Facebook, WhatsApp, Instagram.. గంటల కొద్దీ డౌన్‌.. కారణమిదేనా..!?

Oct 5 2021 @ 02:38AM

  • సోమవారం రాత్రి 9 నుంచి అంతరాయం
  • వినియోగదారుల నుంచి ఫిర్యాదుల వెల్లువ 
  • ట్విటర్‌ వేదికగా వివరణ ఇచ్చిన కంపెనీలు
  • సేవలను పునరుద్ధరిస్తామని 
  • రాత్రి 9.37 గంటలకు ప్రకటన
  • గంటలు గడిచినా అదే మొరాయింపు
  • ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీల్లో డీఎన్‌ఎస్‌ ఎర్రర్‌?


న్యూఢిల్లీ, అక్టోబరు 4 : ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. సోమవారం రాత్రి 9 నుంచి ఆ మూడు యాప్‌లు డౌన్‌ అయ్యాయి. దీంతో వాటిని నిత్యం వినియోగించే కోట్లాది మంది తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. దీనిపై చాలామంది నెటిజన్లు ట్విటర్‌ వేదికగా ఫిర్యాదుల వర్షాన్ని కురిపించారు. దీంతో ఫేస్‌బుక్‌ సహ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ నేతృత్వంలోని వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ కంపెనీలు ట్విటర్‌లో స్పందించాయి.


‘‘మా యాప్‌లు, ఇతర ప్రొడక్ట్స్‌ను వినియోగించడంలో ఇబ్బంది కలుగుతోందని కొందరి నుంచి ఫిర్యాదులు అందాయి. సేవలను పునరుద్ధరించడంపైనే ప్రస్తుతం మేం పనిచేస్తున్నాం. సేవల్లో అంతరాయానికి చింతిస్తున్నాం’’ అని ఫేస్‌బుక్‌ అధికార ప్రతినిధి యాంటీ స్టోన్‌ రాత్రి 9 గంటల 37 నిమిషాలకు ట్వీట్‌ చేశారు. ఈ ప్రకటన వెలువడిన అర్ధగంట లేదా గంటలోగా సేవలు తిరిగి ప్రారంభమవుతాయని అంతా భావించారు. కానీ రాత్రి ఒంటి గంట దాటాక కూడా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తెరుచుకోలేదు. ఆ సమయానికి... ఫేస్‌బుక్‌ యాప్‌ను తెరిస్తే ‘సమ్‌థింగ్‌ వెంట్‌ రాంగ్‌.. ప్లీజ్‌ ట్రై అగైన్‌’ అని సందేశం వచ్చింది. వాట్సా్‌పలో మెసేజ్‌ను టైప్‌ చేసి సెండ్‌ చేస్తే బఫరింగ్‌ కొనసాగింది. ఇన్‌స్టాగ్రామ్‌ను తెరిచే ప్రయత్నం చేస్తే.. ‘కుడ్‌ నాట్‌ రిఫ్రెష్‌ ఫీడ్‌’ అనే సందేశం ప్రత్యక్షమైంది. అప్పటికి కూడా ఈ సేవలు ఎంతసేపట్లో అందుబాటులోకి వస్తాయో సంస్థలు వెల్లడించలేదు. ఎన్నడూలేని విధంగా ఈ మూడు యాప్‌ల సేవలు గంటల కొద్దీ స్తంభించడంపై సర్వత్రా నెటిజెన్లు విస్మయం వ్యక్తంచేశారు.

డీఎన్‌ఎస్‌ అంటే.. 

వెబ్‌ సేవలను పర్యవేక్షించే ‘డౌన్‌ డిటెక్టర్‌.కామ్‌’ వెబ్‌సైట్‌.. వినియోగదారుల నుంచి కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాట్సా్‌పకు సంబంధించిన 9000 క్రాష్‌ రిపోర్టులు, ఇన్‌స్టాగ్రామ్‌పై 8000 క్రాష్‌ రిపోర్టులు, ఫేస్‌బుక్‌పై 4000 క్రాష్‌ రిపోర్టులు వచ్చాయని వెల్లడించింది. వెబ్‌సైట్‌, యాప్‌, సర్వర్‌ కనెక్షన్‌లకు సంబంధించిన సమస్యల వల్లే ఈ మూడు యాప్‌లు మొరాయించి ఉండొచ్చని ‘డౌన్‌ డిటెక్టర్‌’ వ్యాఖ్యానించింది. ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీలను తెరిచే ప్రయత్నం చేయగా ‘డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ ఎర్రర్‌’ (డీఎన్‌ఎస్‌ ఎర్రర్‌) అని చూపించిందని ఓ వార్తాసంస్థ కథనాన్ని ప్రచురించింది. డొమైన్‌ నేమ్‌ సిస్టమ్‌ అనేది వినియోగదారులను వారు కోరిన వెబ్‌ చిరునామాకు చేర్చే సాంకేతిక వ్యవస్థ అని పేర్కొంది. బహుశా ఇది విఫలమైనందు వల్లే ఫేస్‌బుక్‌ వెబ్‌పేజీ తెరుచుకోకపోయి ఉండొచ్చని అంచనా వేసింది. 


‘ఫేస్‌బుక్‌ స్టేటస్‌’ పేజీ కూడా డౌన్‌ కావడంతో... 

తమ వెబ్‌సైట్‌, యాప్‌లు, ఇతర ప్రోడక్ట్స్‌ ఎలా పనిచేస్తున్నాయో ఎప్పటికప్పుడు వినియోగదారులకు తెలిపేందుకు ఫేస్‌బుక్‌ ప్రత్యేకమైన ‘స్టేటస్‌’ పేజీని నిర్వహిస్తుంటుంది. మొత్తం వెబ్‌సైటే డౌన్‌ అయిన నేపథ్యంలో ‘ఫేస్‌బుక్‌ స్టేటస్‌’ పేజీ నుంచి వినియోగదారులకు సందేశాలు పంపే వీలు కూడా లేకుండాపోయింది. దీంతో ట్విటర్‌ వేదికగా ప్రకటన చేయాల్సి వచ్చింది. ఇక, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ల సేవలకు అంతరాయంపై ఆయా కంపెనీలు ట్విటర్‌ వేదికగా ప్రకటనలు చేయడంపై నెటిజెన్లు స్పందించారు. ‘ఆ మూడింటికి ఏమైందో చూడటానికి అందరూ ట్విటర్‌కు వస్తున్నారహో’ అని కొందరు.. ‘చివరకు ట్విటరే నిలబడింది.. వాళ్లంతా డౌన్‌’ అని ఇంకొందరు వ్యాఖ్యానించారు. తమ కామెంట్లను ప్రతిబింబించే ఫొటోలను జోడించి ట్వీట్లు చేశారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.