మక్కల కొనుగోళ్లు ఇంకెప్పుడో?

ABN , First Publish Date - 2020-12-02T05:23:33+05:30 IST

మక్కలను కొనుగోలు చేయకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

మక్కల కొనుగోళ్లు ఇంకెప్పుడో?
ఘనపూర్‌ గ్రామంలో కొనుగోలు కేంద్రం వద్ద మొక్కజొన్న కుప్పలు

 ఘనపూర్‌, వర్ధరాజ్‌పల్లి గ్రామాల్లో పేరుకు పోయిన మక్కల కుప్పలు

 ఆందోళనలో అన్నదాతలు

 ఎమ్మెల్యే ఆదేశాలు పట్టించుకోని అధికారులు


తొగుట, డిసెంబరు 1: మక్కలను కొనుగోలు చేయకపోడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట కోసి నెలలు గడుస్తున్నా తొగుట మండలంలో ప్రభుత్వం ఒకే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం పలు విమర్శలకు తావిస్తోంది. మండల పరిధిలోని గోవర్ధనగిరి, గుడికందుల, వర్ధరాజ్‌పల్లి, ఘనపూర్‌ గ్రామాల్లోనే సుమారు 1,390 ఎకరాల్లో రైతులు మొక్కజొన్న పంటను సాగుచేశారు. కోసిన పంటను అమ్మడం కోసం రోడ్లమీద పోసి రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. మొక్కజొన్న పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆందోళన చేయడంతో ప్రభుత్వం మద్దతు ధర రూ.1,850 ప్రకటించింది. తొగుట మండలంలో కేవలం గుడికందుల గ్రామంలోనే మాత్రమే వారం రోజుల క్రితం ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని అధికారులు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇప్పటి వరకు 95 మంది రైతుల నుంచి 2,621 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు. మండలంలో సుమారు 28 వేల క్వింటాళ్ల దిగుబడి వస్తుందని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. రైతు నుంచి కేవలం 20 క్వింటాళ్ల మక్కలను మాత్రమే కొనుగోలు చేస్తామని అధికారులు చెప్పడంతో చాలా మంది రైతులు దళారులను ఆశ్రయించి క్వింటాలుకు రూ.1,400 చొప్పున విక్రయిస్తూ నష్టపోతున్నారు. ఈ విషయాన్ని ఇటీవల నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే రఘునందన్‌రావు దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే మరిన్ని కొనుగోలు కేంద్రాలను ప్రారంభించడంతో పాటు మక్కలను పూర్తిగా కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలు జారీ చేసి వారం రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు అధికారులు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు.



మాకు ఎలాంటి ఆదేశాలు అందలేదు: సొసైటీ సెక్రటరీ గంగారెడ్డి 


ఘనపూర్‌, వర్ధరాజ్‌పల్లి, గోవర్ధనగిరి గ్రామాల్లో రైతులు మొక్కజొన్న పంటను ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసింది వాస్తవమేనని కానుగల్‌ కో ఆపరేటివ్‌ సొసైటీ సెక్రటరీ గంగారెడ్డి తెలిపారు. తమకు ఆయా గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పారు. గుడికందుల గ్రామంలో మాత్రమే కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు తాము పనిచేస్తామన్నారు. 


Updated Date - 2020-12-02T05:23:33+05:30 IST