలాంటి హెచ్చరికలు ఆరేళ్ల క్రితం చెల్లుబాటు అయ్యాయి గానీ, తెలంగాణ ఏర్పడిన ఇంతకాలం తర్వాత కూడా అవే మాటలు చెబితే సానుకూలంగా స్పందించడానికి ప్రజలు అమాయకులు కాదని కేసీఆర్‌ అండ్‌ కో గుర్తుంచుకోవాలి.

ఆర్కే

 

యూట్యూబ్‌లో 

‘కొత్త పలుకు’ కోసం

QR Code

scan

చేయండి

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.