వచ్చేదెప్పుడో.. ఇచ్చేదెప్పుడో!

ABN , First Publish Date - 2022-06-30T05:12:11+05:30 IST

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయినా ఇంకా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందలేదు.

వచ్చేదెప్పుడో.. ఇచ్చేదెప్పుడో!


  • పాఠ్య పుస్తకాలు, యూనిఫాం కోసం విద్యార్థుల ఎదురుచూపులు
  • పాఠశాలలు ప్రారంభమై రెండు వారాలు  
  • యూనిఫాం జూలై నెలలో కూడా అందేది అనుమానమే
  • ఇంకా పాఠశాలలకు చేరని పాఠ్య పుస్తకాలు

కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు వారాలు గడిచిపోయినా ఇంకా విద్యార్థులకు  పాఠ్య పుస్తకాలు, యూనిఫాంలు అందలేదు. పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాల్సి ఉండగా, ఇంత వరకు వాటిని పంపిణీ చేయలేదు.  వాటి కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.

వికారాబాద్‌, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ప్రతిఏటా విద్యా సంవత్సరంలో ఒక్కో విద్యార్థికి రెండు యూనిఫాం దుస్తులు అందజేస్తున్న విషయం తెలిసిందే. యూనిఫాం దుస్తుల కోసం ప్రభుత్వం నుంచి అవసరమైన క్లాత్‌ (బట్ట) సరఫరా చేస్తే, స్థానికంగా కుట్టించి పాఠశాలలకు అందజేసేవారు. ఈ ఏడాది తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కోఆపరేటివ్‌ సొసైటీ ద్వారా జిల్లాకు యూనిఫాం క్లాత్‌ పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. యూనిఫాం దుస్తులను కుట్టే బాధ్యతను జిల్లాలోని మహిళా సంఘాలకు, వృత్తిదారులకు అప్పగించాలని, 70 శాతం మహిళా సంఘాలకు, 30 శాతం వృత్తిదారులకు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియంలో విద్యా బోధన చేస్తున్నారు. బడి బాట కార్యక్రమంలో ఉపాధ్యాయులు బడీడు పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే వారికి విద్యా బోధనతో పాటు పాఠ్య పుస్తకాలు, రెండు జతల యూనిఫాం దుస్తులు ఉచితంగానే ఇస్తారంటూ ప్రచారం చేశారు. పాఠశాలలు ప్రారంభమైనా ఇంకా పంపిణీ చేయకపోవడంతో పేద, మధ్య తరగతి విద్యార్థులు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం దుస్తుల కోసం ఎదురు చూస్తున్నారు. 

క్లాత్‌ వచ్చేదెప్పుడో.. దుస్తులు కుట్టించేదెప్పుడో...?

 యూనిఫాం కుట్టించేందుకు జిల్లాకు ఇంకా క్లాత్‌(బట్ట) పంపించలేదు. క్లాత్‌ వచ్చిన తరువాత కొలతలు తీసుకుని కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఎంత కాలం పడుతుందోనన్న ఆందోళన తల్లిదండ్రుల్లో వ్యక్తమవుతోంది. గతంలో ప్రభుత్వ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, గురుకుల పాఠశాలలు, విద్యాలయాలకు వేర్వేరుగా యూనిఫాం దుస్తులు పంపిణీ చేసేవారు. కాగా, ప్రభుత్వ పాఠశాలలు, విద్యాలయాల్లో చదివే విద్యార్థులందరికీ ఈ విద్యా సంవత్సరం నుంచి ఒకే రకమైన యూనిఫాం దుస్తులు పంపిణీ చేయాలని విద్యా శాఖ నిర్ణయించింది. కొత్తగా చేరిన విద్యార్థులు సాధారణ దుస్తులు ధరించి పాఠశాలలకు వస్తుండగా, ఇది వరకే పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల్లో కొందరు తాము ఇంతకు ముందు తీసుకున్న దుస్తులను ధరించి వస్తున్నారు. జిల్లాలో అన్ని యాజమాన్యాలకు సంబంధించి  1,07,788 మంది విద్యార్థులు ఉండగా, వారిలో ఒక్కో విద్యార్థికి ఒక జత దుస్తులు అందజేయనున్నారు. దుస్తులు కుట్టించి ఇచ్చేందుకు మొత్తం 5,71,924 మీటర్ల క్లాత్‌ అవసరమవుతుందని అంచనా వేశారు. మొదటి విడతలో భాగంగా వచ్చేనెల 6వ తేదీన జిల్లాకు 2,85,962 మీటర్ల క్లాత్‌ సరఫరా చేస్తామని, అదే నెల 21వ తేదీన రెండో విడత కింద మరో 2,85,962 మీటర్ల క్లాత్‌ అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర హ్యాండ్‌లూమ్‌ వీవర్స్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ తెలియజేసింది. జిల్లాకు వచ్చిన క్లాత్‌ను మహిళా సంఘాలకు కేటాయించి వారితో కుట్టించి విద్యార్థులకు పంపిణీ చేసేందుకు ఎంత లేదన్నా రెండు నెలల సమయం పట్టే అవకాశం ఉంది. 

