ఇంటికొక ఉద్యోగం ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2020-10-09T06:07:09+05:30 IST

తెలంగాణ ఉద్యమంలో ఇంటికొక ఉద్యోగామిస్తామని ఊరు-వాడ ఏకం చేసి ప్రచారం చేశారు. రాష్ట్రం వచ్చి ఆరేళ్ళు గడిచిపోయాయి. ఊరుకొక ఉద్యోగమైనా...

ఇంటికొక ఉద్యోగం ఇంకెప్పుడు?

రాష్ట్రంలో పదవీవిరమణ వల్ల ఏర్పడ్డ ఖాళీల భర్తీకి అదనపు బడ్జెట్ అవసరం లేదు. ఇవి మంజూరైన ఉద్యోగాలు. వీటికంటూ ఇదివరకే కేటాయించిన బడ్జెట్ ఉంటుంది. ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయకపోతే ఆ బడ్జెట్ మిగిలిపోతుంది. ప్రభుత్వం దాన్ని ఇతర పథకాల అమలుకు, కాంట్రాక్టర్లకు మళ్లిస్తోంది. ప్రస్తుతం ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయకపోతే ఏటా పదివేల కోట్ల బడ్జెట్ మిగిలిపోతుంది. ఇలా మిగుల్చుకోవడానికే ఖాళీల భర్తీని ఉపేక్షిస్తున్నారనే విమర్శలలో ఎంతో నిజం ఉంది.


తెలంగాణ ఉద్యమంలో ఇంటికొక ఉద్యోగామిస్తామని ఊరు-వాడ ఏకం చేసి ప్రచారం చేశారు. రాష్ట్రం వచ్చి ఆరేళ్ళు గడిచిపోయాయి. ఊరుకొక ఉద్యోగమైనా వచ్చిందా? ప్రభుత్వ వ్యవస్థలో ఖాళీగా ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసే విషయంలో పాలకులు ఎందుకు శ్రద్ధ చూపడం లేదు? ఇది తమ రాజ్యాంగ బాధ్యతను విస్మరించడమేననే విషయం తెలియదా? ఆరేళ్ళుగా రిటైర్ అయిన వారి స్థానాలను టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం భర్తీ చేయడం లేదు. అంతకు ముందు ఏర్పడిన ఖాళీలు కూడా అలాగే ఉన్నాయి. ఉద్యోగులు లేక ప్రభుత్వ ఆఫీసులు వెల వెల బోతున్నాయి. ప్రజల ఏలాంటి పనులు జరుగడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆఫీసులలో 10 మంది సిబ్బంది ఉండవలిసిన చోట నలుగురితో పని కానిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన తరువాత అన్ని ప్రభుత్వ ఆఫీసులలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి. విభజన సందర్భంగా మెజారిటీ ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లి పోయారు. సచివాలయం, డైరెక్టరేట్లు, జిల్లా కార్యాలయాలు, తాలుకా, మండల కార్యాలయాలలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. అయినా ప్రభుత్వం వీటి భర్తీపై దృష్టి పెట్టడం లేదు.


టిఆర్‌ఎస్‌ సర్కార్‌ ప్రత్యేకంగా 23 కొత్త జిల్లాలు, 131 మండలాలు, 30 రెవెన్యు డివిజన్లు, 76 మునిసిపాలిటీలు, 7 మునిసిపల్ కార్పొరేషన్లు, 4383 గ్రామ పంచాయతీలు, 103 కొత్త పొలీస్ స్టేషన్లు, 25 పొలీస్ డివిజన్లు, 31 పొలీస్ సర్కిల్స్, 7 పొలీస్ కమిషనరేట్లు ఏర్పాటు చేసింది. దాంతో గ్రూప్-1 పోస్టులు, గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలు పెద్ద సంఖ్యలో ఏర్పడ్డాయి. అలాగే క్లర్కులు, తదితర 40 వేల ఉద్యోగాలు కొత్తగా వచ్చాయి. వీటితో సహా మొత్తం 2 లక్షల 50 వేలకు పైగా ఖాళీలు ఉన్నాయి. వీటిని భర్తీ చేయకపోవడం వల్ల ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు మందగిస్తున్నాయి. 


