వాట్సాప్‌.. ఎస్కేప్‌..

ABN , First Publish Date - 2021-11-14T05:23:14+05:30 IST

వాట్సాప్‌.. ఎస్కేప్‌..

వాట్సాప్‌.. ఎస్కేప్‌..

పరారీలో ఉన్న నిందితుల కొత్త ఎత్తుగడ

ఫోన్లు స్విచ్ఛాఫ్‌.. డేటా ద్వారా వాట్సాప్‌ కాల్స్‌

సీడీఆర్‌కు చిక్కని వివరాలు

సాంకేతిక పరిజ్ఞానంతో తప్పించుకునే యత్నాలు

నగర శివారులో వాస్తుపరంగా అన్నీ బాగున్న స్థలాన్ని తక్కువ ధరకు కొంటామని చెప్పి ఓ వ్యక్తి ఇద్దరి నుంచి లక్షల రూపాయలు వసూలు చేశాడు. నెలలు గడుస్తున్నా.. చూపించిన స్థలం ఎదురుగా కనిపిస్తున్నా.. రిజిస్ట్రేషన్‌ మాత్రం జరగలేదు. మోసపోయామని తెలుసుకున్న ఆ ఇద్దరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేశారన్న సమాచారం తెలియగానే నిందితుడు పరారయ్యాడు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేశాడు. పోలీసులు అతడి ఇంటికి వెళ్తే ఏమో తెలియదన్న సమాధానం వచ్చింది. కుటుంబ సభ్యులతో మాత్రం నిత్యం మాట్లాడుతున్నాడు.

ఇద్దరు యువకులు బాల్య స్నేహితులు. ఆర్థిక లావాదేవీలు ఇద్దరి మధ్య వివాదాలను రేపాయి. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఒకరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలుసుకున్న రెండో యువకుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు ఎక్కడెక్కడ గాలిస్తున్నారోనన్న సమాచారాన్ని మిగిలిన స్నేహితులకు ఫోన్‌ చేసి తెలుసుకుంటున్నాడు. అదే ఫోన్‌ నెంబర్‌కు పోలీసులు ప్రయత్నిస్తుంటే స్విచ్ఛాఫ్‌ అని వస్తోంది. ఎలా అంటే..?

(ఆంధ్రజ్యోతి - విజయవాడ) : కేసు ఏదైనా.. ఘటన ఎలాంటిదైనా.. వాటిలో ఉన్న నిందితులను అరెస్టు చేయడానికి పోలీసులు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కామనే. నేరం చేశాక నగరం నుంచి పరారైన నిందితుల ఆచూకీ కోసం వివిధ రకాల పద్ధతుల్లో జల్లెడ పడతారు.  వ్యక్తులను గుర్తించడానికి సీసీ కెమెరాల ఫుటేజీలను ఉపయోగిస్తారు. ఒక్కో సమయంలో సీడీఆర్‌ (కాల్‌ డేటా రికార్డ్‌)ను సేకరిస్తారు. దీని ప్రకారం నిందితులు ఏ ప్రాంతంలో, ఎక్కడ నక్కి ఉన్నారో గుర్తించి సంకెళ్లు వేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ప్రక్రియ ఇది. పోలీసుల అన్వేషణ మార్గాల గురించి తెలుసుకున్న కొంతమంది నేరగాళ్లు వారి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. పోలీసుల కదలికలను రహస్య ప్రదేశాల్లో ఉంటూనే తెలుసుకుంటున్నారు. సాంకేతిక పరిజ్ఞానం నేరస్తులు ఉపయోగిస్తున్న కొత్త వాట్సాప్‌ ప్రక్రియ ఇది.

