భర్తీ చేస్తారా..? లేదా..?

ABN , First Publish Date - 2021-11-01T14:04:58+05:30 IST

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న..

భర్తీ చేస్తారా..? లేదా..?

టీచర్‌ పోస్టుల భర్తీ ఎప్పుడు?

రాష్ట్రవ్యాప్తంగా 24వేల ఖాళీలు.. 5 లక్షల మందికి పైగా అభ్యర్థులు

నాలుగేళ్లుగా ఎదురుచూపులే

టెట్‌నూ నిర్వహించని ప్రభుత్వం

ప్రైవేట్‌లో బోధించడానికీ వీల్లేదు

హేతుబద్ధీకరణ తర్వాతే స్పష్టత


హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టులను భర్తీ చేస్తారా? లేదా? అన్న అంశంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం రాష్ట్రంలో సుమారు 5 లక్షల మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. నాలుగేళ్లుగా పోస్టుల భర్తీ చేపట్టకపోవడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి 6 నెలలకు ఒక సారి టెట్‌, ప్రతి రెండేళ్లకు ఒక సారి డీఎస్సీ నోటిఫికేషన్లు ఇచ్చేవారు. అయితే, తెలంగాణ వచ్చాక టెట్‌, టీఆర్టీ నోటిఫికేషన్ల విషయంలో ప్రభుత్వ వైఖరి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ప్రస్తుతం 24 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా... వాటి భర్తీకి పూనుకోవడం లేదు. తాజాగా నిర్వహిస్తున్న రేషనలైజేషన్‌ ప్రక్రియతో పోస్టుల భర్తీ మరింత క్లిష్టంగా మారింది. రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. సుమారు 50 వేల పోస్టులను ఇప్పటికే గుర్తించారు.


అయితే... ఇందులో టీచర్‌ పోస్టులను పరిశీలనలోకి తీసుకోవడం లేదు. దీంతో టీచర్‌ పోస్టుల భర్తీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత అభ్యర్థుల ఆందోళనలు, సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ఎట్టకేలకు 2017లో టీచర్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్‌ జారీ చేశారు. అప్పటి వరకు ఉన్న డీఎస్సీ పేరును టీఆర్టీగా మార్చి, 2017 అక్టోబరు 21న నోటిఫికేషన్‌ విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ ద్వారా ఈ నియామకాలు చేపట్టారు. అప్పట్లోనే మొత్తం 25 వేల పోస్టులు ఖాళీగా ఉంటే.. 13,500 పోస్టులకే ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలుత 8,792పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారు. ఆ తర్వాత విడతలా వారీగా మరికొన్ని పోస్టులు భర్తీ చేయగా.. ఇంకా సుమారు 1000 వరకు భర్తీ చేయలేదు. కోర్టు కేసులు, ఇతర కారణాలతో వీటి భర్తీ ఆలస్యమవుతోంది. రాష్ట్రంలో ఏటా 12,500 మంది డీఎడ్‌, మరో 15,000 మంది బీఎడ్‌ కోర్సు పూర్తి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1.75 లక్షల మంది డీఎడ్‌ అభ్యర్థులు, 3లక్షల మందికి పైగా బీఎడ్‌ అభ్యర్థులు ఉన్నట్టు అంచనా. వీరిలో టెట్‌ ఉత్తీర్ణత సాధించిన వారు పేపర్‌-1లో 65వేల మంది, పేపర్‌-2లో 1.5లక్షల మంది ఉన్నారు.


పోస్టులు 24వేలకు పైగానే..

