పరిహారం అందేదెప్పుడు?

ABN , First Publish Date - 2022-09-25T03:59:12+05:30 IST

ఇండ్లు, భూములు కోల్పోయి 9 ఏండ్లు గడుస్తున్నా పరిహారం కోసం పడిగాపులు తప్పడం లేదు. కరెంటు కోతలతోపాటు త్రిఫేజ్‌ సరఫరా లేకపోవడంతో తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కళ్యాణిఖని మెగా ఓసీపీ పేలుళ్లకు ఇండ్లు నేలకూలుతున్నాయి. పరిహారం చెల్లించకపోవడంతో దుబ్బగూడెం భూనిర్వాసితుల పాలిట శాపంగా మారింది.

పరిహారం అందేదెప్పుడు?
కేకే ఓసీపీ కార్యాలయం వద్ద నిరసన తెలుపుతున్న భూనిర్వాసితులు (ఫైల్‌)

ఏండ్లు గడుస్తున్నా ఎదురుచూపులే 

అవస్థల్లో దుబ్బగూడెం వాసులు 

ప్రారంభానికి నోచుకోని పునరావాస కాలనీ 

పట్టించుకోని అధికారులు 

కాసిపేట, సెప్టెంబరు 24: ఇండ్లు, భూములు కోల్పోయి 9 ఏండ్లు గడుస్తున్నా పరిహారం కోసం పడిగాపులు తప్పడం లేదు. కరెంటు కోతలతోపాటు త్రిఫేజ్‌ సరఫరా లేకపోవడంతో తాగునీటికి ప్రజలు  ఇబ్బందులు పడుతున్నారు.  కళ్యాణిఖని మెగా ఓసీపీ పేలుళ్లకు ఇండ్లు నేలకూలుతున్నాయి. పరిహారం చెల్లించకపోవడంతో దుబ్బగూడెం భూనిర్వాసితుల పాలిట శాపంగా మారింది. సాగు భూములను ఓసీపీకి అప్పగించి ఉపాధి లేక యువకులు పట్టణాల్లో అడ్డా కూలీలుగా మారారు. 2013లో ప్రారంభమైన కళ్యాణిఖని మెగా ఉపరితల గనికి సాగు భూములు, ఇండ్లను అప్పగించి నిరాశ్రయులుగా మారారు. ఇప్పటి వరకు పరిహారం చెల్లింపులో అధికారుల నిర్లక్ష్యంతో నిర్వాసితులు తీవ్ర ఇబ్బం దులు పడుతున్నారు.  

కాసిపేట, మందమర్రి మండలాల సరిహద్దులో సింగరేణి యాజమాన్యం చేపట్టిన కళ్యాణిఖని మెగా ఉపరితల గనిని 2013లో అధికారికంగా ప్రకటించి పనులు ప్రారంభించింది. సాగు భూములకు అరకొర నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్న అధికారులు ఇండ్లను కోల్పోతున్న దుబ్బగూడెం నిర్వాసితులకు మొండి చేయి చూపించారు. ఓసీపీని వ్యతిరేకిస్తూ దుబ్బగూడెం ప్రజలు చేసిన ఒంటరి పోరాటానికి సింగరేణి యాజమాన్యం తలొగ్గక తప్పలేదు. 2015లో ఓసీపీలో ముంపునకు గురవుతున్న ఇండ్లను గుర్తించి నష్టపరిహారం చెల్లిస్తామని యాజమాన్యం ప్రకటించింది. పరిహారం చెల్లింపులో అధికారులు చేస్తున్న నిర్లక్ష్యం వల్ల భూనిర్వాసితులు ఆందోళన చెందుతున్నారు. దుబ్బగూడెంలో 203 ఇండ్లు ముంపునకు గురవుతు న్నట్లు సింగరేణి యాజమాన్యం అధికారికంగా గుర్తించింది. పెద్దనపల్లి పంచాయతీ శివారులో పునరావాస కాలనీ నిర్మించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఇందులో 203 ఇండ్లతో పాటు 18 ఏండ్లు పైబడిన మరో 201 మంది యువకులను గుర్తించి 404 ఇండ్లు నిర్మించేందుకు యాజమాన్యం చర్యలు చేపట్టింది. ఉపరితల గని నిర్మాణానికి సింగరేణి యాజమాన్యం పనులను చేపట్టడంతో కొందరు దళారులు 50కి పైగా  ఇండ్లను నిర్మించి నష్టపరిహారం చెల్లించాలని ఆందోళనకు దిగారు. అధికారులు, బడా నాయకుల అండదండలతో ఇండ్లను సైతం ఎంజాయ్‌ మెంట్‌ సర్వేలో పేర్లు నమోదు చేసుకున్నారు. దీంతో ఇటీవల సింగరేణి యాజమాన్యం వీటికి సైతం నష్టపరిహారం ఇచ్చేందుకు సూచన ప్రాయంగా అంగీకరించింది. 