తేలిగ్గా తప్పించుకునే మార్గం

వివిధ నేరాల్లో ఉన్న నిందితులు కేసులు నమోదు కాగానే ముందుగా సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌ చేస్తున్నారు. రైళ్లు, బస్సులు, కార్లలో ఇతర ప్రదేశాల్లో ఉన్న బంధువుల ఇంటికో, స్నేహితుల రూముల్లోకో వెళ్లిపోతున్నారు. అక్కడి నుంచి పోలీసులు పరిశీలించే సీడీఆర్‌కు చిక్కకుండా వాట్సాప్‌ కాల్స్‌ను ఉపయోగిస్తున్నారు. నిరంతరం ఉపయోగించే సిమ్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి, రెండో సిమ్‌ ద్వారా డేటాను వాడుతున్నారు. దానిద్వారా వాట్సాప్‌ కాల్స్‌ చేసి కేసుల్లో దర్యాప్తు, పోలీసుల కదలికల గురించి సమాచారం తెలుసుకుంటున్నారు. ఇలా పోలీసులకు చిక్కకుండా న్యాయవాదులను ఏర్పాటు చేసుకుంటున్నారు. న్యాయస్థానాల్లో పిటిషన్లను దాఖలు చేసుకుని ముందస్తు బెయిల్స్‌ పొందుతున్నారు. ఇది కాకపోతే న్యాయవాదితో మాట్లాడి పోలీసులకు లొంగిపోతున్నారు. మామూలుగా ఫోన్‌ చేసి మాట్లాడినప్పుడు పోలీసులు సేకరించే సీడీఆర్‌ ద్వారా ఆ కాల్‌ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుస్తుంది. దీనిద్వారా పరారీలో ఉన్న నిందితులను పోలీసులు అరెస్టు చేయొచ్చు. రెండు ఫోన్లు ఉపయోగిస్తున్న నిందితులు ఒక ఫోన్‌ను స్విచ్ఛాఫ్‌ చేసి, రెండో ఫోన్‌ ద్వారా వ్యవహారాలను నడుపుతున్నారు. ప్రస్తుతం పోలీసులకు చిక్కకుండా ఉండటానికి నిందితులు వాట్సాప్‌ కాల్స్‌ను ఉపయోగిస్తున్నారని దర్యాప్తు బృందాలు గుర్తించాయి. ఈ కాల్స్‌ సీడీఆర్‌లకు దొరక్కపోవడంతో ఈవిధంగా చేస్తున్నారని పోలీసు వర్గాలు నిర్ధారణకు వచ్చాయి. సంచలనం రేపిన ప్రభుత్వ కార్పొరేషన్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల గల్లంతు కేసులో తాడిగడపలోని సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ ఇంకా పోలీసులకు చిక్కలేదు. ప్రస్తుతం ఆయన ఎక్కడున్నాడో తెలియలేదు. అయినా బ్యాంకులో కొంతమందితో వాట్సాప్‌ కాల్స్‌ ద్వారా టచ్‌లో ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.

వాట్సాప్‌ కాల్స్‌తో గుర్తించలేం..

పరారీలో ఉన్న నిందితులు రెగ్యులర్‌గా వాడే నెంబరును ఆపేస్తున్నారు. వాట్సాప్‌ కాల్స్‌లో మాత్రం తమకు అవసరమైన వారితో టచ్‌లో ఉంటున్నారు. ఈ కాల్స్‌ను సీడీఆర్‌ ద్వారా గుర్తించలేం. అందుకే మరో మార్గంలో నిందితుల కోసం అన్వేషిస్తున్నాం. - ఓ పోలీసు అధికారి

కనిపెట్టడం కష్టమే..

సిమ్‌ కార్డుల ద్వారా చేసే ఫోన్‌ కాల్స్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. వాటి సిగ్నల్‌ను ఒకరి నుంచి మరొకరికి పంపడానికి సెల్‌ టవర్లు ఉంటాయి. వాటిని సర్వీస్‌ ప్రొవైడర్లు నిర్వహిస్తుంటారు. ఏ నెంబర్‌ నుంచి ఏ ఫోన్‌ ఎవరికి, ఎప్పుడు వెళ్లిందన్న ప్రతి రికార్డూ సర్వీస్‌ ప్రొవైడర్ల వద్ద ఉంటుంది. అదే వాట్సాప్‌ కాల్స్‌కు ఇలాంటి వెసులుబాటు ఉండదు. దానికి కారణం ఈ కాల్స్‌కు, టవర్లకు ఎలాంటి సంబంధం ఉండదు. వాట్సాప్‌ కాల్స్‌ అన్నీ ఇంటర్నెట్‌ ద్వారా వెళ్తాయి. టవర్లతో సంబంధం లేకపోవడం ఒక కారణమైతే, ఈ కాల్స్‌ రికార్డులను స్టోర్‌ చేయడం కష్టతరం. 

- వంశీ, ఎథికల్‌ హ్యాకర్‌

Updated Date - 2021-11-14T05:23:14+05:30 IST