కేసీకి నీళ్లెప్పుడు..?

Jul 23 2021 @ 00:08AM
రాజోలి ఆనకట్ట నుంచి దిగువకు విడుదల చేస్తున్న కుందూ వరద జలాలు

తుంగభద్ర నుంచి 1900 క్యూసెక్కులు విడుదల

జిల్లాకు చేరని సాగునీరు

0-40 కి.మీల మధ్య దెబ్బతిన్న సీసీ లైనింగ్‌

తగ్గిపోయిన నీటి ప్రవాహ సామర్థ్యం

జిల్లా చివరి ఆయకట్టుపై తీవ్ర ప్రభావం

కృష్ణా ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళితే నీటి కష్టాలే

గుండ్రేవుల జలాశయమే శాశ్వత పరిష్కారం


జిల్లా ప్రధాన జీవనాడి కేసీ కాలువ. 95 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌ ప్రారంభమైంది. తుంగభద్ర నుంచి కాలువకు నీటిని విడుదల చేసినా జిల్లాకు చేరలేదు. సాగునీటిపై ప్రజా ప్రతినిధులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 0-40 కి.మీల సీసీ లైనింగ్‌ దెబ్బతినడంతో పూర్తి సామర్థ్యం నీటిని తీసుకోలేని పరిస్థితి ఉంది. లైనింగ్‌ మరమ్మతుల కోసం రూ.25 కోట్లతో ప్రతిపాదనలు పంపినా నిధుల ఊసే లేదు. కృష్ణా బేసిన ప్రాజెక్టులు కేంద్రం చేతిలోకి వెళితే కేసీ రైతులకు క‘న్నీటి’ కష్టాలు తప్పవని నిపుణుల అంచనా. దీనికి శాశ్వత పరిష్కారం తుంగభద్రపై గుండ్రేవుల జలాశయం నిర్మాణమే ఏకైక మార్గం. ఆ దిశగా పాలకులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. 


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మైదుకూరు, ప్రొద్దుటూరు, కమలాపురం, కడప నియోజకవర్గాల పరిధిలో 95 వేల ఎకరాలకు సాగునీరు, వివిధ గ్రామాలకు తాగునీరు అందించే ప్రధాన నీటి వనరు కర్నూలు-కడప (కేసీ) కాలువ. తుంగభద్ర-కుందూ-పెన్నా నదులను అనుసంధానం చేస్తూ 306 కి.మీ.ల పొడవు కలిగిన కాలువను 1870లో బ్రిటీష్‌ పాలకులు పూర్తి చేశారు. జల రవాణా లక్ష్యంగా నిర్మించినా.. 1933 నుంచి సాగు, తాగునీటి కోసం వినియోగిస్తున్నారు. కర్నూలు, కడప జిల్లాల్లో 2.65 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంటే కడప జిల్లాలో 95 వేల ఎకరాలకు అందించాలి. తుంగభద్ర నుంచి కృష్ణా వాటర్‌ డిస్ప్యూట్‌ ట్రైబ్యునల్‌ (కేడబ్ల్యూటీడీ)-1 31.90 టీఎంసీలు నీటి వాటాను కేటాయించింది. జిల్లాకు సరాసరి 10 టీఎంసీల వాటా ఉంది. వర్షాలు ఆశాజనకంగా కురుస్తున్నాయి. తుంగభద్ర, కృష్ణా నదులకు వరద మొదలైంది. దీంతో సాగునీటి కోసం రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు నీటిని ఇస్తారో ప్రజా ప్రతినిధులు స్పష్టత ఇవ్వాలని రైతులు కోరుతున్నారు.


దెబ్బతిన్న సీసీ లైనింగ్‌

తుంగభద్ర ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద మొదలైంది. కర్నూలు జిల్లా సుంకేసుల బ్యారేజీ నుంచి 1900 క్యూసెక్కులు కేసీ కెనాల్‌కు విడుదల చేశారు. ఆ నీరు జిల్లాకు మాత్రం చేరలేదు. వాస్తవంగా కేసీ కాలువ ప్రవాహ సామర్థ్యం 3850 క్యూసెక్కులు. ప్రస్తుతం 2850 క్యూసెక్కులకు మించి విడుదల చేయలేని పరిస్థితి ఉంది. 2009 నాటి వరదలకు 0 కి.మీల నుంచి 40 కి.మీల వరకు కాలువ సీసీ లైనింగ్‌, కాలువ గట్లు దెబ్బతిని సామర్థ్యం తగ్గిపోయింది. మరమ్మతుల కోసం రూ.25 కోట్లతో ఇంజనీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరు చేయించి మరమ్మతులు చేపట్టేందుకు రెండు జిల్లాల ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదు. దీంతో చివరి ఆయకట్టు కలిగిన జిల్లా రైతులు నష్టపోవాల్సి వస్తోంది. మరమ్మతులు చేస్తే తుంగభద్రకు వరద మొదలు కాగానే 3850 క్యూసెక్కులు తీసుకునే అవకాశం ఉంటుంది. అప్పుడు జిల్లాకు సాగునీటి కష్టాలు తీరుతాయి. 


