జొన్న కొనుగోళ్లు ఇంకెప్పుడు?

ABN , First Publish Date - 2022-05-09T05:30:00+05:30 IST

జిల్లాలో జొన్న పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ యేడు వేసవిలో జిల్లా రైతులు ఆరుతడి పంటలనే ఎక్కువగా సాగు చేశారు. ప్రభుత్వం వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేయాలని చెప్పడంతో రైతులు కూడా ప్రభుత్వ ఆదేశాలనే పాటించారు. ప్రధానంగా జొన్న,

జొన్న కొనుగోళ్లు ఇంకెప్పుడు?
రైతులు ఇంటి వద్దే నిల్వ చేసుకున్న జొన్న పంట

జిల్లాలో పంట చేతికొచ్చినా.. తప్పని ఎదురుచూపులు

అత్యవసరాల పేరిట దళారులకు అమ్మేసుకుంటున్న రైతులు

అన్నదాతలను వెంటాడుతున్న అకాల వర్షాల గుబులు

మద్దతుధరపై గల్లంతవుతున్న ఆశలు

కలెక్టర్‌కు వినతి.. ఆందోళనలో అన్నదాతలు

జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో మొత్తం 31వేల 396 ఎకరాల్లో జొన్న సాగు

4.70 లక్షల క్వింటాళ్లకు పైగానే దిగుబడులు వచ్చే అవకాశం

ఆదిలాబాద్‌, మే 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో జొన్న పంట చేతికొచ్చి పక్షం రోజులు గడుస్తున్నా.. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించక పోవడంతో అన్నదాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఈ యేడు వేసవిలో జిల్లా రైతులు ఆరుతడి పంటలనే ఎక్కువగా సాగు చేశారు. ప్రభుత్వం వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలనే సాగు చేయాలని చెప్పడంతో రైతులు కూడా ప్రభుత్వ ఆదేశాలనే పాటించారు. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, శనగ, తదితర పంటలు సాగయ్యాయి. ఇప్పటికే మొక్కజొన్న, శనగ పంటలను పూర్తి చేసిన రైతులు జొన్న పంట చేతికి రావడంతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. రోజుల తరబడి ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురు చూడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ సీజన్‌లో 31 వేల 396 ఎకరాలలో జొన్న పంట సాగైంది. ఈ సారి వాతావరణ పరిస్థితులు అనుకూలించడం, సరిపడా నీటితడులు అందడంతో దిగు బడులు ఆశా జనకంగానే కనిపిస్తున్నాయి. దీంతో ఎకరాన 12 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. ఈ లెక్కన జిల్లాలో 4లక్షల 70వేల 495క్వింటాళ్లకు పైగానే దిగుబడులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ ప్రతీసారి కొనుగోళ్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో సగం పంట దళారుల పాలవు తూనే ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా అదే పరిస్థితి ఎదురవుతోందని చెబుతున్నారు. ఆలస్యంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినా.. ఆశించిన ప్రయోజనం ఉండదంటున్నారు. శనగ పంట కొనుగోళ్లను కూడా అర్ధాంతరంగానే నిలిపివేయడంతో అన్నదాతలు గత్యంతరం లేక దళారులకే అమ్ముకోవాల్సి వచ్చింది. అన్నదాతల అవసరాలు, అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని దళారులు అందినకాడికి దండుకోవడంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. సోమవారం జిల్లాలో జొన్న పంట కొనుగోళ్లను ప్రారంభించాలని రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో పలువురు రైతులు కలెక్టర్‌ను కలిసి వినతిపత్రాన్ని అందజేశారు.

ఫ ముందుచూపు ఏదీ?

పంటల సాగుపై వ్యవసాయ శాఖ అంచనాలు వేస్తూ ప్రభుత్వానికి పంట విస్తీర్ణం, దిగుబడుల అంచనాపై నివేదికలు అందిస్తున్నా.. ప్రభుత్వానికి మాత్రం ముందుచూపు లేకుండా పోయింది. దీంతో ప్రభుత్వ ఆదేశాలు లేవంటూ జిల్లా మార్కెటింగ్‌ అధికారులు చేతులెత్తేస్తున్నారు. ఇలా ప్రతీసారి పంట కొనుగోళ్లలో జాప్యం జరుగుతూనే ఉంది. అప్పు చేసి పంట కోతలు, నూర్పిడి చేసిన రైతులు పెట్టుబడి వ్యయం పేరిట ఆదరబాదరగా అమ్మేసుకుంటున్నారు. ప్రభుత్వమే ముందుచూపుతో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఉంటే రైతులకు నష్టం జరిగే అవకాశం ఉండదంటున్నారు. కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయక పోతే ప్రభుత్వం మద్దతుధరను ప్రకటించినా ఎలాంటి ప్రయోజనం ఉండ దంటున్నారు. మద్దతుధరను ప్రకటించి సకాలంలో కొనుగోలు ప్రక్రియను చేపడితేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. గతేడు కన్న ఈసారి మద్దతుధర మెరుగ్గానే ఉన్నా.. అధికారులు మాత్రం పంట కొనుగోళ్లను చేపట్టడం లేదు. క్వింటాలు మద్దతుధర హైబ్రిడ్‌ రకానికి రూ.2,737 కాగా మాల్దాండి రకానికి రూ.2,755గా నిర్ణయించారు. కాని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో క్వింటాలు జొన్నలు రూ.వెయ్యి నుంచి రూ.1200 వరకే అమ్మేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులకు అవకాశం ఇవ్వకుండా ముందుచూపుతో వ్యవహరిస్తే జిల్లా రైతులకు మద్దతుధర కలిసి వచ్చే అవకాశం ఉండేది. ప్రభుత్వ విధానాలు, అధికారుల నిండు నిర్లక్ష్యంతో ఆరుగాలం కష్టపడి పండించిన పంట ను దళారులకు అమ్ముకుంటూ అన్నదాతలు నష్టపోతున్నారు.

