‘విద్యాకానుక’ పంపిణీ ఎప్పుడో?

ABN , First Publish Date - 2021-06-12T04:18:01+05:30 IST

‘విద్యాకానుక’ పంపిణీ ఎప్పుడో?

‘విద్యాకానుక’ పంపిణీ ఎప్పుడో?
విద్యార్థులకు అందజేయాల్సిన నమూనా విద్యాకానుక కిట్లు ఇదే..

- జిల్లాకు చేరని పూర్తి స్థాయి కిట్లు

- కరోనా సాకుతో సరఫరా చేయని వైనం

- త్వరలో పాఠశాలల పునఃప్రారంభం

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించే జగనన్న విద్యాకానుక కిట్లు   పూర్తిస్థాయిలో జిల్లాకు చేరలేదు. కొన్ని స్కూల్‌ కాంప్లెక్స్‌లకు కేవలం యూనిఫారాల క్లాత్‌లు, నోట్‌ పుస్తకాలు మాత్రమే చేరాయి. మిగతా సామగ్రి ఎప్పుడు చేరుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. కరోనా సాకుతో విద్యాకానుక కిట్లను జిల్లాకు సరఫరా చేయడంలో తాత్సారం చేస్తున్నారు. త్వరలో విద్యాసంవత్సరం ప్రారంభం కానుంది. అప్పటిలోగా విద్యా కానుకలు పంపిణీ చేస్తారో? లేదోనన్న సందేహం నెలకొంది. జిల్లాలో ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు 3,272 ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రస్తుత ఏడాది 2,74,509 మంది విద్యార్థులు ఉన్నారు. ఇందులో బాలురు 1,35,222 మంది, బాలికలు 1,39,287 మంది ఉన్నారు. గత ఏడాది జిల్లాలో మొత్తం 2,49,405 కిట్లను విద్యార్థులకు పంపిణీ చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో 2,74,509 కిట్లు అవసరం. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది అదనంగా 25వేలకు పైగా కిట్లు అవసరం. విద్యాశాఖ, సర్వశిక్ష అభియాన్‌ (ఎస్‌ఎస్‌ఏ) ఆధ్వర్యంలో విద్యాకానుక కిట్లు పంపిణీ చేయాల్సి ఉంది. ప్రతి కిట్‌లో మూడు జతల యూనిఫారాల క్లాత్‌, ఒక జత నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, ఒక బెల్టు, ఓ బ్యాగ్‌ ఉంటుంది. ప్రతి ఏడాది జూన్‌ నెలలోగా విద్యార్థులకు వీటిని పంపిణీ చేస్తారు. కానీ, ఈ ఏడాది ఇంతవరకు ఒక్క పాఠశాలకు కూడా కిట్లు చేరలేదు. టెక్కలి డివిజన్‌ పరిధిలోని ఒకటో తరగతి నుంచి 8వ తరగతి విద్యార్థుల కోసం ఇచ్ఛాపురం, కవిటి, సోంపేట, కంచిలి, పలాస, వజ్రపుకొత్తూరు, మందస మండల కేంద్రాల్లోని స్కూల్‌ కాంప్లెక్స్‌లకు కేవలం యూనిఫారాల క్లాత్‌లు మాత్రమే చేరాయి. 

 - శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఎచ్చెర్ల ఆమదాలవలస మండలాలకు నోట్‌ పుస్తకాలు చేరాయి. మిగిలిన సామగ్రి ఎప్పుడు చేరుతుందో అధికారులకే స్పష్టత లేదు. ఎందుకంటే గతంలో మాదిరిగా కిట్లు స్థానిక అధికారులకు కాకుండా జిల్లా విద్యాశాఖ పెట్టిన ఇండెంట్‌ ప్రకారం కాంట్రాక్టర్‌ నేరుగా మండల కేంద్రాల్లోని స్కూల్‌ కాంప్లెక్స్‌లకు చేరవేస్తున్నారు. 


ముందుకురాని ఉపాధ్యాయులు

ఈ నెలలోనే విద్యా సంవత్సరం ప్రారంభం కావాల్సి ఉన్నా.. కర్ఫ్యూ కారణంగా పాఠశాలలు తెరచుకోలేదు. విద్యాకానుక కిట్లను మాత్రం విద్యార్థులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో ఏజెన్సీ మండలాల్లో కొన్ని పాఠశాలలకు విద్యాకానుక కిట్లు సరఫరా చేసినా, వాటిని విద్యార్థులకు అందించలేదు. కొవిడ్‌ కారణంగా కిట్లను పంపిణీ చేసేందుకు ఉపాధ్యాయులు ముందుకు రావడం లేదు. గత ఏడాది టెక్కలి, సీతంపేట ఐటీడీఏ పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు ఒకే కాలి బూట్లు పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. పలువురు విద్యార్థులకు యూనిఫారాలు ఇచ్చినా కుట్టు కూలి పంపిణీ చేయలేదు. ఈసారి అటువంటి ఇబ్బందులు పునరావృతం కాకుండా విద్యార్థులకు కిట్లు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


ప్రణాళిక సిద్ధం చేశాం..

కరోనా కారణంగా ఈ ఏడాది పాఠశాలలకు విద్యాకానుక కిట్లను చేరవేయడంలో కొంత జాప్యమైంది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి అన్ని పాఠశాలలకు కిట్లు సరఫరా చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేశాం. ఇప్పటికే  యూనిఫారాల క్లాత్‌, నోట్‌ పుస్తకాలు వంటివి కాంట్రాక్టర్లు నేరుగా మండలాలకు పంపుతున్నారు. పాఠశాలల ప్రారంభం నాటికి వాటిని  స్థానిక మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు పంపిణీ చేస్తాం.

- పైడి వెంకటరమణ, పీడీ, సర్వశిక్ష అభియాన్‌, శ్రీకాకుళం

  

Updated Date - 2021-06-12T04:18:01+05:30 IST