నీళ్లు ఉన్నా.. కన్నీళ్లే...

కేసీ కాలువకు రాజోలి ఆనకట్ట నుంచి 83 వేల ఎకరాలు, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట నుంచి 12 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాల్సి ఉంది. కుందూలో రాజోలి ఆనకట్ట వద్ద 4 వేల క్యూసెక్కుల వరద ఉంది. ఆ నీటిని కాలువకు ఇచ్చే అవకాశం ఉన్నా ఈ వరద ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు. ఎగువ నుంచి నీటిని ఇస్తామనే స్పష్టమైన హామీ కూడా లేదు. దీంతో కాలువకు నీళ్లు విడుదల చేయడం లేదు. వచ్చిన నీటిని దిగువకు వదిలేస్తున్నారు. ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట ఎగువన గండికోట, మైలవరం జలాశయాలు ఉన్నాయి. గండికోటలో 24.57 టీఎంసీలు ఉన్నాయి. భారీ వరద వస్తే ఆ నీటిని పెన్నా నదికి వదిలేయాల్సిందే. ఇప్పుడే గండికోట నుంచి మైలవరంకు అక్కడి నుంచి పెన్నాకు నీటిని విడుదల చేస్తే ఆదినిమ్మాయపల్లె నుంచి కేసీ ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. 


శాశ్వత పరిష్కారం గుండ్రేవుల జలాశయమే

కేసీ కెనాల్‌కు 31.90 టీఎంసీల వాటా ఉంది. 10 టీఎంసీలు తుంగభద్ర డ్యాం నుంచి.. 21.90 టీఎంసీలు సుంకేసుల బ్యారేజీ నుంచి వరద మళ్లింపు ద్వారా తీసుకోవాలి. సీసీ లైనింగ్‌ దెబ్బతినడం, తుంగభద్ర డ్యాం నుంచి కేసీ నీటిని ఏటేటా అనంతపురం జిల్లాకు మళ్లింపు వల్ల ముచ్చుమర్రి లిఫ్టు ద్వారా 1000 క్యూసెక్కులు, బానకచర్ల క్రాస్‌ రెగ్యులేటర్‌ నుంచి కేసీ ఎస్కేప్‌ చానల్‌ ద్వారా అవసరమైన మేరకు కృష్ణా వరద జలాలు తీసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య జల జగడం కారణంగా కృష్ణా బేసిన మొత్తం ప్రాజెక్టులన్నీ కేంద్రం చేతిలోకి తీసుకుంది. భవిష్యత్తులో కేసీకి నీటి కష్టాలు తప్పవని, ఇలాంటి పరిస్థితుల్లో సుంకేసుల ఎగువన గుండ్రేవుల జలాశయం నిర్మాణమే శాశ్వత పరిష్కారమని సాగునీటి నిపుణులు అంటున్నారు. 20 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే ఈ జలాశయం వల్ల కృష్ణా నదిలో కలిసే తుంగభద్ర వరద జలాలు నిలువ చేసి కేసీ ఆయకట్టుకు మళ్లించవచ్చు. జిల్లాలో చివరి ఆయకట్టుకు నీటి సమస్య ఉండదు. గత ప్రభుత్వం రూ.2360 కోట్లు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రెండు జిల్లాలకు జీవనాడిగా మారబోయే గుండ్రేవుల నిర్మాణం కోసం ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిన అవసరం ఉంది. 


నీటి విడుదలపై పరిశీలన 

- బ్రహ్మారెడ్డి, డీఈఈ, కేసీ కెనాల్‌, మైదుకూరు సబ్‌ డివిజన

రాజోలి ఆనకట్ట వద్ద కుందూలో 4 వేల క్యూసెక్కుల వరద ఉంది. ఇది ఎన్ని రోజులు ఉంటుందో కచ్చితంగా చెప్పలేం. ఎగువన తుంగభద్ర, కృష్ణా నుంచి నీటిని విడుదల చేస్తేనే కేసీకి నీటి విడుదలకు అవకాశం ఉంటుంది. గత ఏడాది ఆగస్టు 1న ఇచ్చాం. ఈ ఏడాది కూడా వరదను అంచనా వేసి సకాలంలో ఇచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నాం. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.