జనగోస ఎప్పుడు వింటారు?

ABN , First Publish Date - 2021-04-06T05:54:05+05:30 IST

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ బాధ, కోపం వ్యక్తీకరించడానికి ఎన్నికలను వాహకంగా ఎంచుకుని అధికార పార్టీకి బుద్ధి చెబుతుంటారు...

జనగోస ఎప్పుడు వింటారు?

భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ బాధ, కోపం వ్యక్తీకరించడానికి ఎన్నికలను వాహకంగా ఎంచుకుని అధికార పార్టీకి బుద్ధి చెబుతుంటారు అనే అభిప్రాయం ఒకటి ఉన్నది. అది నిజం కాదని ఇప్పటికే అనేకసార్లు రుజువయింది. ఎన్నికలను మద్యం, డబ్బులు ప్రభావితం చేస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీల మధ్య అనైక్యత అధికార పార్టీకి విజయాలను అందిస్తోంది. ఈ పరిణామం (ఎన్నికలలో విజయాలు), ‘ప్రజలు తమ పాలనను ఆమోదించారని, ప్రతిపక్షాలు అనవసరంగా గోల చేస్తున్నాయి గానీ నిజంగా ప్రజలు సంతోషంగా ఉన్నారని’ అధికారపార్టీ పెద్దలు చెప్పుకోవడానికి అవకాశం కల్పిస్తున్నది. దీంతో, ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తెచ్చినా, వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, వాళ్లు తమ ధోరణిలో పాలన సాగించే వైఖరిని ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం. మెల్లమెల్లగా ఈ ధోరణి ప్రజాస్వామ్య పద్ధతులకు భిన్న దిశలో, నిరంకుశ పోకడల వైపు ప్రభుత్వాలను నడిపిస్తున్నది. ప్రజలను కలవకపోవడం, కనీసం వారి సమస్యలపై దరఖాస్తులు తీసుకోకపోవడం, ఎవరైనా ప్రజల పక్షాన మాట్లాడినా, వారి మాటకు విలువ ఇవ్వకపోవడం, గట్టిగా మాట్లాడినవారిని, పోరాడుతున్న వారిని నిర్బంధంతో అణచివేయడం వంటి ధోరణులన్నీ తెలంగాణలో కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చట్టబద్ధమైన వ్యవహార సరళి, సామాజిక న్యాయం, పర్యావరణ స్పృహ పాలనలో పూర్తిగా లోపిస్తున్నాయి. 


కొన్ని విషయాలను పరిశీలిస్తుంటే, అసలు ప్రభుత్వానికి గ్రామీణప్రాంతంలోని వాస్తవ విషయాలు అర్థం కావడం లేదా? లేక కావాలనే వాటి పట్ల నేరపూరితంగా, పట్టనట్లు వ్యవహరిస్తున్నదా? అనే అనుమానాలు కలుగుతున్నాయి. ముఖ్యంగా దళితులు, ఆదివాసీలు, కౌలురైతులు, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాల పట్ల ప్రభుత్వవైఖరి, అత్యంత అన్యాయంగా, అమానుషంగా ఉంది. రైతాంగ సాయుధపోరాటం జరిగిన ఈ తెలంగాణ గడ్డమీద ఇప్పటికీ భూస్వామ్యం జడలు విప్పి నర్తిస్తున్నట్లుగా కనిపిస్తున్నది. వ్యవసాయరంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా, యాసంగిలో వరి సేద్యం, తలసరి విద్యుత్ వినియోగం భారీగా పెరగడం, పత్తి, వరి లాంటి రెండు, మూడు పంటలే మొత్తం సాగుభూములను ఆక్రమించడం, తెలంగాణ వాతావరణం, ఉష్ణోగ్రతలు, ఖరీదైన ఎత్తిపోతల నీళ్ళు, ఏప్రిల్, మే నెలల్లో భూగర్భజలాల అడుగంటిపోవడం గురించి ఏ మాత్రం పట్టించుకోకుండా తాజాగా ఆయిల్‌ పామ్ లాంటి పంటలను ప్రోత్సహించడానికి చేస్తున్న ప్రయత్నాలను, పైగా తాము సాధించిన ఘనతగా వీటి గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని చూస్తుంటే, ఈ ప్రభుత్వానికి పర్యావరణ స్పృహ పూర్తిగా లోపించినట్లు అవగతమవుతోంది. 


