అది 1975, జూన్ 25... అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సిఫార్సుపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఈ అత్యవసర పరిస్థితి తదుపరి 21 నెలల పాటు కొనసాగింది. ఈ సమయంలో బీజేపీకి చెందిన అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీతో సహా చాలా మంది విపక్ష నేతలు జైలుకు వెళ్ళవలసి వచ్చింది. ఎమర్జెన్సీ సమయంలో విపక్ష నేతలపైనే అధికంగా దాడులు జరిగాయి. వీరిలో ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఉన్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు మోదీ తన వేషాన్ని మార్చుకున్నారు.
తలపాగా ధరించి, గడ్డం పెంచి సిక్కుగా మారారు. ఈ సర్దార్ వేషధారణలోనే ప్రధాని నరేంద్రమోదీ పోలీసులకు చిక్కారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నేతలను రెండేళ్లపాటు జైల్లో పెట్టి, పత్రికా స్వేచ్ఛకు ‘తాళం’ వేసి, సామాన్య ప్రజలకు సైతం ఇబ్బందులు కలిగించారనే ఆరోపణలున్నాయి. నాటి ఉద్యమంలో ఆర్ఎస్ఎస్ క్రియాశీల పాత్ర పోషించింది. ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌గా ఉన్న నరేంద్ర మోదీకి ఆందోళనలు, సదస్సులు, సమావేశాలు, సాహిత్యం పంపిణీకి సంబంధించిన ఏర్పాట్ల బాధ్యతను అప్పగించారు. ఆ సమయంలో ప్రధాని మోదీతో కలిసి పనిచేస్తున్న ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేత కేశవరావు దేశ్‌ముఖ్‌ను గుజరాత్‌లో అరెస్టు చేశారు. అదే సమయంలో ప్రధాని మోదీ తనను కూడా అరెస్టు చేస్తారని పసిగట్టి సర్దార్ అవతారం ఎత్తారు.