‘వికాసా’బాద్‌ ఎన్నడు?

ABN , First Publish Date - 2021-10-11T05:22:56+05:30 IST

వికారాబాద్‌ జిల్లా ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తి చేసుకుని నేడు ఆరవ ఏటలోకి అడుగు పెట్టింది. అయితే, ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న కొత్త జిల్లాను ఇంకా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి.

‘వికాసా’బాద్‌ ఎన్నడు?

  • కొత్త జిల్లాగా ఆరో ఏటలోకి అడుగు
  • అభివృద్ధి అంతంతే.! 
  • ఎక్కడి సమస్యలు అక్కడే.. పరిష్కారమయ్యేనా? 
  • ఆయూష్‌ ప్రతిపాదనలకే పరిమితం 
  • పర్యాటకానికి నోచని అనంతగిరి 
  • ముందుకు సాగని ఆహారశుద్ధి పరిశ్రమ
  • క్రీడలకు ప్రోత్సాహం కరువు 
  • మూసీ ప్రక్షాళన,  కందిబోర్డు ఏర్పాటు కంచికే..


వికారాబాద్‌ జిల్లా ఆవిర్భవించి ఐదేళ్లు పూర్తి చేసుకుని నేడు ఆరవ ఏటలోకి అడుగు పెట్టింది. అయితే, ఎన్నో ఉద్యమాలతో సాధించుకున్న కొత్త జిల్లాను ఇంకా పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. అభివృద్ధి పనులకు ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో నిఽధులు విడుదల కాకపోవడంతో మౌలిక సదుపాయాలు, వసతుల కల్పనలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త జిల్లా ఏర్పాటైన ఈ ఐదేళ్లలో చెప్పుకోదగిన అభివృద్ధి మార్కు సాధించలేకపోయామనే ఆవేదన ప్రజల్లో వ్యక్తమవుతోంది. 


(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌ జిల్లా ప్రతినిధి) : ప్రజలకు ప్రభుత్వ పాలన చేరువ చేయాలన్న ఉన్నత లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం 2016, అక్టోబరు 11న కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది. కొత్త జిల్లా ఏర్పాటుతో అధికారులు, పాలనా వ్యవస్థ ప్రజలకు చేరువైంది. గతంలో ఈ ప్రాంత ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలంటే తప్పనిసరిగా హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌ వెళ్లాల్సి వచ్చేది. కొత్త జిల్లాల ఏర్పాటుతో పరిపాలన, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు మరింత చేరువయ్యాయి. వికారాబాద్‌ జిల్లా కేంద్రం కావాలన్న ప్రాంత ప్రజల చిరకాల కోరిక నెరవేరినా పెండింగ్‌ సమస్యల పరిష్కారం, అభివృద్ధిలో ఆశించిన స్థాయిలో ప్రగతి కనిపించకపోవడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాను మూడు జిల్లాలుగా విభజించగా, వికారాబాద్‌, మేడ్చల్‌ కొత్త జిల్లాలుగా ఆవిర్భవించాయి. అయితే, కొత్త జిల్లాకు అనుగుణంగా వివిధ శాఖల్లో అవసరమైన సిబ్బందిని నియమించకపోవడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఉద్యోగులపై పనిభారం పెరిగింది. సరిపడా ఉద్యోగులు లేక పనులు సకాలంలో పూర్తికావడం లేదు. సిబ్బంది కొరత కారణంగా ప్రభుత్వం కార్యక్రమాల అమల్లో వేగం పెరగడం లేదు. జిల్లా కలెక్టరేట్‌తో పాటు ఇతర శాఖల్లోనూ సిబ్బంది కొరత నెలకొనడంతో ఫైళ్ల నిర్వహణ, పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. శాఖల వారీగా కేడర్‌ స్ట్రెంత్‌ను ప్రభుత్వం ఇటీవల ఖరారు చేసింది. వివిధ శాఖల్లో ఖాళీల భర్తీకి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నందనేది స్పష్టత లేదు. కొత్తగా నియామకాలు చేపడితేనే సిబ్బంది కొరత తప్పనుంది. జిల్లాలో ఎదురవుతున్న సమస్యలను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో అధికారులు వేగం పెంచే ప్రయత్నం చేస్తున్నారు. 

అభివృద్ధి మార్క్‌ ఏదీ?