రాష్ట్రానికి అవసరమైన అన్ని పంటలనూ రాష్ట్రంలోనే పండించుకోవడం, అందుకు గ్రామ, మండల స్థాయిలో ప్రణాళికలు రూపొందించుకోవడం గురించి ఏ మాత్రం పట్టకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. వ్యాపారులు, కంపెనీలు చెప్పినట్లుగానే పంటల ప్రణాళికలు రూపొందిస్తున్నది. గతంలో పాలీహౌజ్‌ల కోసం వందల కోట్లు ఖర్చు పెట్టడం, ఆ రంగంలో ఉన్న బడా కంపెనీలకు మేలు చేయడం కోసమే. రాష్ట్రంలో కూరగాయల రైతులకు ధరలు దక్కడం లేదు. కూరగాయల సాగు విస్తీర్ణం పెరగడం లేదు. గ్రామాలలో శీతల గిడ్డంగులు పెరగడం లేదు. ఇప్పటికే పండ్లసాగు చేస్తున్న రైతులకు న్యాయమైన ధరలు దక్కడం లేదు. అయినా ఈ సమస్యలను పరిష్కరించడానికి చేపడుతున్న చర్యలు మాత్రం శూన్యం. 


కానీ తాజాగా ఆయిల్‌పామ్ సాగు కోసం రాష్ట్రప్రభుత్వం లక్షల ఎకరాలను సిద్ధం చేయడం చూస్తుంటే ఆ రంగంలో ఉన్న బడా కంపెనీల ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ కంపెనీలు మొత్తం రిఫైన్డ్‌ ఆయిల్ రంగంపై పట్టు కోసం, అనువు గాని చోట ఆయిల్‌పామ్‌ను ప్రోత్సహిస్తున్నాయి. కొత్తగా కాంట్రాక్ట్ ఫార్మింగ్‌లోకి రైతులను దించి లాభాలు గడించాలని చూస్తున్నాయి. ప్రభుత్వం కూడా వీటి కోసం భారీ సబ్సిడీలు, బ్యాంకు రుణాలు సిద్ధం చేస్తున్నది. ప్లాంటేషన్ పేరుతో నయా జమీందారులు, తాము పరిమితి మించి కొనుగోలు చేసిన భూములను ఈ పథకం కిందికి తెచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. కానీ ఒక కార్పొరేట్ కంపెనీ చేతుల్లో జామాయిల్, సుబాబుల్ రైతులు పొందుతున్న చేదు అనుభవాలు దృష్టిలో ఉంచుకుని చిన్న, సన్నకారు, మధ్యతరగతి ఆయిల్‌పామ్ రైతులు జాగురూకతతో వ్యవహరించాలి.


తెలంగాణ రాష్ట్ర గ్రామీణ ప్రాంతంలో సగం మందికి సెంటు భూమి కూడా లేదని 2011లోనే ‘సామాజిక, ఆర్థిక, కుల గణన నివేదిక’ స్పష్టం చేసింది. 1973 భూ గరిష్ఠ పరిమితి చట్టాన్ని సవరించి, గరిష్ఠ కమతం సైజును మరింత తగ్గించి అయినా భూమి లేని పేదలకు సాగు కోసం భూమిని అందించాలని 2013లో అప్పటి కేంద్రప్రభుత్వం ఒక విధానపత్రాన్ని రూపొందించి అన్ని రాష్ట్రాలకు పంపించినా, తెలంగాణ గ్రామీణ పేదలు భూమి కోసం అనేక ఉద్యమాలు సాగించినా, త్యాగాలు చేసినా, ఇప్పటికీ సాగును వృత్తిగా ఎంచుకుందామని అనుకుంటున్న పేదలకు భూమి దక్కలేదు. దళిత కుటుంబాలకు 3 ఎకరాల భూమి కొనుగోలు పథకం కూడా అటక ఎక్కేసింది. సబ్‌ప్లాన్ నిధులు అందుబాటులో ఉన్నా, ఈ పథకం అమలు కావడం లేదంటే ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతోంది. 


ఇప్పటి పరిస్థితుల్లో భూమి లేని పేదలు కానీ, సన్న చిన్నకారు రైతులు గానీ ఒక్క సెంటు కూడా భూమి కొనుగోలు చేయలేరు. గ్రామీణరైతులు తప్ప అందరూ, గ్రామాలకు వెళ్ళి భూములు కొంటున్నారు. భూ గరిష్ఠ పరిమితిని కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. 2020లో రెవెన్యూ చట్టంలో తెచ్చిన మార్పుల వల్ల, ఇంతకాలం కొన్ని జిల్లాలలో భూస్వాముల భూములు ఆక్రమించుకుని సాగు చేసుకుంటున్న పేదల నుంచి ఆ భూములు జారిపోయి మళ్ళీ ఆ దొరల చేతుల్లోకే వెళ్లిపోయాయి. భూమి యజమాని ఎవరు అయినా, అనుభవదారు కాలమ్‌లో కౌలురైతు పేరు నమోదు అయి ఉండేది. ఇది, గతంలో సాగించిన రైతు ఉద్యమాల ద్వారా సాధించుకున్న హక్కు. కానీ 2016లో పాస్ పుస్తకాల చట్టంలో మార్పు చేసి అనుభవదారు కాలమ్‌లో కూడా భూమి యజమాని పేరే రాయడం వల్ల, అసలు కౌలు రైతులకు గుర్తింపే లేకుండా పోయింది. 2011లో వచ్చిన కౌలురైతుల గుర్తింపు చట్టం కూడా తెలంగాణలో అమలు కావడం లేదు. ఫలితంగా కౌలురైతులకు ఎటువంటి సహాయం అందక నష్టపోతున్నారు.


