రక్షణగోడ నిర్మాణమెప్పుడో?

ABN , First Publish Date - 2022-08-11T04:23:56+05:30 IST

మేము అధికారంలోకి రాగానే రైల్వేకోడూరు రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాం... ప్రజల కష్టాలన్నీ తొలగిస్తామని చెప్పిన పాలకులు అధికారంలోకి రాగానే మా గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.

రక్షణగోడ నిర్మాణమెప్పుడో?
వరదల్లో కుప్పకూలిన ఇల్లు

ఏటా వరదల్లో స్థానికుల ఇబ్బందులు 

ఎన్నికల హామీలు గాలికి


రైల్వేకోడూరు రూరల్‌, ఆగస్టు 10: మేము అధికారంలోకి రాగానే రైల్వేకోడూరు రూపురేఖలను పూర్తిగా మార్చేస్తాం... ప్రజల కష్టాలన్నీ తొలగిస్తామని చెప్పిన పాలకులు అధికారంలోకి రాగానే మా గురించి పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. రైల్వేకోడూరుకు ఇరువైపులా గుంజనేరు, ముష్టేరు వంకలు ఉన్నాయి. భారీ వర్షాలతో పాటు వరదలు వస్తే ముష్టేరు వద్ద ఉన్న కొత్త కోడూరు, గుంజనేరు వద్ద ఉన్న నరసరాంపేట స్థానికులు భయంతో నిద్రలేని రాత్రులు గడిపే పరిస్థితి ఉంది. 2014లో కురిసిన భారీ వర్షాలకు అప్పట్లో ఇళ్లు దెబ్బతిన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్థానిక నాయకులతో కలిసి ఇళ్లను పరిశీలించారు. వెంటనే ఇరిగేషన్‌ అధికారులకు రక్షణ గోడ నిర్మించాలని ఆదేశాలు జారీ చేశారు. అధికారులు వెంటనే రైల్వేకోడూరు చుట్టుపక్కల వంకలను పరిశీలించి విద్యానగర్‌, గుంజనేరు, ముష్టేరు వద్ద రక్షణ గోడ నిర్మాణానికి నివేదికలు పంపారు. ప్రభుత్వం రక్షణ గోడ నిర్మాణానికి జీవో కూడా జారీ చేసింది. ముష్టేరు కొత్తకోడూరు వద్ద రూ.20 కోట్లు, విద్యానగర్‌ వద్ద ఉన్న రక్షణగోడకు రూ.14 కోట్లు వెచ్చించి టీడీపీ ప్రభుత్వంలో పూర్తి చేశారు. గుంజనేరు రక్షణగోడకు రూ.27 కోట్లు మంజూరయ్యాయి. నిర్మాణం పనులు మొదలయ్యేలోపే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టీడీపీ ప్రతిపాదించిన పనులను పూర్తిగా రద్దు చేసింది. గుంజనేరుకు రక్షణగోడ లేకపోవడంతో గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు గుంజనేరు నరసరాంపేట వద్ద ఉన్న పది ఇళ్లు పూర్తిగా నేలమట్టమయ్యాయి. స్థానిక ప్రజాప్రతినిధులు పరిశీలించి ఇల్లు కోల్పోయిన బాధితులకు ఇంటి పట్టా మంజూరు చేస్తామని, వెంటనే రక్షణగోడ నిర్మిస్తామని హామీ ఇచ్చి ఏడాది అవతుఉన్నా పనులు ఇంకా మొదలు కాలేదు. ఇళ్లు కోల్పోయిన బాధితులకు రూ.95 వేలు నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించింది. అయితే కొంతమందికే నష్టపరిహారం అందించారని పలువురు బాధితులు వాపోతున్నారు. రానున్న వర్షాకాలంలో ఏమి జరుగుతుందోనని నరసరాంపేటవాసులు ఆందోళన చెందుతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే రక్షణగోడ నిర్మించాలని కోరుతున్నారు.


సర్వం కోల్పోయాం...

- పి.సుబ్బమ్మ

గత ఏడాది వచ్చిన వరదల్లో ఇల్లు పూర్తిగా కోల్పోయి దిక్కుతోచని స్థితిలో ఉన్నాము. ప్రజాప్రతినిధులు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఇంటి పట్టా మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పారు. ఇప్పటికీ ప్రభుత్వం నష్టపరిహారం రాలేదు, ఇంటి ప్టా కూడా ఇవ్వలేదు. కొంతమందికి నష్టపరిహారం అందింది. నాకు మాత్రం ఇవ్వలేదు. ప్రస్తుతం బాడుగ ఇంట్లో కాలం గడుపుతున్నా. వెంటనే ఇంటి పట్టా మంజూరు చేసి ఇల్లు నిర్మించి ఇవ్వాలి.


ప్రహరీ పనులను వెంటనే మొదలు పెట్టాలి

- నార్జల హేమరాజ్‌, మాజీ ఉప సర్పంచ్‌ 

గుంజనేరు రక్షణగోడ పనులను వెంటనే మొదలు పెట్టాలి. టీడీపీ ప్రభుత్వంలో పట్టణంలో రెండు రక్షణగోడలను రూ.34 కోట్లతో నిర్మించారు. వైసీపీ అధికారంలోకి రాగానే మండలంలో ఎటువంటి ఇరిగేషన్‌ పనులు మొదలుపెట్టలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రజాప్రతినిధులు నిలబెట్టుకోవాలి. వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందించిన నష్టపరిహారంలో అవకతవకలు జరిగాయని విమర్శలు ఉన్నాయి. గుంజనేరు వరదల్లో ఇల్లు కోల్పోయిన బాధితులకు ప్రభుత్వం ఇంటి పట్టాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలి. 


ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది

- చెంగల్‌రాయుడు, డీఈ, ఇరిగేషన్‌

గుంజనేరు రక్షణగోడకు రాష్ట్ర ప్రభుత్వం 37 కోట్ల రూపాయల నిధులు గత నెలలో మంజూరు చేసింది. అన్ని నివేదికలు అందిన వెంటనే ఆన్‌లైన్‌ టెండర్‌ ప్రక్రియ మొదలు పెట్టి త్వరలో పనులు చేపడతాము. పట్టణంలోని నరసారాంపేట, గాంధీనగర్‌ వద్ద పనులు పూర్తి చేస్తాం. వరదల్లో నష్టపోయిన బాధితులకు ప్రభుత్వం అందించిన  నష్టపరిహారంలో అవకతవకలు జరిగి ఉంటే విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.



Updated Date - 2022-08-11T04:23:56+05:30 IST