నిరంతర నీటి సరఫరాకు మోక్షమెప్పుడో?

ABN , First Publish Date - 2021-05-09T05:52:39+05:30 IST

కరీంనగర్‌కు తలాపునే దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండి) ఉన్నప్పటికీ నిరంతర నీటి సరఫరాకు మోక్షం కలగడం లేదు.

నిరంతర నీటి సరఫరాకు మోక్షమెప్పుడో?

- రూ.70 కోట్లతో ప్రణాళికలు 

- ముందుకు కదలని పనులు 

- ఎల్‌ఎండీలో తగ్గుతున్న నీటి నిలువలు 

కరీంనగర్‌ టౌన్‌, మే 8: కరీంనగర్‌కు తలాపునే దిగువ మానేరు జలాశయం (ఎల్‌ఎండి) ఉన్నప్పటికీ నిరంతర నీటి సరఫరాకు మోక్షం కలగడం లేదు.  దశాబ్దకాలంగా 24/7 మంచినీటిని అందిస్తామని ప్రజాప్రతినిధులు, అధికారులు చెబుతున్నా అది కార్యరూపం దాల్చడం లేదు. అర్బన్‌ మిషన్‌ భగీరథతోపాటు స్మార్ట్‌సిటీ పథకం ద్వారా నగర ప్రజల నిరంతర నీటి సరఫరా ఆశలను నెరవేర్చేందుకు ప్రణాళిక రూపొందించినప్పటికి ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కి అన్న చందంగా పనులు జరుగుతున్నాయి. దీంతో కరీంనగర్‌లో నిరంతర మంచినీటి సరఫరా ఎప్పటికీ ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.

 రంగు మారి.. దుర్వాసనతో..

రాష్ట్రంలోనే మొట్టమొదటి సారిగా కరీంనగర్‌ కార్పొరేషన్‌ 24/7 మంచినీటి సరఫరాలో భాగంగానే రోజూ సరఫరా చేస్తున్నప్పటికి అనేక అవాంతరాలు ఎదురవుతున్నాయి. 45 రోజుల క్రితం నుంచి కొన్ని డివిజన్లలో నల్లా నీరు రంగు మారి, దుర్వాసనతోనే వస్తున్నాయి. మరికొన్ని చోట్ల కొద్దిసేపు తక్కువ ఫ్రెషర్‌తో నీరు వస్తోంది. గతంలో మాదిరిగా రోజు విడిచి రోజు నీటిని సరఫరా చేసినా సరేకానీ స్వచ్చమైన శుద్దిచేసిన నీటిని, కనీసం గంటసేపు ప్రెషర్‌తో ఇవ్వాలని కోరుతున్నారు.  మిడ్‌ మానేరు నుంచి ఎల్‌ఎండీలోకి వస్తున్న నీరు నాచు, ఇతర కలుషిత పదార్థాలతో రంగు మారుతోందని మున్సిపల్‌ ఇంజనీర్‌ తెలిపారు.  శుద్ధి చేసి నీటిని సరఫరా చేస్తున్నామని, కొద్దిరోజులపాటు నీటిని వేడిచేసి తాగాలని ఆయన సూచించారు.

