దళితబంధుకు వేళాయే...

ABN , First Publish Date - 2021-08-16T05:54:25+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక..

దళితబంధుకు వేళాయే...
హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇంద్రానగర్‌లో సీఎం సభకు ముస్తాబైన వేదిక

నేడు లాంఛనంగా ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

స్వాగతానికి ముస్తాబైన హుజూరాబాద్‌

అడుగడుగునా పోలీసుల నిఘా

బందోబస్తులో పలువురు ఉన్నతాధికారులు

జిల్లావ్యాప్తంగా విపక్ష నేతలను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌): ముఖ్యమంత్రి కేసీఆర్‌ మానస పుత్రిక దళితబంధు పథకాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు ఆయన సోమవారం హుజూరాబాద్‌కు రానున్నారు. ఈ సందర్భంగా హుజూరాబాద్‌ అందంగా ముస్తాబయింది. రైతుబంధు పథకానికి వేదిక అయిన శాలపల్లి, ఇందిరానగర్‌ గ్రామాలే దళితబంధుకు కూడా వేదికయ్యాయి. ఈ గ్రామాల మధ్య లక్ష మంది కూర్చునేవిధంగా భారీ ఏర్పాట్లను చేశారు. టీఆర్‌ఎస్‌ 20 ఏళ్ల ఆవిర్భావ వేడుకలను హుజూరాబాద్‌లోనే 10 లక్షల మందితో నిర్వహించాలని తలపెట్టినా కరోనా వ్యాధి విస్తరిస్తున్న నేపథ్యంలో ఆ ప్రతిపాదనను రద్దు చేసుకున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ రాకముందే దళితబంధు పథకాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించిన ప్రభుత్వం కొవిడ్‌ కారణంగా లక్ష మందికి మాత్రమే ఈ బహిరంగ సభను పరిమితం చేసింది. సమావేశానికి హాజరయ్యేవారంతా కూర్చునేవిధంగా షామియానాలతో వేదికను ముస్తాబు చేశారు. 


పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక

తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇప్పటి వరకు కేసీఆర్‌కు సెంటిమెంట్‌గా ఉంటున్న కరీంనగర్‌ జిల్లాలోనే ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించడంతోపాటు సంతృప్తస్థాయిలో ఈ పథకాన్ని మొట్ట మొదటగా అమలు చేసేందుకు హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంచుకున్నారు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ బహిరంగ సభాస్థలికి చేరుకొని లాంఛనంగా పథకాన్ని ప్రారంభించి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారని సమాచారం. సీఎం కేసీఆర్‌తోపాటు ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు, బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌, పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, తదితర మంత్రులు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొననున్నారు. 


హుజూరాబాద్‌ నియోజకవర్గంలో 20,929 దళిత కుటుంబాలు

హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలోని 20,929 దళిత కుటుంబాలకు ఈ పథకం కింద పదేసి లక్షల రూపాయల చొప్పున లబ్ది చేకూర్చాలని నిర్ణయించారు. తొలివిడతగా ప్రభుత్వం ఐదు వేల మందికి ఆర్థిక సహాయం అందించేందుకు వీలుగా 500 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హుజూరాబాద్‌ మండంలోనిని 5,323 కుటుంబాలకు, జమ్మికుంటలోని 4,996, వీణవంకలోని 3,678, ఇల్లందకుంటలోని 2,586, కమలాపూర్‌ మండలంలోని 4,346 కుటుంబాలకు ఈ పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తారు. నిరుపేద దళిత కుటుంబాలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి ప్రాధాన్యక్రమంలో అన్ని కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. లబ్ధిదారులను ఎంపిక చేయడం కోసం గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తారు. 15 మంది కో-ఆర్డినేటర్లను నియమించారు. అన్ని స్థాయిల స్థానిక ప్రజాప్రతినిధులు, సమన్వయకర్తలు, అధికారులు, గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించి సమగ్ర కుటుంబ సర్వే రిపోర్టులను పరిగణలోకి తీసుకొని లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపడతారు. ఎంపికైన వాని వివరాలను గ్రామ పంచాయతీ నోటీస్‌ బోర్డులో ఉంచుతారు. లబ్ధిదారులు తమకు నైపుణ్యం, ఆసక్తి, అనుభవం ఉన్న వృత్తులను ఎంచుకొనేందుకు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలున్న  50 నుంచి 60 రకాల యూనిట్ల వివరాలను అందుబాటులో ఉంచారు. ఆసక్తి ఉన్నవారికి వారు చేపట్టదలచిన వృత్తి యూనిట్ల విషయంలో శిక్షణ ఇచ్చి ఏడాదిపాటు అధికారగణం నిత్యం పర్యవేక్షిస్తుంటారు.


ముఖ్యమంత్రి చేతులమీదుగా 16న లాంఛనంగా 15 మందికి యూనిట్ల మంజూరు పత్రాలను, ఆర్థిక సహాయం చెక్కులను అందజేస్తారు. ఆ తర్వాత గ్రామ సభల్లో లబ్ధిదారులను ఎంపిక చేసి సహాయం అందిస్తారు. బ్యాంకుల లింకేజీ లేకుండా పూర్తిగా ప్రభుత్వమే ఈ సహాయాన్ని అందించనున్నది. ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్‌, కొప్పుల ఈశ్వర్‌, చీఫ్‌ సెక్రెటరీ సోమేశ్‌కుమార్‌, ప్రిన్సిపల్‌ సెక్రటరీ రాహుల్‌బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ బండ శ్రీనివాస్‌, జిల్లా అధికారులు, సమన్వయకర్తలతో చర్చించి చేపట్టాల్సిన చర్యల విషయంలో ఒక అవగాహనకు వచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నతస్థాయిలో ఈ పథకం అమలు గురించి మూడు, నాలుగు సమావేశాలు నిర్వహించారు. ఆయన సోమవారం జరిగే బహిరంగ సభలో దళిత యువతీ, యువకులకు ఈ పథకం విషయంలో మార్గదర్శనం చేస్తారని భావిస్తున్నారు. 