నష్టపరిహారం చెల్లింపులో తీవ్ర జాప్యం 

సింగరేణి, రెవెన్యూ అధికారులు దుబ్బగూడెం నిర్వాసిత గ్రామంలో   సర్వేల పేరుతో కాలయాపన చేశారు. భూనిర్వాసితుల ఇంటికి ఎస్సీ, ఎస్టీలకు రూ.8.10 లక్షలు కాగా, బీసీలకు రూ.7.50 లక్షలు చెల్లించను న్నట్లు అధికారులు ఇటీవల నోటీసు విడుదల చేశారు. కొత్త భూసేకరణ చట్టం ద్వారా లబ్ధిదారులకు ఇటీవల పత్రాలు అందజేశారు. సర్వేలు పూర్తయి మూడేండ్లు గడుస్తున్నా నష్టపరిహారం చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని నిర్వాసితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాగునీటికి తప్పని తిప్పలు 

కాలమేదైనా దుబ్బగూడెం వాసులకు తాగునీటికి తిప్పలు తప్పడం లేదు. ఉపరితల గని ఏర్పాటు వల్ల చేద బావులు, చేతి పంపుల్లో నీరు అడుగంటి పోయాయి. ఓవర్‌హెడ్‌ట్యాంకు నీటిని మళ్లించి తాగునీటిని సరఫరా చేస్తున్నారు. దుబ్బగూడెం గ్రామానికి ఇటీవల అధికారులు విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. దీంతో విద్యుత్‌ లేక తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటి వరకు ఐదు సార్లు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలపడంతో త్రీఫేజ్‌ విద్యుత్‌ను పునరుద్దరించారు. తాత్కాలికంగా విద్యుత్‌ను పునరుద్దరించినప్పటికీ తాగునీటి కష్టాలు తప్పడం లేదు. 

ప్రారంభానికి నోచుకోని పునరావాస కాలనీ 

కేకే ఓసీపీలో ముంపునకు గురవుతున్న దుబ్బగూడెంకు పునరావాసం కోసం ఏర్పాటు చేసిన స్థలంలో అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టలేదు. కేకే ఓసీపీ పేలుళ్ళకు దుబ్బగూడెంలోని 14 ఇండ్లు నేలకూలాయి. మరికొన్ని ఇండ్లు బీటలు వారి ప్రమాదకరంగా మారాయి.  పెద్దనపల్లి శివారులో 32 ఎకరాల భూమిని సింగరేణి యాజమాన్యం కొనుగోలు చేసింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి పనులు చేపట్టకపోవ డంతో పగుళ్లు తేలిన ఇండ్లలో ప్రజలు కాలం వెళ్లదీస్తున్నారు.

నష్టపరిహారం వెంటనే చెల్లించాలి 

గోనెల శ్రీనివాస్‌, భూనిర్వాసిత కమిటీ చైర్మన్‌, దుబ్బగూడెం  

ఓసీపీ కోసం భూములు, ఇండ్లను కోల్పోయిన వారికి ఇప్పటి వరకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ఓసీపీ నుంచి వచ్చే దుమ్ముధూళితో ఇబ్బందులు పడుతున్నాం. వ్యవసాయ భూములు కోల్పోవడంతో అడ్డా కూలీలుగా మారాం. ఉపాధి కోల్పోయిన భూనిర్వాసిత యువకులకు వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి. కేకే ఓసీపీలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. 

పునరావాస కాలనీ పనులను ప్రారంభిస్తాం 

చింతల శ్రీనివాస్‌, జనరల్‌ మేనేజర్‌, మందమర్రి

లే అవుట్‌ కాలనీలో రెవెన్యూ అధికారులు సర్వే పూర్తి చేసి అప్పగించిన వెంటనే పనులను ప్రారంభిస్తాం. ఏడాదిలోగా ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. నష్టపరిహారం చెల్లింపులో నోట్‌ఫైల్‌ అప్రూవల్‌ అయ్యింది. అతి త్వరలో రెవెన్యూ శాఖకు నష్టపరిహారం అప్పగిస్తాం. ప్రజలు ఆందోళన చెందవద్దు.

ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం 

శ్యామలాదేవి, బెల్లంపల్లి ఆర్డీవో  

దుబ్బగూడెం నిర్వాసిత గ్రామంలో సర్వేలు పూర్తి చేసి నివేదికలను ప్రభుత్వానికి అందజేశాం. బడ్జెట్‌లో నిధులు కేటాయించి నష్టపరిహారాన్ని సాధ్యమైనంత త్వరగా నిర్వాసితులకు అందజేస్తాం. అర్హులైన భూనిర్వాసితులందరికి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నాం. పునరావాస కాలనీ సర్వే పనులను పూర్తి చేశాం. ఈ యేడాది కాలనీ నిర్మాణ పనులను చేపడతాం.  

 

Updated Date - 2022-09-25T03:59:12+05:30 IST