ఆత్మహత్య చేసుకుంటున్న రైతులలో కౌలురైతుల సంఖ్య 80 శాతం. మంచిర్యాల జిల్లాలో ఇటీవల జరిగిన కౌలురైతు కుటుంబం ఆత్మహత్యల విషాదం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతున్నది. భూమి పంపిణీ కోసం, కౌలురైతుల గుర్తింపు కోసం ఉన్న చట్టాలను అమలు చేయకపోవడం, దళితులకు, కౌలు రైతులకు సామాజిక న్యాయం కల్పించడం పట్ల ఏ మాత్రం దృష్టి పెట్టకపోవడం తెలంగాణ ప్రభుత్వ నిజస్వభావాన్ని పట్టి చూపుతున్నది. అటవీహక్కుల చట్టం ప్రకారం ఆదివాసీలకు అందించాల్సిన పట్టాల విషయంలో కూడా ఇదే ధోరణితో వ్యవహరిస్తున్నది. అటవీ హక్కుల చట్టం కింద 1,84,730 మంది 6,31,850 ఎకరాలపై పట్టాల కోసం దరఖాస్తు చేసుకుంటే, 94,774 మందికి కేవలం 3,03,970 ఎకరాలపై గత ప్రభుత్వాలు పట్టాలు ఇచ్చాయి. ఆదివాసీలకు అటవీవనరులపై సాముదాయక పట్టాలు ఇవ్వడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చాక మళ్ళీ మరోసారి, 2018 నుంచి 98,745 ఎకరాల కోసం 27,990 మంది ఆదివాసీలు దరఖాస్తు చేసుకుంటే, వాటిలో 2401 మందిని మాత్రమే 4248 ఎకరాలపై హక్కుపత్రాలు ఇవ్వడానికి అర్హులుగా తేల్చారు కానీ, పట్టాలు ఇవ్వలేదు. 53,565 ఎకరాలకు చెందిన 15,558 దరఖాస్తులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. పట్టాలు దక్కక పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు రైతుబంధు పథకం, పంట రుణాలు అందడం లేదు, రైతుబీమా పరిధిలోకి వీరు రావడం లేదు. ప్రభుత్వం హామీలు ఇవ్వడం తప్ప, ఎప్పటికి వీరికి న్యాయం జరుగుతుందో తెలియదు. జనాభా గణాంకాల శాఖ పరిధిలో శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ లెక్కల ప్రకారం తెలంగాణ జిల్లాల్లోని గ్రామీణ ప్రాంతాలలో 15-–59 సంవత్సరాల వారిలో ప్రతి సంవత్సరం కనీసం 65,196 మంది మరణిస్తున్నారు. కానీ రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబీమా పథకం ప్రకారం, కేవలం భూమిపై పట్టా హక్కులు కలిగినవారు మాత్రమే పరిహారానికి అర్హులు కావడం వల్ల, ప్రతి సంవత్సరం కేవలం 17,000 కుటుంబాలకు మాత్రమే 5 లక్షల పరిహారం అందుతున్నది. మిగిలిన కుటుంబాలకు ఎటువంటి పరిహారం అందడం లేదు. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని రైతుబీమా పథకాన్ని మొత్తం గ్రామీణ కుటుంబాలకు విస్తరించాలి. వ్యక్తిని కాకుండా కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకోవాలి. బీమా వయోపరిమితిని కూడా 75 సంవత్సరాలకు పెంచాలి. రాష్ట్రంలో ఈ ప్రభుత్వ పాలనలో, ఇప్పటి వరకూ 5300 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే కేవలం 1200 మంది రైతుల ఆత్మహత్యలను మాత్రమే ప్రభుత్వం గుర్తించింది. అందులో సగం మందికే పరిహారం అందించింది. మిగిలిన కుటుంబాలు ఏ సహాయం అందక ఘోషిస్తున్నాయి. ప్రభుత్వం ఈ వైఖరిని మార్చుకుని అన్ని బాధిత కుటుంబాలను గుర్తించి వెంటనే పరిహారం అందించాలి. ఈ సమస్యలను పదేపదే ప్రస్తావించడానికి కారణం-– ఎప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలకిస్తుందేమోననే ఆశ ఉండడమే; మౌనంగా ఉంటే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించడానికే.

కన్నెగంటి రవి

రైతు స్వరాజ్య వేదిక

Updated Date - 2021-04-06T05:54:05+05:30 IST