జిల్లా అభివృద్ధితో ముడిపడి ఉన్న ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే నిధులు కూడా ఎంతో అవసరం. ఇటీవల కురిసిన వర్షాలకు మన్సాన్‌పల్లి, దోర్నాల్‌, రుద్రారం వద్ద వాగులపై చేపట్టిన రోడ్డు వంతెనల తాత్కాలిక పనులు మరోసారి కొట్టుకుపోయి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ వర్షాకాలం సీజన్‌లో ఇలా జరగడం ఇది మూడోసారి. పక్కా ప్రణాళికలతో బ్రిడ్జిల నిర్మాణం చేపడితే తప్ప ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశం కనిపించడం లేదు. వర్షాలకు రోడ్లన్నీ గుంతలమయంగా మారడంతో వాహనదారులు నరకయాతన అనుభవిస్తున్నారు. వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 280 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లింది. పులుసుమామిడి వద్ద రోడ్డు వంతెన నిర్మాణం పనులు పూర్తి చేయని కారణంగా ఇటీవల అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు వరద నీటిలో కొట్టుకుపోయి మృతి చెందాడు. ఆర్‌అండ్‌బీ రోడ్లపై  వంతెనల నిర్మాణం పనులు అసంపూర్తిగా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గ్రామీణ ప్రాంత రోడ్లు కూడా అధ్వాన్నంగా మారాయి. అనంతగిరి, కోట్‌పల్లిలను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి పరుస్తామన్న హామీ ఇంకా కార్యరూపం దాల్చలేదు. అనంతగిరిని పర్యాటకంగా అభివృద్ధి పరిచే విషయమై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా దృష్టి సారించారని చెబుతున్నా.. ఇందుకు సంబంధించి ఈ ఐదేళ్లలో ఒక్క అడుగు కూడా ముందుకు పడకపోవడం గమనార్హం. వికారాబాద్‌ ఔటర్‌ రింగ్‌ రోడ్డు ప్రతిపాదన ఇంకా కార్యరూపం దాల్చలేదు. రూ.6 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో అనంతగిరిలో ఏర్పాటు చేస్తామన్న ఆయుష్‌ ఆరోగ్య కేంద్రం ఇంత వరకు ఏర్పాటు కాలేదు. ఇతర ప్రాంతాల్లో సమీకృత మార్కెట్ల నిర్మాణం పనులు కొనసాగుతుండగా, జిల్లాలో మాత్రం ఆ పనులు ముందుకు సాగడం లేదు. పాలమూరు ఎత్తిపోతల పథకం, తాండూరులో కందిబోర్డు ఏర్పాటు, మూసీ నది ప్రక్షాళన తదితర అంశాలు ఇంకా కార్యరూపం దాల్చలేవు. వికారాబాద్‌లో ప్రభుత్వ మెడికల్‌ కళాశాల, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, గ్రామీణ విశ్వవిద్యాలయం, ప్రభుత్వ స్టడీ సర్కిల్‌, ఐటీ పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, వెజిటబుల్‌ జోన్‌, ఎడ్యుకేషన్‌ హబ్‌గా జిల్లాను అభివృద్ధి చేయాలన్న డిమాండ్లు ఉన్న విషయం తెలిసిందే. జిల్లాలో క్రీడల పట్ల ఆసక్తి, నైపుణ్యం కలిగిన ఎంతో మంది విద్యార్థులు, యువకులు ఉన్నా వారికి ప్రోత్సాహం కరువైంది. పరిగిలో మినీ స్టేడియం ఉండగా, మిగతా మూడు నియోజకవర్గాల్లో ఆడుకునేందుకు వసతులు కలిగిన మైదానాలు లేకపోవడం శోచనీయం. జిల్లాలో ఘనాపూర్‌, ఆర్కతల, జిన్‌గుర్తిలో ఆహార శుద్ధి పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇంకా ప్రారంభ దశలోనే ఉంది.  ఈపరిశ్రమలు ఏర్పాటైతే స్థానిక నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయి.

ప్రగతిలో ముందుకు..

ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వికారాబాద్‌ జిల్లా తనదైన శైలిలో ముందుకు సాగుతోంది. పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో గ్రామీణ ప్రాంతాలు,పట్టణాల్లో క్రమేణ మార్పు వస్తోంది. ఇంటింటికీ తాగునీరు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన మిషన్‌ భగీరథ పనులు పూర్తి చేసుకుని 2,03,688 కొళాయిల ద్వారా ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. మిషన్‌ కాకతీయ పథకం ద్వారా జిల్లాలో నాలుగు విడతల్లో రూ.234.78 కోట్లతో 733చెరువులకు మరమ్మతులు చేపట్టారు. ఈ ఏడాది కురిసిన వర్షాలకు జిల్లాలోని ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు నిండి అలుగెత్తి ప్రవహిస్తున్నాయి. మార్కెటింగ్‌ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గోదాముల నిర్మాణం పనులు చాలా వరకు పూర్తయ్యాయి. టీయూఎఫ్‌ఐడీసీ కింద తాండూరులో రూ.25 కోట్లు, వికారాబాద్‌లో రూ.20 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేపట్టారు. కొత్తగా ఏర్పాటైన పరిగి, కొడంగల్‌ మునిసిపాలిటీలకు కూడా ఈ నిధులు మంజూరయ్యాయి. గురుకుల పాఠశాలలకు స్వంత భవనాల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ప్రతిఏటా ఉపాధి హామీ పథకం పనుల్లో వికారాబాద్‌ జిల్లా వివిధ అంశాల్లో ముందుంటూ తన సత్తా చాటుతోంది. జిల్లా కలెక్టరేట్‌ ఇంకా అద్దె భవనంలోనే కొనసాగుతోంది.  ఇదిలా ఉంటే, ఈ విద్యా సంవత్సరంలో జిల్లాలో వికారాబాద్‌, పరిగిలో కొత్తగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ప్రారంభించడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కార్యాలయాలన్నీ ఒకేచోట ఉండేలా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయం నిర్మాణం పనులు పూర్తయ్యాయి. ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది. జోగులాంబ జోన్‌లో ఉన్న వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలపడం జిల్లా ఉద్యోగులకు, నిరుద్యోగ యువతకు కొంత ఊరటనిచ్చింది. 

Updated Date - 2021-10-11T05:22:56+05:30 IST