గాడివంపు నిర్మాణం ఎప్పుడు?

ABN , First Publish Date - 2021-05-03T04:59:04+05:30 IST

గాడివంపు నిర్మాణం ఎప్పుడు?

గాడివంపు నిర్మాణం ఎప్పుడు?

  • 16ఏళ్ల క్రితం శంకుస్థాపన  
  • దశాబ్దాలుగా పూర్తికాని ప్రాజెక్టు 
  • రైతులకు పరిహారమే ప్రధాన సమస్య

మంచాల : గిరిజన ప్రాంత వాసుల వరప్రదాయినిగా గాడివంపు వాగు ప్రాజెక్టుకు ప్రత్యేకత ఉంది. 16 ఏళ్లుగా పురోగతిలేక ప్రాజెక్టు నిర్మాణం కోసం వేసిన శిలాఫలకాలు అలంకార ప్రాయంగా మిగిలాయి. తాజాగా శివన్నగూడ ఎత్తిపోతల పథకం రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం కింద డీపీఆర్‌ సర్వేతో గాడివంపువాగు ప్రాజెక్టుపై రెండేళ్ల క్రితం కదలిక వచ్చినా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగానే ఉంది.


  • ఏళ్ల క్రితమే ప్రాజెక్టుకు అంకురార్పణ

మంచాల మండలం ఎల్లమ్మతండా సమీపంలో గాడివంపు వాగుపై ప్రాజెక్టు నిర్మాణానికి 13 ఆగస్టు 2003న అప్పటి హోంమంత్రి దేవేందర్‌గౌడ్‌ శిలాపలకాన్ని ఆవిష్కరించారు. ప్రాజెక్టు అంచనా విలువ రూ.53.10లక్షలుగా నిర్ణయించారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో 19 నవంబర్‌  2004న అప్పటి భారీ నీటి పారుదల శాఖ మం త్రి పొన్నాల లక్ష్మయ్య ఇందిర జలప్రభ పథకంలో భాగంగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మరోసారి శిలాపలకాన్ని ఆవిష్కరించారు. అనంతర కాలంలో ఈ ప్రాజెక్టు నిర్మాణ ప్రాధాన్యాన్ని గుర్తించి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి నీటిపారుదల శాఖ అధికారులను ప్రాజెక్టు ప్రాంతానికి రప్పించారు. అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి అజయ్‌కుమార్‌ జైన్‌ గాడివంపువాగును సందర్శించారు. ఆయన ఆదేశాల తో శ్రీశైలం నుంచి నీటిపారుదల అధికారులు ఇక్కడ వారం పాటు బసచేసి ప్రాజెక్టు నిర్మాణ ప్రణాళిక రూపొందించారు. నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.1.05కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఇందులో ప్రాజెక్టు ఆనకట్ట నిర్మాణానికి రూ.55 లక్షలు కేటాయించారు. అయితే తాజా లెక్కల ప్రకారం ప్రాజెక్టు నిర్మాణ వ్యయం పెరిగే అవకాశం ఉంది. 


  • పరిహారమే ప్రధానాంశం

ముంపు ప్రాంతంగా తేల్చిన 16ఎకరాలకుగాను అప్పట్లో రూ.45లక్షలు పరిహారంగా లెక్కకట్టారు. ఇందుకు జాయింట్‌ కలెక్టర్‌ నేతృత్వంలో భూసేకరణ కమిటీ సైతం వేశారు. తదనంతర కాలంలో భూముల విలువ పెరగడంతో ముంపు రైతులు తక్కువ రేటుకు భూమి ఇచ్చేది లేదని, మార్కెట్‌ రేట్‌ కట్టివ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పుడు పరిహార మే ప్రధాన సమస్యగా మారింది. 2019లో ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి ముంపు రైతులకు ఒక్కో ఎకరాకు రూ.10 లక్షల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. క్షేత్ర నివేదిక కోసం స్థానిక అఽధికారులు గాడివంపువాగును సందర్శించారు. అనంతరం రైతులకు పరిహారం చెక్కుల పంపిణీకి ఏర్పాట్లుచేశారు. కానీ ఇదీ అమలుకు నోచుకోలేదు. ఈ క్రమంలోనే మరో రెండేళ్లు గడిచిపోయాయి. 


  • ఈ పథకాన్ని డీపీఆర్‌లో చేర్చాలి

రాచకొండ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ స్కీం శివన్నగూడ ఎత్తిపోతల పథకం ద్వారా ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సాగునీరందించే సమగ్ర  ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ ప్రాంతానికి సాగునీరందించే క్రమంలో      బండలేమూర్‌, చౌదర్‌పల్లి ప్రాంతాల్లో రిజర్వాయర్లను నిర్మించనున్నట్టు ప్రకటనలు వస్తుండటంతో అప్పటికే అన్ని అనుమతులూ సాధించిన గాడివంపువాగు ప్రాజెక్టును ఇందులో చేర్చాలంటూ గిరిజనులు డిమాండ్‌ చేస్తున్నారు. గాడివంపు వాగు ప్రాజెక్టు పరివాహక ప్రదేశంలో ఉన్న ఆవాసాలన్నీ  తండాలే. ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ఎల్లమ్మ తండా, బోడకొండ, సత్యం తండా, లోయపల్లి, కుదా్‌షపల్లి తదితర గ్రామాల పరిధిలోని వేల ఎకరాలకు సాగునీటిని అందించే అవకాశముంది.

Updated Date - 2021-05-03T04:59:04+05:30 IST