అవినీతిని ప్రశ్నించినపుడే సమాఖ్య స్ఫూర్తి గుర్తొస్తుందా?

ABN , First Publish Date - 2022-09-20T06:40:55+05:30 IST

నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్య విధానం మున్నెన్నడూ లేని రీతిలో అమలు అవుతున్నది. అయినా సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారని తప్పుడు ...

అవినీతిని ప్రశ్నించినపుడే సమాఖ్య స్ఫూర్తి గుర్తొస్తుందా?

నరేంద్రమోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత సమాఖ్య విధానం మున్నెన్నడూ లేని రీతిలో అమలు అవుతున్నది. అయినా సమాఖ్య స్ఫూర్తికి భిన్నంగా మోదీ వ్యవహరిస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్న వారు గతంలో ఏం జరిగిందో ఆలోచించుకోవాలి. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ హయాంలో సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకంగా అనేక నిర్ణయాలు జరిగాయి. వివిధ రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా, నిర్విచక్షణగా రద్దు చేసేవారు. మన తొలి ప్రధానమంత్రి నెహ్రూయే 1959లో నంబూద్రి పాద్ నేతృత్వంలోని కేరళ ప్రభుత్వాన్ని రద్దు చేశారు. 1971లో 7 రాష్ట్రాల్లో, 1977లో 12 రాష్ట్రాల్లో, 1980లో 9 రాష్ట్రాల్లో 356 అధికరణ ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించారు. 1971–90 సంవత్సరాల మధ్య 20 ఏళ్లలో 63సార్లు అంటే ఏడాదికి సగటున మూడుసార్లు ఈ అధికరణను ప్రయోగించారు. 1994లో ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన తర్వాతే రాష్ట్రాలపై రాష్ట్రపతి పాలనను ఒక రాజకీయ ఆయుధంగా ఉపయోగించడం తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రులను అవమానించడం, మాటి మాటికీ మార్చడం, కేంద్రంలో ఉన్న ఒకే కుటుంబానికి వారితో ఊడిగం చేయించడం సర్వ సాధారణంగా ఉండేది. బేగంపేట విమానాశ్రయంలో నాడు ఎలాంటి పదవీ లేని రాజీవ్ గాంధీ ముఖ్యమంత్రి అంజయ్యను అవమానించిన విషయం చరిత్రపుటల్లో నమోదైంది. నాటి యూపీ ముఖ్యమంత్రి నారాయణ్ దత్ తివారీని సంజయ్ కా సవారీ అని వేళాకోళం చేసేవారు. తివారీ ఒక కార్యక్రమంలో సంజయ్ గాంధీ చెప్పులను మోశారు. ఆ తర్వాత కూడా కాంగ్రెస్‌లో ఇదే సంస్కృతి కొనసాగుతోంది. కాంగ్రెస్ అధికారంలో లేని చోట రాహుల్ గాంధీ పాదయాత్ర చేస్తూంటే వందిమాగధులు, కుహనా లౌకిక వాదులు ఆయనను కీర్తిస్తూ, భజన గీతాలు ఆలపిస్తూ ముందూ వెనుకా సాగుతున్నారు. ఇవాళ ఆ కాంగ్రెస్ నేతలే రాష్ట్రాల్లో సమాఖ్య స్ఫూర్తి లేదని ఆరోపిస్తున్నారు! విచిత్రమేమంటే తెలంగాణలో అప్రజాస్వామికంగా, నియంతలా వ్యవహరిస్తూ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటూ ఒక దొరలాగా వ్యవహరిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ కేంద్రం సమాఖ్య స్పూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్నదని హాస్యాస్పద ఆరోపణలు చేస్తున్నారు. ప్రాంతీయపార్టీ అధినేతలైన జగన్మోహన్ రెడ్డి, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్, స్టాలిన్‌లు కూడా నియంతలే. జయలలిత, చంద్రబాబునాయుడు, మాయావతి, ములాయం, అఖిలేశ్ యాదవ్, లాలూ ప్రసాద్ యాదవ్ అధికారంలో ఉన్నప్పుడు కూడా అప్రజాస్వామికంగా వ్యవహరించిన సందర్భాలున్నాయి.


దేశ పాలనలో సమాఖ్య స్ఫూర్తి కొరవడిందని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి ఒకరు ఇటీవల వాపోయారు. పదవీ విరమణ చేసిన తర్వాత ఆయన ఒక ప్రాంతీయ పార్టీ అధినేతకు సలహాదారుగా వ్యవహరిస్తూ ఒక ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా లేఖ రాయించారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. రాజకీయ నాయకులు, కుహనా మేధావులు, తమ వ్యక్తిగత ప్రయోజనాలకు అనుగుణంగా సమాఖ్య స్ఫూర్తి గురించి నిర్వచిస్తూ సత్యాన్ని వక్రీకరించడం ద్వారా వాస్తవాలను మరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నారనడంలో అతిశయోక్తి లేదు.


మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం కేంద్ర, రాష్ట్ర సంబంధాలను గౌరవించేవారు. నాడు ప్రధానమంత్రిగా ఉన్న మన్మోహన్ సింగ్ రాష్ట్రానికి వస్తే సగౌరవంగా ఆహ్వానించి గౌరవించేవారు. కేంద్రం వల్ల గుజరాత్‌కు ఏదైనా నష్టం జరిగితే సరైన వేదికలపై మాత్రమే ఆయన చెప్పేవారు. కేంద్ర సంస్థలు కేసులు పెట్టినా మోదీ విచారణకు హాజరై పూర్తిగా సహకరించేవారు. కేంద్రం అణిచివేస్తుందని మందీ మార్బలంతో కలిసి ఆయన ఏనాడూ గగ్గోలు పెట్టేవారు కాదు. మాటి మాటికీ ఢిల్లీ వచ్చి కేంద్రాన్ని నిలదీసే వైఖరిని ఆయన అవలంబించలేదు. ప్రధానమంత్రి అయిన తర్వాత మోదీ, కేంద్ర ప్రభుత్వ పన్నుల రాబడిలో రాష్ట్రాల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచారు. ఒకే దేశం, ఒకే పన్నులో భాగంగా దేశ వ్యాప్తంగా అమలు చేసిన జీఎస్టీ మూలంగా రాష్ట్రాలకు లభించిన నష్టాన్ని భర్తీ చేసేందుకు వేల కోట్ల మేరకు నిధుల పంపిణీ చేశారు.


కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే పార్టీ అధికారంలోకి వచ్చి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడాలన్న మోదీ ఆలోచన కూడా సమాఖ్య స్ఫూర్తికి వ్యతిరేకమైనదేమీ కాదు. దేశమంటే రాష్ట్రాల సమాఖ్య అని మోదీకి బాగా తెలుసు. అయితే దేశాన్నంతటినీ ఒకే త్రాటిపై నడిపేది, నడపాల్సింది జాతీయ దృక్పథమని ఆయన అభిప్రాయం. దేశంలోని అన్ని ప్రాంతాలూ సమస్థాయిలో అభివృద్ధి చెందాలంటే కేంద్ర రాష్ట్రాలు టీమ్ ఇండియా స్ఫూర్తితో వ్యవహరించాలని మోదీ ప్రతి సందర్బంలోనూ చెబుతూ వస్తున్నారు. అన్ని రాష్ట్రాలూ అభివృద్ధి సూచికల్లో ముందుండాలన్న లక్ష్యంతోనే ఆయన వివిధ పథకాలు, విధానాల అమలులో రాష్ట్రాలు పోటీ పడాలని ప్రోత్సహిస్తూ వచ్చారు. ‘కేంద్ర, రాష్ట్రాలకు వివిధ పథకాలు ఉండవచ్చు. పనితీరులో రెండింటి శైలి వేరు కావచ్చు, కాని ఒక దేశం కలలు అందరికీ ఒకటే’ అని ప్రధానమంత్రి స్వాతంత్ర్య దినోత్సవ సందేశంలో పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని కాపాడేందుకు ఏర్పాటైన నీతీ ఆయోగ్ విద్య, అరోగ్యం, జలవనరుల నిర్వహణ, సుస్థిరాభివృద్ధి లక్ష్య సూచికలు, ఎగుమతులు, వినూత్న ఆవిష్కారాల విషయంలో రాష్ట్రాలకు ర్యాంకింగ్‌లు ఇస్తూ ప్రోత్సహిస్తున్న విషయం తెలిసిందే. ఈ ర్యాంకింగ్‌లలో అనేకసార్లు ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అగ్రశ్రేణిలో నిలిచాయి. పనితీరు ఆధారంగా నిధుల పంపిణీ చేయడం కూడా ఆరోగ్యకరమైన ఆలోచనా విధానమేకాని కేంద్రం పెత్తనం ఏమాత్రం కాదు.


కొన్ని ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా అవినీతికి పాల్పడుతున్నాయి. కేంద్రం ఇచ్చే నిధులను దుర్వినియోగపరుస్తున్నాయి. ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ అర్థం, పర్థం లేని తాయిలాల పేర వేల కోట్ల ప్రజాధనాన్ని గంగపాలు చేస్తున్నాయి. కేంద్రం ఇదేమని ప్రశ్నించినందుకు మోదీ సర్కార్‌కు సమాఖ్య స్ఫూర్తి లేదని విమర్శిస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు దాడులు చేసినందుకు, కోర్టులు తప్పుపట్టినందుకు కూడా సమాఖ్య విధానానికి నష్టం జరిగిందని ఆరోపిస్తున్నాయి. తమ అక్రమాలను కప్పిపుచ్చుకునే లక్ష్యంతో కేంద్రాన్ని తప్పుపడితే, రాజ్యాంగానికి వక్రభాష్యం చెబితే ప్రజలు గ్రహించకుండా ఉంటారా? సమాఖ్య స్ఫూర్తికి సార్థకత లభించాలంటే, కేంద్ర, రాష్ట్రాల్లో అభివృద్ధి, మౌలిక సదుపాయాలు మెరుగుపడాలంటే డబుల్ ఇంజన్ సర్కార్లే శ్రేయస్కరం అని ప్రజలు గ్రహిస్తున్నారు. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలే అందుకు నిదర్శనం. రాష్ట్రాల ప్రయోజనాలు, జాతీయ దృక్పథం ఆరోగ్యవంతంగా సమ్మిళితమయినప్పుడే సమాఖ్య స్ఫూర్తికి న్యాయం జరుగుతుంది.


వై. సత్యకుమార్ (బీజేపీ జాతీయ కార్యదర్శి)

Updated Date - 2022-09-20T06:40:55+05:30 IST