పాఠ్య పుస్తకాలు లేకుండా చదువులు సాగేదెలా...?

పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పాఠ్య పుస్తకాలు సిద్ధంగా ఉంచుతామని ప్రభుత్వం ప్రకటించినా ఇంత వరకు విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ జరగలేదు. జిల్లాలో మొత్తం పాఠశాలలు 1107 పాఠ శాలలు ఉండగా, వాటిలో 764 ప్రాథమిక, 116 ప్రాథమికొన్నత, 174 ఉన్నత పాఠశాలలు, 9 మోడల్‌, 18 కేజీబీవీ, 26 గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో చదువుతున్న 1,07,788 మంది విద్యార్థులకు 6,40,170 పాఠ్య పుస్తకాలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఈ పాఠ్య పుస్తకాల్లో ఇప్పటి వరకు జిల్లాకు 2,70,000 పుస్తకాలు వచ్చాయి. 160 టైటిళ్ల పుస్తకాలు రావాల్సి ఉండగా, వాటిలో సగం వరకు టైటిళ్లు సరఫరా కాలేవు. ఇంత వరకు సరఫరా చేసిన వాటిలో ఉన్నత తరగతుల పుస్తకాలు ఉండగా, ప్రాథమిక, ప్రాథమికొన్నత తరగతులకు సంబంధించిన పుస్తకాలు ఇంకా సరఫరా కావాల్సి ఉంది. జిల్లాకు రావాల్సిన పుస్తకాల్లో ఇంకా సగం పుస్తకాలు కూడా సరఫరా చేయలేదు. 75 శాతం పుస్తకాలు వచ్చిన తరువాత పాఠ్య పుస్తకాలను మండలాలకు సరఫరా చేయనున్నట్లు తెలిసింది. ఒక్కో మండలానికి రెండు పర్యాయాలు పాఠ్య పుస్తకాలు సరఫరా చేస్తే రవాణా ఛార్జీలు తడిసి మోపెడు కానున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేసే వరకు విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగానే కొనసాగనున్నాయి. పాఠశాలలకు పాఠ్య పుస్తకాలను త్వరితగతిన చేరవేసే విధంగా విద్యా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 

యూనిఫాంల వివరాలు

విద్యార్థుల సంఖ్య 1,07,788

కావాల్సిన దుస్తుల క్లాత్‌ 5,71,924 మీటర్లు

మొదటి విడత క్లాత్‌ 2,85,962 మీటర్లు 

సరఫరా చేసే తేదీ జూలై 6 

రెండో విడత క్లాత్‌ 2,85,962 మీటర్లు 

సరఫరా చేసే తేదీ జూలై 21

పాఠ్య పుస్తకాలుజిల్లాకు సరఫరా చేయాల్సినవి 6,40,170

ఇంత వరకు వచ్చినవి         2,70,000

ఇంకా రావాల్సినవి         3,70,170

Updated Date - 2022-06-30T05:12:11+05:30 IST