ఫ అకాల వర్షాలతో ఆందోళన

పంట దిగుబడులు చేతికి వచ్చి పక్షం రోజులు గడిచిపోతున్నా.. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ఎదురు చూస్తున్నారు. చేతికి వచ్చిన పంటను ఆరుబయటనే నిల్వ చేసుకుని అకాల వర్షాలతో ఆందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు అకాల వర్షాలు కురుస్తాయో? తెలియని పరిస్థితి ఉందని రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత రెండు, మూడు రోజులుగా జిల్లాలో ఆకాశం మేఘావృతమై ఉండడంతో పంట దిగుబడులను కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. పగలంతా పంటను ఆరబెట్టడం, సాయంత్రం కాగానే పాలిథిన్‌ కవర్లతో కప్పి ఉంచడం.. రైతులకు ఇదే ఓ పనిగా మారిపోతోంది. ఇప్పటికే గత రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షానికి బోథ్‌, ఉట్నూర్‌, ఇంద్రవెల్లి మండలాల్లో జొన్న పంట తడిసి పోయింది. దీంతో నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. నాణ్యత, తేమ పేరిట కొనుగోళ్లకు నిరాకరిస్తే తమ పరిస్థితి ఏమిటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఆరుగాలం కష్టపడి పంటను పండిస్తే అమ్ముకోవడానికి కూడా అదేస్థాయిలో కష్టపడాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా చెప్పుకుంటున్న నేతలు జొన్న కొనుగోళ్లపై నోరు మెదపకపోవడంతో బాధిత అన్నదాతలు మండిపడుతున్నారు. 

ఫ కొందరికే మద్దతుధర

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం కావడంతో రైతులు అత్యవసరం పేరిట అమ్మేసుకుంటున్నారు. దీంతో కొందరికే మద్దతుధర దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 30శాతం పంట దిగుబడులను పెట్టుబడి ఖర్చులు, అత్యవసరాల పేరిట అమ్ముకుంటున్నారు. రైతుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న దళారులు నాణ్యత లేదంటూ ఇష్టారాజ్యంగా కొనుగోలు చేస్తున్నారు. తీవ్రమైన ఎండలు, ఈదురు గాలుల బీభత్సం, అకాల వర్షాలతో ఆదరబాధరగా పంటను అమ్మేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోంది. క్వింటాలుకు రూ.1200 నుంచి రూ.1500 వరకు నష్టం వస్తుందని వాపోతున్నారు. రైతులు నష్టపోతున్న విషయం బహిరంగంగానే జరుగుతున్నా.. సంబంధిత అధికారు లు, పాలకులు మాత్రం పట్టించుకున్నట్లే కనిపించడం లేదు. గతేడు కూడా జొన్న పంటను కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు, నిరసనలు చేపట్టడంతోనే దిగొచ్చిన ప్రభుత్వం చివరి సమయంలో కొనుగోలు ప్రక్రియను చేపట్టడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలకు పంట దిగుబడులు తడిసిపోవడంతో మద్దతుధరలో కోతలు విధించారు. ఈసారి కూడా అలాంటి పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఎప్పుడు కొనుగోలు చేస్తారో? ఏమో?

: కాటిపెల్లి ప్రభావతి, రైతు, తలమడుగు మండలం

పంట దిగుబడి చేతికి వచ్చి 15 రోజులు గడిచిపోతోంది. అయినా అధికారులు ఎప్పుడు కొనుగోలు చేస్తారో? ఏమో? తెలియడం లేదు. నిత్యం పంటను ఆరబెట్టడం, కుప్పబోయడం ఓ పనిగా మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో ఎక్కడ వర్షం వచ్చిపడుతుందోనన్న భయం కలుగుతుంది. ఇంట్లో నిల్వ చేసుకునే అవకాశం లేక ఆరుబయటనే ఆరబెట్టాల్సి వస్తుంది. ముందే పంటను కొనుగోలు చేయమని ప్రకటిస్తే సాగు చేసే వారిమే కాదు. ఎందుకు ప్రభుత్వం ఇలా చేస్తుందో? అర్థం కావడం లేదు.

ఆదేశాలు అందగానే కొనుగోలు చేస్తాం

: శ్రీనివాస్‌, జిల్లా మార్కెటింగ్‌ అధికారి, ఆదిలాబాద్‌

ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందగానే జొన్న పంటను కొనుగోలు చేస్తాం. ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదు. ఈదురు గాలులు, అకాల వర్షాలతో రైతులకు కొంత ఇబ్బందికరంగానే ఉన్న దళారులను నమ్మి మోసపోవద్దు. ఇప్పటికే జిల్లాలో సాగైన పంట వివరాలు, దిగుబడుల అంచనాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాం. ఏదైనా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తాం.

Read more