తెలంగాణలో 16 లక్షల మంది డిగ్రీ, పి.జి., ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సులు చదివి నిరుద్యోగులుగా ఉన్నవారు గ్రూప్1 పోటీ పరీక్షల కోసం, లెక్చరర్లు, టీచర్ల ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో పదవీవిరమణ వల్ల ఏర్పడ్డ ఖాళీల భర్తీకి అదనపు బడ్జెట్ అవసరం లేదు. ఇవి మంజూరైన ఉద్యోగాలు. వీటికంటూ ఇదివరకే కేటాయించిన బడ్జెట్ ఉంటుంది. ఈ ఉద్యోగాల్ని భర్తీ చేయకపోతే ఆ బడ్జెట్ మిగిలిపోతుంది. ప్రభుత్వం దాన్ని ఇతర పథకాల అమలుకు, కాంట్రాక్టర్లకు మళ్లిస్తోంది. ప్రస్తుతం ఉన్న 2 లక్షల 50 వేల ఉద్యోగాల ఖాలీలను భర్తీ చేయకపోతే ఏటా పదివేల కోట్ల బడ్జెట్ మిగిలిపోతుంది. ఇలా మిగుల్చు కోవడానికే ఖాళీల భర్తీని ఉపేక్షిస్తున్నారనే విమర్శలలో ఎంతో నిజం ఉంది. 


గ్రూపు-1 సర్వీస్ కింద నేరుగా నియామకాలు జరిపే కోటాలో గత పదేళ్ళుగా ఏర్పడిన మొత్తం ఖాళీలు 1600. వీటి భర్తీకి వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి. గ్రూపు-1 కేటగిరీ కింద 18 సర్వీసులలో దాదాపు 1600 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వీటిలో డిప్యూటి కలెక్టర్లు, డిఎస్‌పి (పోలీస్), సిటిఓ, రిజిస్ట్రార్ తదితర 18 శాఖల పోస్టులు ఉన్నాయి. పది సంవత్సరాల నుంచి గ్రూప్-1 నోటిఫికేషన్ జారి చేయలేదు. ఇంత తీవ్ర జాప్యం ఇంతకముందెన్నడు జరగలేదు. గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలు చాల ముఖ్యమైనవి. కొత్త జిల్లాలు, మండలాల ఏర్పాటు తర్వాత గ్రూప్-2 సర్వీస్ ఉద్యోగాలను అసలు భర్తీ చేయలేదు. గ్రూపు-3 సర్వీస్‌లో 8 వేలకు పైగా ఖాళీలున్నాయి. గ్రూపు-4 సర్వీస్ కింద 40 వేల జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలన్నీ  ప్రభుత్వం సజావుగా నడవడానికి ఎంతో కీలకమైనవి. ప్రతి ఫైలు జూనియర్ అసిస్టెంట్ ద్వారానే రూపుదిద్దుకుంటుంది. ఇట్లాంటి కీలకమైన జూనియర్ అసిస్టెంట్ పోస్టులను సర్వీసు కమిషన్ ద్వారా భర్తీ చేయకపోవడంతో ప్రభుత్వ యంత్రాంగం బలహీనపడుతోంది. ఈ పోస్టులన్నిటినీ భర్తీ చేస్తే రాష్ట్రంలో కొంతైనా నిరుద్యోగాన్ని రూపుమాపవచ్చు.


