భూ వివాదాల పరిష్కారం ఎప్పుడో?

ABN , First Publish Date - 2022-07-07T06:23:36+05:30 IST

జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నెలలు గడుస్తున్నా రెవెన్యూ చిక్కులు వీడడం లేదు. తమ భూముల సమస్యల పరిష్కారం కోసం నిత్యం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.

భూ వివాదాల పరిష్కారం ఎప్పుడో?

- జిల్లాలో వీడని భూ సమస్యల చిక్కుముడులు

- పరిష్కారం కాని రెవెన్యూ సమస్యలు

- పాస్‌బుక్‌ల కోసం రైతుల ఎదురుచూపు

- నిత్యం కార్యాలయాల చుట్టు ప్రదర్శనలు

- తొలగని ధరణి పాట్లు

- రిజిస్ట్రేషన్లకే పరిమితమైన ధరణి

- రెవెన్యూ సదస్సులతోనైనా పరిష్కారం అయ్యేనా?


కామారెడ్డి, జూలై 6(ఆంధ్రజ్యోతి):  జిల్లాలో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. నెలలు గడుస్తున్నా రెవెన్యూ చిక్కులు వీడడం లేదు. తమ భూముల సమస్యల పరిష్కారం కోసం నిత్యం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా, కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయితే ప్రభుత్వం పెండింగ్‌ సమస్యల పరిష్కారాన్ని నిలిపివేయడం ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి ప్రస్తుతానికి రిజిస్ట్రేషన్‌ సేవలకే పరిమితం కావడంతో రైతులకు నిరీక్షణ తప్పడం లేదు. ధరణి వెబ్‌సైట్‌ ఎప్పుడు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తుందోనని ఎదురుచూస్తున్నారు. మరోవైపు తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు చేపడుతుండడంతో రెవెన్యూలో అక్రమాలు మరింత పెరిగిపోతున్నాయని రైతులు మండిపడుతున్నారు. భూ సమస్యల కోసం రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ నిర్ణయంతోనైన భూ వివాదాలు పరిష్కారం అవుతాయో లేదో చూడాలి.

పరిష్కారం కాని భూ సమస్యలు

జిల్లాలోని చాలా మంది రైతులకు కొత్త పట్టాపాసు పుస్తకాలు అందలేదు. పట్టాభూమి టైటిల్‌ ఉన్న వారు ఇతర ప్రాంతాల్లో ఉండడం, మ్యూటేషన్‌లు కాకపోవడం, ఇతర భూ సమస్యలతో ఇరు జిల్లాలో వేలాది మంది రైతులకు కొత్త పట్టా పాసుపుస్తకాలు రావడం లేదు. ప్రస్తుతం ధరణి వెబ్‌సైట్‌ కేవలం రిజిస్ట్రేషన్‌లకే పరిమితమవుతోంది. పాత భూ సమస్యలు, మ్యూటేషన్‌లు, విరాసత్‌, నాలా కన్వర్షన్‌, పెండింగ్‌ పరిష్కారాలు తదితర అన్ని సేవలను పరిష్కరించేందుకు కలెక్టర్‌లకు బాధ్యతలు అప్పగించారు. భూ సమస్యలపై ఏవైనా ఫిర్యాదులు వస్తే వాటిని సరిచేసేందుకు కలెక్టర్‌లకే లాగిన్‌ ఉంది. అయితే కలెక్టర్‌లు వివిధ పనులలో పాలనపరంగా బిజీ కావడంతో ధరణిలోని భూ సమస్యలను పరిష్కారం చేయలేక పెండింగ్‌లోని ఉండిపోతున్నాయి. దీంతో భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ నిత్యం ప్రదక్షిణలు చేస్తున్నారు.