రాష్ట్రంలో టీచర్‌ పోస్టుల ఖాళీలు 24 వేలకు పైగానే ఉన్నాయన్న అంచనాలు ఉన్నాయి. 12,943 టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి సమాచారం అందజేసింది. ప్రాథమిక విద్యలో 10,657 పోస్టులు, ఉన్నత విద్యలో 2,286 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. విద్యాశాఖ పరిధిలో మొత్తం 1,38,517 టీచర్‌ పోస్టులు శాంక్షన్‌ అయి ఉండగా.. 1,25,574 పోస్టులు భర్తీ అయి ఉన్నాయని, మిగతా 12,943 పోస్టులే ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. అయితే, 12వేల మంది విద్యా వలంటీర్ల పోస్టులను ప్రభుత్వం ఖాళీగా చూపించలేదు. ప్రస్తుతం విద్యావలంటీర్లు లేనందున మొత్తం ఖాళీలు 24 వేలకుపైగానే ఉన్నట్టు లెక్క తేలుతోంది. టీచర్ల రేషనలైజేషన్‌ తర్వాత ఖాళీ పోస్టులపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. 


నాలుగేళ్లుగా టెట్‌ లేదు

తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్రంలో తొలి టెట్‌... 2016 మే 22న జరిగింది. ఇందులో భాగంగా పేపర్‌-1కు 88,158 మంది హాజరు కాగా, 48,278 మంది పాసయ్యారు. పేపర్‌-2ను 2,51,924 మంది రాయగా, 63,079మంది పాసయ్యారు. రెండో టెట్‌... 2017 జూలై 23న జరిగింది. పేపర్‌-1ను 98,848 మంది రాయగా, 56,708 మంది పాసయ్యారు. పేపర్‌-2ను 2,30,932 మంది రాయగా 45,045 మంది పాసయ్యారు. అప్పటి నుంచి నాలుగే ళ్లుగా రాష్ట్రంలో టెట్‌ను నిర్వహించలేకపోవడం వల్ల డీఎడ్‌, బీఎడ్‌ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం టెట్‌కి జీవిత కాల పరిమితి ఇచ్చారు. కానీ, నూతన అభ్యర్థులతో పాటు, గతంలో టెట్‌లో ఉత్తీర్ణత సాధించని వారు లక్షల్లో ఉన్నారు. పైగా ప్రైవేట్‌ పాఠశాలల్లో బోధించాలంటే టెట్‌లో తప్పనిసరిగా ఉత్తీర్ణత సాధించాల్సి ఉంంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని వెంటనే టెట్‌ను నిర్వహించాలన్న డిమాండ్‌ వ్యక్తమవుతోంది.


వెంటనే భర్తీ చేయాలి 

రాష్ట్రంలోని ఖాళీ టీచర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఈ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. వీరిల్లో కొందరి వయో పరిమితి కూడా దాటి పోతోంది. ఇతర విభాగాల్లోని ఖాళీల భర్తీతోపాటే... టీచర్‌ పోస్టులకూ నోటిఫికేషన్‌ ఇవ్వాలి.

- రామ్మోహన్‌రెడ్డి, బీఎడ్‌ అభ్యర్థుల సంఘం అధ్యక్షుడు



టీచర్ల సంఖ్యను కుదించి బడుల మూసివేతకు కుట్ర: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

రాంనగర్‌(ఆంధ్రజ్యోతి): టీచర్ల సంఖ్యను కుదించి ప్రభుత్వ పాఠశాలల మూసివేతకు రాష్ట్ర సర్కారు కుట్ర చేస్తోందని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్‌ చక్రధర్‌, కార్యదర్శి ప్రొఫెసర్‌ హరగోపాల్‌ ఆరోపించారు. వేల సంఖ్యలో టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నా, ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా జారీ చేయలేదన్నారు. ఆదివారం హిమాయత్‌నగర్‌లోని బీసీ భవన్‌లో రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశానికి ముఖ్యఅతిథులుగా హాజరైన చక్రధర్‌, హరగోపాల్‌ మాట్లాడారు. నిరుద్యోగులు ఈ విషయంలో ఎన్ని ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆన్‌లైన్‌ క్లాసుల పేరుతో విద్యార్థుల భవిష్యత్‌ను అంధకారం చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలల మూసివేత కాకుండా, వాటిని బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. కరోనా సాకుతోనూ రాష్ట్ర సర్కారు ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల మూసివేత పరంపర కొనసాగుతోందని విమర్శించారు.

Updated Date - 2021-11-01T14:04:58+05:30 IST