రెవెన్యు శాఖలో, రిజిస్ట్రేషన్ శాఖలో, సర్వే డిపార్ట్ మెంట్‌లో అన్ని కేటగిరిలు కలిపి 14 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. తహశీల్దారు, ఆర్డీవో కార్యాలయాలలో క్లర్కులు, కంప్యూటర్ ఆపరేటర్లు లేక ప్రజల పనులేవీ జరగడం లేదు. విద్యార్థులకు కులం, ఆదాయ సర్టిఫికెట్లు ఇచ్చే దిక్కు లేదు. కొత్తగా ఏర్పాటు చేసిన 23 జిల్లాలు, 131 మండలాలు, 30 రెవెన్యూ డివిజన్లలో సైతం ఒక్క కొత్త ఉద్యోగాన్ని కూడా భర్తీ చేయలేదు. సర్వే విభాగంలో సర్వేయర్లు లేక రైతులు భూతగాదాలు పరిష్కరించుకోలేక కోర్టుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. అందువల్ల ఈ ఖాళీల భర్తీకోసం వెంటనే నోటిఫికేషన్ జారీ చేయాలి.


వైద్య, ఆరోగ్యశాఖలో 18 వేల పోస్టులను ఏళ్ల తరబడి భర్తీ చేయకుండా జాప్యం చేస్తున్నారు. కొవిడ్-19 మహమ్మారి వచ్చినా ఎలాంటి నియామకాలు జరపడంలేదు. వైద్య-ఆరోగ్య శాఖలో డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టేక్నిషియన్స్ పారా మెడికల్ సిబ్బంది సరిపడా లేక కొవిడ్‌ కారణంగా ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం. ఈ దుస్థితికి ప్రభుత్వ అసమర్ధతే కారణం.


పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో 12 వేల పోస్టులు భర్తీ చేయవలిసి ఉంది. కొత్తగా 4383 గ్రామపంచాయతీలు మంజూరు చేశారు. కానిఒక్క అదనపు పోస్టునూ భర్తీ చేయలేదు. సిబ్బంది లేకుండా కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటు చేసినా ప్రయోజనమేమిటి? మునిసిపాలిటీలలో, మునిసిపల్ కార్పొరేషన్లలో వివిధ కేటగిరిలలో 20 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలలలో 40 వేల టీచర్ పోస్టులు, 10 వేల ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు, 5 వేల ఆర్ట్, క్రాఫ్ట్‌, డ్రాయింగ్ టీచర్ పోస్టులు, 4 వేల కంప్యూటర్ టీచర్ పోస్టులు, 10 వేల క్లరికల్ పోస్టులు, 3 వేల లైబ్రేరియెన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే 4900 ఎయిడెడ్ స్కూల్ టీచర్ పోస్టులు, 2 వేల మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు, 1500 కస్తుర్బా టీచర్ పోస్టులు, గురుకులాల్లో మరో 4 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయవలిసి ఉంది. పాఠశాల విద్యావ్యవస్థను నిర్లక్ష్యం చేస్తే దాని ప్రభావం ప్రత్యక్షంగా, పరోక్షంగా సమాజం మీద తీవ్రంగా ఉంటుంది. వ్యవసాయ శాఖ, సహకార శాఖ, ఉద్యానవన శాఖలలో కూడా దాదాపు 8 వేలకు పైగా ఖాళీలున్నాయి. హోంశాఖ, జైళ్ళ శాఖ దాని అనుబంధ శాఖలలో పొలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ క్లరికల్ ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. వందల సంఖ్యలో ఏర్పాటు చేసిన కొత్త పొలీస్ స్టేషన్లలో 2 వేలకు పైగా భర్తీ చేయవలిసి ఉంది. ఇవి కాకుండా ఇతర శాఖల్లో ఉన్న అన్నీ ఖాలీలను కలుపుకుంటే అవి ప్రభుత్వ శాఖలలో కలిపి 2 లక్షల 50 వేలకు పైనే అవుతాయి. వాటిని భర్తీ చేయడానికి తక్షణమే చర్యలు చేపట్టాలి.

ఆర్.కృష్ణయ్య 

అధ్యక్షులు జాతీయ బి.సి. సంక్షేమ సంఘం

Updated Date - 2020-10-09T06:07:09+05:30 IST