 ఇదీ కార్యచరణ

 నగరపాలక సంస్థ పరిధిలో నిరంతర తాగునీటి సరఫరాకు కార్యాచరణ అమలవుతోంది. ఇప్పటికే మిషన్‌ భగీరథ ద్వారా నిర్మించిన రెండు రిజర్వాయర్లు, సంపులు, పైపులైన్లు, బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్లను నిర్మించారు.  వాటి పరిధిలో ఉన్న 16 రిజర్వాయర్లకు అనుసంధానం చేసి ఆయా రిజర్వాయర్ల ద్వారా 24/7 నీటి సరఫరా చేయాలని ప్రణాళిక రూపొందించారు. ఇందుకోసం ఒక్కో రిజర్వాయర్‌ కింద ఉన్న ప్రాంతాన్ని ఒక్కో జోన్‌గా విభజించారు. మొదటి దశలో ప్రయోగాత్మకంగా భగత్‌నగర్‌, రాంపూర్‌, హౌజింగ్‌బోర్డు కాలనీ జోన్లను 24 గంటల నీటి సరఫరాకు అనుగుణంగా మార్పులు చేయడానికి కసరత్తు చేశారు. మొదటి విడత నీటిసరఫరాకు స్మార్ట్‌ సిటీ నిఽధుల నుంచి 70 కోట్ల రూపాయలను కేటాయించారు.  ముందుగా ఆయా రిజర్వాయర్లకు సాంకేతికంగా మార్పులు చేయడం, లీకేజీలు ఉన్నచోట కొత్తగా పైపులైన్లు వేయడం, అవసరమైన ప్రాంతాల్లో ఇంటర్‌ కనెక్షన్లు ఇచ్చి అక్కడి నుంచి ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ముందుగా కాలనీల్లో డిస్టెన్స్‌ మీటరు ఏరియాను ఏర్పాటు చేసి నీటి సరఫరా, ఒత్తిడిలను రికార్డు చేస్తారు. ఆయా కాలనీల డిమాండ్‌కు అనుగుణంగా ఎంత నీటిని సరఫరా చేయాలో నిర్ణయిస్తారు. నగర పరిధిలో ప్రస్తుతం 641 కిలోమీటర్ల పైపులైన్లు ఉండగా, 51 వేలకుపైగా ఇళ్లలో, 195 పబ్లిక్‌ నల్లా కనెక్షన్లు ఉన్నాయి.

 పక్కా లెక్కల కోసం స్కాడా విధానం అమలు...

24 గంటలు సరఫరా చేసేందుకు నీటి లెక్కలు పక్కాగా ఉండాలని, ఇందుకోసం స్కాడా విధానం అమలు చేస్తున్నారు. ప్రతి రోజు శుద్ది చేస్తున్న నీటి వివరాలు, ఎంత సమయంలో ఎన్ని లీటర్ల నీటి సరఫరా జరుగుతోంది. ఫిల్టర్‌బెడ్‌ సామర్థ్యం, రిజర్వాయర్ల నీటి నిల్వ సామర్థ్యం తదితర అంశాలను లెక్కిస్తారు. ఈ  విధానం అమలుకు 46 కోట్లతో అంచనాలు రూపొందించి పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మొదట 14 ప్రాంతాల్లో ఫ్లో మీటర్లను బిగించారు. రెండు డివిజన్‌ రిజర్వాయర్లలో డివిజన్‌ మీటర్లతోపాటు ఎనిమిది ఫ్లో మీటర్లు ఏర్పాటు చేస్తున్నారు. శాతవాహన యూనివర్సిటీ, హైలెవల్‌ జోన్‌లో కోర్టు, ఎస్సారార్‌ కాలేజీ, రాంనగర్‌, అంబేద్కర్‌నగర్‌, లోలెవల్‌లో మార్కెట్‌, హౌసింగ్‌బోర్డు కాలనీ, రాంపూర్‌, గౌతమినగర్‌, భగత్‌నగర్‌లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటర్లను సిమ్‌ కార్డులతో అనుసంధానం చేయడం ద్వారా ఎప్పటికప్పుడు రిజర్వాయర్‌ నీటి సరఫరా పూర్తి సమాచారం తెలుసుకుంటారు. 

 నత్తనడకన..

ఈ పనులన్నీ నత్తనడకన సాగుతున్నాయి. అనుకున్నట్లుగా పనులు వేగంగా పూర్తిచేస్తే వచ్చే వేసవి వరకు 24 గంటల నీటి సరఫరాను నగరంలో అమలు చేయవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం డీపీఆర్‌ సిద్ధం చేసి టెండర్ల ప్రక్రియ దశకు తీసుకువచ్చారు. మరోవైపు సాంకేతిక పనులు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. మిగతా సాధారణ పనులను కాంట్రాక్టర్లకు అప్పగించి 6 నుంచి 8 నెలల లోపల పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు. ప్రయోగాత్మకంగా 15 వేల ఇళ్లకు అయినా నీటి సరఫరా చేయడానికి పనులు ప్రారంభించారు. ఈ పనులు వేగంగా పూర్తిచేసి వచ్చే వేసవి నాటికైనా నిరంతర మంచినీటి సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. అప్పటికి వరకు కనీసం శుద్ధిచేసిన స్వచ్చమైన మంచినీటిని సరఫరా వేళల ప్రకారం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని నగరవాసులు కోరుతున్నారు.  


Updated Date - 2021-05-09T05:52:39+05:30 IST