కొత్త పాసుబుక్‌లు అందక.. పథకాలకు దూరం అవుతూ

భూ సమస్యలు పరిష్కారంకాక రైతులకు కొత్త పాసుబుక్‌లు అందడం లేదు. దీంతో రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. కొత్త పాసుబుక్‌లు రాక ప్రభుత్వం రైతులకు అందిస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయం అందడం లేదు. దీంతో రైతులు తమ పెండింగ్‌ పనులు పరిష్కారం కాక ప్రభుత్వం, బ్యాంక్‌ల నుంచి సహాయం అందక ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రుణమాఫీపై ఆశతో జిల్లాలోని చాలా మంది రైతులు బ్యాంకులో రుణాలు చెల్లించడం లేదు. వారిలో కొంతమంది తమ భూమిని విక్రయించినప్పటికీ బ్యాంకుల్లో అప్పు చెల్లడం లేదు. దీంతో కొత్తగా భూమి కొనుగోలు చేసిన వారికి రుణాలు మంజూరు కావడం లేదు. అదేవిధంగా పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు సైతం కొత్త పట్టా పాసుబుక్‌లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఆన్‌లైన్‌లో నమోదయిన సర్వే నెంబర్లు, మంజూరైన పట్టా పాసుపుస్తకాలు ఉంటేనే రైతుల నుంచి ప్రభుత్వం పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తోంది. ఇందులో భాగంగానే జిల్లాలోని మొక్కజొన్న, పత్తి, వరి లాంటి పంట ఉత్పత్తులను కొందరు రైతుల భూములు ఆన్‌లైన్‌లో లేకపోవడంతో అమ్ముకోలేని పరిస్థితి ఎదురవుతోంది. తమ భూములను ఆన్‌లైన్‌లో ఎక్కించాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ధరణి అందుబాటులో లేదని రెవెన్యూ అధికారులు సమాధానం చెబుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రెవెన్యూలో ఇవి చిక్కుముడులు

వ్యవసాయేతర స్థలాలకు చెందిన పాత పట్టాదారులు పాసుబుక్‌లతో చేయడం లేదు. కొత్తగా ధరణి పోర్టల్‌లో పేరు నమోదుకు అవకాశం లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. పహాణి, ఆన్‌లైన్‌లో పేర్లు నమోదయినప్పటికీ నాలా పన్ను చెల్లించకుంటే రిజిస్ట్రేషన్‌లు కావడం లేదు. వ్యవసాయ, వ్యవసాయేతర భూములకు చెందిన భాగాలుగా చేసుకుని అమ్మకాలు చేసే వెసులుబాటు లేదు. గతంలో కొంత స్థలం అమ్ముకున్న వారు ప్రస్తుతం మిగిలిన స్థలం అమ్ముకోవడం సమస్యగా మారింది. ఇల్లు కట్టుకుని మున్సిపల్‌ లేదా గ్రామ పంచాయతీలకు చెందిన అనుమతులు లేని ఇళ్లకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. వీటికి సంబంధించిన రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు ఉంటే మళ్లీ రిజిస్ట్రేషన్‌ చేసే అవకాశం ఉంది. జీపీఏ రిజిస్ట్రేషన్‌ల విషయంలోనూ విడిగా భాగాలు చేసి స్థలం అమ్మితే రిజిస్ట్రేషన్‌లు జరగడం లేదు. స్థలాలకు సంబంఽధించిన భూముల రిజిస్ట్రేషన్‌లు వీలు కావడం లేదు. 

రిజిస్ట్రేషన్‌లకే పరిమితమైన ధరణి

రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ భూముల క్రయ, విక్రయాలు గతంలో మాదిరిగా రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల్లో కాకుండా గత ఏడాది నుంచి తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే ధరణి వెబ్‌సైట్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌లు చేపడుతోంది. అయితే తహసీల్దార్‌ కార్యాలయాల్లో అఽధికారులంతా రిజిస్ట్రేషన్‌లపైనే దృష్టి సారిస్తున్నారు. భూ సమస్యలు పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వేలు, కొత్త వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తె చ్చిన చిక్కుముడులు మాత్రం వీడడం లేదు. ఇక వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ బాధ్యత సైతం రెవెన్యూ అధికారులకే అప్పగించడంతో క్షేత్రస్థాయిలో ఉన్న భూ సమస్యలపై రెవెన్యూ అధికారులు దృష్టి సారించలేకపోతున్నారు. రిజిస్ట్రేషన్‌కై ధరణి వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చినప్పటికీ అది కూడా రిజిస్ట్రేషన్‌లకే పరిమితమైంది. గత సంవత్సరం కిందట భూముల వివరాలన్నీ ధరణిలో పొందుపరిచినప్పటికీ ఆ వెబ్‌సైట్‌ ప్రస్తుతం ఓపెన్‌ కాకపోవడంతో పట్టాపాసు పుస్తకాల కోసం, వివాదాలు ఉన్న భూముల సమస్యలు కొలిక్కి రావడం లేదు.

Updated Date - 2022-07-07T06:23:36+05:30 IST