ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-06-22T05:57:19+05:30 IST

ప్రజలను సురక్షితం గా తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో తమను తాము మరిచిపోయి సంస్థ కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం మరిచి పోయింది.

ఆర్టీసీ కార్మికులకు పీఆర్సీ ఎప్పుడు?

అసెంబ్లీలో ప్రకటించినా.. అతీగతీ లేదు

2013 పీఆర్సీ బకాయిలు ఇంకా ఇవ్వని వైనం

పెండింగ్‌లో ఉన్న రెండు పే స్కేల్స్‌, నాలుగు డీఏలు

జిల్లాలో ఎదురు చూస్తున్న 580 మంది ఆర్టీసీ కార్మికులు

ఆదిలాబాద్‌టౌన్‌, జూన్‌ 21: ప్రజలను సురక్షితం గా తమ గమ్యస్థానాలకు చేరవేయడంలో తమను తాము మరిచిపోయి సంస్థ కోసం ఎంతగానో కృషి చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీని రాష్ట్ర ప్రభుత్వం మరిచి పోయింది. ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ఫిట్‌ మెంట్‌ ఇస్తామని సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటిం చారు. కానీ అమలులో మాత్రం ఇప్పటి వరకు అడుగు ముందుకు వేయలేదు. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, జీవోలు కూడా జారీ చేసినా.. ఆర్టీసీ ఉద్యోగుల పీఆర్సీపై మాత్రం ఒక్క ప్రకటన కూడా చేయలేదు. 

పీఆర్సీపై ప్రభుత్వం సైలెంట్‌..

ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీలో 580 మంది పని చేస్తుండగా ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని రీజి యన్‌ పరిధిలో 2,400 పైచిలుకు మంది కార్మికులు పని చేస్తున్నారు. అయితే 2017 ఏప్రిల్‌ 1 నుంచి ఆర్టీసీ ఉద్యోగులకు వేతన సవరణ జరగాల్సి ఉంది. కానీ నాలుగేళ్లుగడుస్తున్నా నేటికీ కార్మికులకు వేతన సవర ణ కలగానే మిగిలిపోయింది. ఫిట్‌మెంట్‌ ప్రకటించక పోవడంతో 2018 జూన్‌లో సమ్మె చేస్తా మని యూనియన్లు హెచ్చరించాయి. దీంతో అప్పటి డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యులైన మంత్రుల కమిటీ యూని యన్‌ నేతలతో సుదీర్ఘంగా చర్చించింది. దీంతో ఆ సమయంలో 16శాతం ఐఆర్‌ను ప్రభుత్వం ప్రకటిం చింది. ఇది 2018 జూలై1 నుంచి అమలవుతోంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి మరో పీఆర్సీ అమలు కావాల్సి ఉంది.

ఒక్కొక్కరికి రూ.లక్ష బకాయి..

ప్రస్తుతం ఆర్టీసీ ఉద్యోగులకు నాలుగు డీఏలు రావాల్సి ఉంది. 2019లో ఒకటి, 2020లో రెండు డీఏ లు, ఈ ఏడాది జనవరితో కలిపి మొత్తం నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. 2015లో ఆర్టీసీ కార్మికు లకు 44శాతం జీతాలు పెంచింది. పెరిగిన జీతాలు 2013 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. కానీ సంస్థ డబ్బులు లేకపోవడంతో పెరిగిన జీతాల బకాయిలను బాండ్ల రూపంలో ఇచ్చారు. 8.5 శాతం వడ్డీతో ఐదేళ్ల తర్వాత చెల్లించేలా ఆర్టీసీ కార్మికులకు బాండ్లను జారీ చేశారు. కానీ ఆరేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పైసా చెల్లించలేదు. దీంతో ఆదిలాబాద్‌ ఉమ్మడి జిల్లాలోని 2400 పైచిలుకు మంది ఆర్టీసీ కార్మికులు ఎదురు చూపుల్లోనే ఉన్నారు. ఒక్కొక్కరికి రూ.లక్ష వరకు బకాయిలు చెల్లించాల్సి ఉంది. దీంతో ఎదురు చూపులు తప్పడం లేదు.

వేతనాల కోసం ఎదురు చూపులు..

ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా ఉన్న 580 మంది ఆర్టీసీ కార్మికులు జీతాల కోసం ఎదురు చూడక తప్ప డం లేదు. ప్రతి నెలా గతంలో 1వ తేదీలోపు వేతనా లు వారి ఖాతాల్లో జమవుతుండేవి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో వేతనాల కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నాలుగు నెలలుగా 10వ తేదీ తర్వాతే జీతాలు కార్మికుల ఖాతాల్లో వేస్తున్నారు.  అధికారులు మాత్రం 1వ తేదీ రాగానే అలవెన్సులు తీసుకుంటున్నారని, కార్మికులకు మాత్రం జీతాలు అందడం లేదని యూనియన్‌ లీడర్లు ఆరోపిస్తున్నా రు. ఇటీవల కరోనా, లాక్‌డౌన్‌తో కలెక్షన్‌ లేక పోవ డంతో ఇబ్బందులు తప్పడం లేదు. ప్రస్తుత జూన్‌ వేతనాన్ని 16వ తేదీ వరకు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని కార్మికులు వాపోతున్నారు. కాగా, ఆర్టీసీ దరఖాస్తు పెట్టుకున్న లోన్‌ డబ్బులు వస్తేనే వేతనాలు వచ్చే అవకాశం ఉందని తెలిపినట్లు కార్మికులు చెబుతున్నారు. మరో వైపు రిటైర్డ్‌ అయిన ఉద్యోగుల పెన్షన్‌ డబ్బులు కూడా సరిగా ఇవ్వడం లేదని వారికి నెలకు రూ.2 వేల నుంచి రూ.4వేల మధ్య మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం.

Updated Date - 2021-06-22T05:57:19+05:30 IST