విమర్శలు, అపోహలు...

దళితబంధు పథకం ఉప ఎన్నిక నేపథ్యంలో పుట్టుక వచ్చిందేనని, ఎన్నికల్లో లబ్ది పొందిన తర్వాతే దీనిని పక్కనపెడతారని విపక్షాలు విమర్శిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న మొత్తం దళిత కుటుంబాలకు దీనిని వర్తింపజేయడానికి డబ్బు లేదని, ఇది ఎన్నికల పథకమేనని వారు పేర్కొంటున్నారు. దళితులకు ఇంత వరకు ఇచ్చిన హామీల మాదిరిగానే దీనిని కూడా విస్మరించే ప్రమాదం లేకపోలేదని వివిధ దళిత సంఘాలు  పేర్కొంటూ హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నోటిఫికేషన్‌కు ముందే రాష్ట్రవ్యాప్తంగా దీనిని అమలు చేయాలని నిరాహార దీక్షలు చేపట్టాయి. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకే ప్రాధాన్యమిస్తూ తొలి విడతలో ఆర్థిక సహాయం అందించేందుకు ఎంపిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని హుజూరాబాద్‌ నియోజకవర్గంలో పలుచోట్ల దళితులు ఆందోళనలు చేపట్టారు. ఈ విషయాలన్నింటిపై ముఖ్యమంత్రి సోమవారం జరగనున్న బహిరంగ సభలో స్పష్ట ఇస్తారని టీఆర్‌ఎస్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. విపక్షాలు ఓటమి భయంతోనే ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నాయి తప్ప అందులో ఏ మాత్రం నిజం లేదని టీఆర్‌ఎస్‌కు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే ఖండించారు. కేసీఆర్‌ తన ప్రసంగంలో పేర్కొనే అంశాలతో ఈ విషయంలో మరింత స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 


ముందస్తు అరెస్టులు...

ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాక సందర్భంగా జిల్లావ్యాప్తంగా ఆదివారం సాయంత్రం 6 గంటల వరకే వివిధ రాజకీయ పక్షాలకు చెందిన 32 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లా కేంద్రంతోపాటు హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో బీజేపీ, కాంగ్రెస్‌, సీపీఐ నాయకులను, ఇతర ప్రజా సంఘాల నాయకులను ముందస్తుగా అరెస్టులు చేస్తున్నట్లు సమాచారం. రాత్రి మరింతమందిని అదుపులోకి తీసుకుంటారని సమాచారం. వీణవంక, ఇల్లందకుంట మండలాల్లో బీజేపీ నాయకులను, కార్యకర్తలను పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కసిరెడ్డి మణికంఠరెడ్డిని కరీంనగర్‌ వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకోగా హుజూరాబాద్‌ మండలం రంగాపూర్‌ సర్పంచ్‌, బీజేపీ నాయకుడు బింగి కరుణాకర్‌ను కూడా ఆ మండల పోలీసులు తీసుకువెళ్లారని సమాచారం. 


సభకు భారీ బందోబస్తు...

హుజూరాబాద్‌: హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే ఉప ఎన్నిక వేడి రాజుకున్నది. బీజేపీ, టీఆర్‌ఎస్‌ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో సీఎం పాల్గొనే సభకు బీజేపీ, కాంగ్రెస్‌, తదితర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ఉన్న దళితవర్గాల నుంచి ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలున్నాయని భావించిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. సీపీ సత్యనారాయణ పర్యవేక్షణలో నలుగురు డీసీపీలు, ఆరుగురు అడిషనల్‌ డీసీపీలు, 30 మంది ఏసీపీలు బందోబస్తు పర్యవేక్షించనున్నారు. 66 మంది సీఐలు, 200 మంది ఎస్‌ఐలు, 2500 మంది కానిస్టేబుల్‌, కిందిస్థాయి సిబ్బందిని కూడా బందోబస్తుకు తరలించారు. హుజూరాబాద్‌ నుంచి జమ్మికుంటకు వెళ్లే మార్గంలో ట్రాఫిక్‌ను మళ్లించారు. ఏ చిన్న అవాంఛనీయ సంఘటన కూడా జరగకుండా చూసేందుకు పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేసింది. 


పకడ్బందీ ఏర్పాట్లు

హుజూరాబాద్‌ మండలం శాలపల్లి-ఇంద్రానగర్‌లో సోమవారం జరిగే సీఎం సభకు సర్వం సిద్ధం చేశారు. వర్షం వచ్చినా ఇబ్బందులు కలుగకుండా రెయిన్‌ ఫ్రూవ్‌ టెంట్లు వేశారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు సీఎం సభ జరుగనుంది. హుజూరాబాద్‌ నియోజకవర్గంతో పాటు వివిధ జిల్లాల నుంచి 825 ఆర్టీసీ బస్సుల్లో దళిత కుటుంబాలను తరలించనున్నారు. ప్రతి బస్సుకు ఒక అధికారిని నియమించారు. దళితబంధు పథకం ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైద్రాబాద్‌ నుంచి నేరుగా సభ స్థలానికి చేరుకుంటారు. అందుకోసం సభ స్థలి వద్ద హెలీప్యాడ్‌ను ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-08-16T05:54:25+05:30 IST