ఆర్‌యూబీ నిర్మాణం ఎన్నడో..?

ABN , First Publish Date - 2022-08-10T05:01:55+05:30 IST

ఆర్‌యూబీ నిర్మాణం ఎప్పుడా అని నందలూరు వాసులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం క్రితం కోటి రూపాయలకు పైగా వెచ్చించి నందలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్‌యూబీ చినుకుపడితే చాలు మునిగిపోతుండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.

ఆర్‌యూబీ నిర్మాణం ఎన్నడో..?
రైల్వేగేటుకు వెళ్లే ప్రధాన రహదారి

నందలూరు వాసులకు తప్పని ట్రాఫిక్‌ కష్టాలు 

రైల్వేగేటు పడిందంటే తిప్పలే 

నందలూరు, ఆగస్టు 9: ఆర్‌యూబీ నిర్మాణం ఎప్పుడా అని నందలూరు వాసులు ఎదురు చూస్తున్నారు. చాలా కాలం క్రితం కోటి రూపాయలకు పైగా వెచ్చించి నందలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలో ఏర్పాటు చేసిన ఆర్‌యూబీ చినుకుపడితే చాలు మునిగిపోతుండడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది.  ఇటీ వల దాదాపు నెల రోజులకు పైగా ఆర్‌యూబీకి ఇరువైపులా పట్టణ వాసులతో పాటు గ్రామీణ ప్రజలు పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అయితే రైల్వేగేటు ఆ శాఖకు ప్రధాన సమస్యగా మారింది. రైల్వే శాఖ అనేక ప్రాంతాల్లోని రైల్వేగేట్లను తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే దేశవ్యాప్తంగా అనేక రైల్వేగేట్లు తొలగించిన విషయం తెలిసిందే.. కాగా నందలూరు మండలంలోని నాగిరెడ్డిపల్లె మేజర్‌ గ్రామ పంచాయతీలో రైల్వేగేటు ఏర్పాటు చేశారు. గ్రామానికి ఇరువైపులా పట్టణం విస్తరించి ఉండడంతో పాటు వేల సంఖ్యలో గృహాలు, నివాస ప్రాంతాలు, వివిధ కార్యాలయాలు, పాఠశాలలతో పాటు రోడ్డుకు ఇరువైపులా గ్రామీణ ప్రాంతాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. దాంతో వాహన రాకపోకలు అధికంగా ఉంటాయి. ఇలాంటి తరుణంలో రైల్వే గేట్లు తొలగించేందుకు రైల్వే శాఖ రంగం సిద్ధం చేసింది. నందలూరులో సైతం రైల్వే గేట్లు ఎత్తివేసి ఆర్‌యూబీ  ఏర్పాటుకు రైల్వే శాఖ ఇప్పటికే పలుమార్లు సర్వే నిర్వహించిన విషయం విదితమే.. అయితే ఈ ఆర్‌యూబీ నిర్మాణానికి అనేక గృహాలు, నివాస ప్రాంతాలు తొలగించాల్సిన అవసరం ఉంది. ఇందుకు సంబంధించి ఆయా నివాసాలకు నష్టపరిహారం అందించిన తరువాతే ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టడానికి వీలవుతుంది. కాగా ఒక వైపు ట్రాఫిక్‌ సమస్య, మరో వైపు రైల్వే గేటు సమస్య, ఇంకో వైపు వర్షపు నీటితో మునిగిపోతున్న ఆర్‌యూబీతో జనం ఏళ్ల తరబడి కష్ట్టాలు ఎదుర్కొంటున్నారు. ఆర్‌యూబీ నిర్మాణం ఎప్పుడా అని నాగిరెడ్డి పల్లె వాసులు ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నిర్మాణం చేపడితే అరవపల్లెలోని నాగిరెడ్డిపల్లె గ్రామ సచివాలయం నుంచి రైల్వే గేటు అవతల ఉన్న నాగిరెడ్డిపల్లె క్రాస్‌ రోడ్డు వరకు నివాస గృహాలు నష్టపోయే ప్రమాదం లేకపోలేదు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకొని రైల్వే శాఖ త్వరలోనే ఆర్‌యూబీ నిర్మాణం చేపట్టే అవకాశాలు కనబడుతున్నాయి. ఇదిలా ఉండగా కడప- రేణిగుంట నాలుగు లైన్ల జాతీయ రహదారి నాగిరెడ్డిపల్లె చివరలోని ఎర్రిపాపయ్య గారిపల్లె గ్రామం మీదుగా వెళ్తుండటం గమనార్హం. ఇలాంటి తరుణంలో నందలూరు నుంచి జాతీయ రహదారికి చేరుకోవాలంటే ఆర్‌యూబీ సరిపోతుందా లేక ఫ్లైఓవర్‌ నిర్మాణం చేపడతారా అన్న విషయాలు తెలియాల్సి ఉంది. అయితే రైల్వే గేటు మీదుగా కాకుండా నందలూరు నుంచి జాతీయ రహదారికి రోడ్డు అనుసంధానం చేయాలంటే కచ్చితంగా రైల్వే ట్రాక్‌ దాటాల్సి ఉంది. 

ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎక్కడ బ్రిడ్జి నిర్మాణం చేపడుతుందో లేదో అంతుపట్టని విషయంగా మారింది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివాసముంటున్న ప్రజలు, వ్యాపారులు తీవ్ర భయాం దోళనకు గురవుతున్నారు.



Updated Date - 2022-08-10T05:01:55+05:30 IST