
ఎన్నారై డెస్క్: పంజాబ్‌లో ఎన్నారై భార్య బాధితుల సంఖ్య రోజురోజు పెరుగుతోంది. దీంతో అలాంటి వారందరూ కలిసి ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు 'తుగియా దే పీడిత్'(విక్టిమ్స్ ఆఫ్ ఫ్రాడ్). ఇందులో సుమారు 80 మంది సభ్యులు ఉన్నారట. వారందరూ కూడా భార్యలను తమ డబ్బులతో చదివించి కెనడా పంపించిన వాళ్లే. తీరా అక్కడికెళ్లి సెటిల్ అయ్యాక భార్యలు వీరిని పట్టించుకోవడం మానేస్తున్నారు. ఇలా వారందరూ భార్య బాధితులుగా మారుతున్నారు. ఈ గ్రూపును వారు తమ సార్థక బాధకాలను చెప్పుకోవడమే కోసమే ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నరట. ప్రస్తుతం ఈ వాట్సాప్ గ్రూపు తాలూకు వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పంజాబ్ రాష్ట్రంలో చాలా మంది కెనడా వెళ్తుంటారు. అక్కడ వెళ్లి సెటిలైతే ఆ జీవితమే వెరే లెవెల్ అనేది అక్కడి వారు చెబుతున్న మాట. ఈ క్రమంలోనే అక్కడ కాంట్రాక్ట్ పెళ్లిళ్ల పద్ధతి ఉనికిలోకి వచ్చింది. సాధారణంగా కెనడా కల సాకారం చేసుకునే క్రమంలో మొదటి అడుగు అక్కడ స్టూడెంట్ వీసా పొందడం. ఇందుకోసం యువత IELTS లాంటి కఠినమైన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఆ తరువాత వచ్చే విద్యార్థి వీసా సాయంతో అక్కడ చదువు పూర్తి చేసి, ఉద్యోగం సంపాదించాలి. అయితే, పంజాబ్ యువకుల కంటే యువతులే అధిక సంఖ్యలో IELTS పాసవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో విదేశీ చదువుకయ్యే ఖర్చు భరించలేని యువతులను పెళ్లి చేసుకునేందుకు కొందరు యువకులు ముందుకు వస్తున్నారు.

అనంతరం భార్యలు కెనడాలో సెటిలయ్యాక.. వారి ద్వారా జీవిత భాగస్వాములకు ఇచ్చే వీసాతో అక్కడికి వెళ్లాలని యువకులు కోరుకుంటున్నారు. ఇందుకోసం అమ్మాయిల IELTS పరీక్షకు కోచింగ్ ఖర్చు మొదలు, కెనడాలో చదువుకయ్యే వ్యయాన్నంతా తామే భరించేందుకు వరుడి కుటుంబాలు సిద్ధపడుతున్నాయి. ఈ క్రమంలోనే వధువు, వరుడి కుటుంబాల మధ్య ఒప్పందాలు కుదురుతున్నాయి. వీటినే స్థానికంగా కాంట్రాక్ట్ పెళ్లిళ్లని పిలుస్తున్నారు. అయితే.. కెనడా వెళ్లిన యువతులు మాత్రం అక్కడ ఉద్యోగం సంపాదించి..ఆపై భర్తల వీసా ఊసెత్తడం లేదు. అప్పటివరకు డైలీ ఫోన్లో మాట్లాడే భార్యలు.. వన్స్ సెటిల్ అయ్యాక భర్తల ఫోన్ నంబర్లను బ్లాక్ చేస్తున్నారట. ఇలాంటివి పంజాబ్‌లో కామన్‌గా మారినట్లు తెలుస్తోంది.
దాంతో కొందరు భర్తలు తమ బాధ ఎవరికీ చెప్పుకోలేక అవమాన భారంతో బలవన్మరణానికి పాల్పడుతున్న ఘటనలు ఇటీవల కొన్ని వెలుగులోకి వచ్చాయి. అయితే భార్యలు ఇలా భర్తలను దూరం పెట్టడానికి ఓ కారణం ఉందని అక్కడి వారు చెబుతున్నారు. అదేంటంటే.. ఇంతకాలం స్వదేశంలో ఎన్నో ఆంక్షల మధ్య బందీలుగా ఉంటున్న యువతులు తమకు లభించిన స్వేచ్ఛను వదులుకునేందుకు ఇష్టపడట్లేదట. అక్కడ కూడా భర్తల ఆంక్షలు మొదలవుతాయంటూ దూరంగా ఉండిపోతున్నారని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలా ఒంటరి అయినా భర్తలు.. ప్రత్యేకంగా ఓ వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకుని మరీ తమ సార్థక బాధకలను చెప్పుకోవడమే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న అంశం.
ఇవి కూడా చదవండి