దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?

ABN , First Publish Date - 2022-05-13T08:37:50+05:30 IST

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది.

దర్యాప్తు ఎప్పుడు పూర్తి చేస్తారు?

  • మీకింకా ఎంతసమయం కావాలి?
  • వివేకా కేసులో సీబీఐకి హైకోర్టు ప్రశ్న
  • నిందితుల బెయిల్‌ పిటిషన్లపై విచారణ
  • శివశంకర్‌రెడ్డికి బెయిల్‌ ఇవ్వొద్దు
  • జైల్లో ఉండే సాక్షులకు బెదిరింపులు
  • సీబీఐ, సునీత తరఫు లాయర్ల వాదనలు


అమరావతి,  మే 12 (ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు పూర్తి చేసేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పాలని సీబీఐని హైకోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు కారణంగా నిందితులను మరింతకాలం జ్యుడీషియల్‌ కస్టడీలో ఉంచలేమని పేర్కొంది. దిగువ కోర్టులో రెండో చార్జిషీట్‌ దాఖలు చేసిన తరువాత దర్యాప్తు పురోగతిపై వివరాలు సమర్పించాలని సీబీఐని ఆదేశించింది. సీబీఐ అందజేసిన వివరాల ఆధారంగా వాదనలు వినిపించాలని పిటిషనర్లకు స్పష్టం చేసింది. విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి గురువారం ఆదేశాలిచ్చారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులు సునీల్‌ యాదవ్‌(ఏ2), గజ్జల ఉమాశంకర్‌రెడ్డి(ఏ3), డీ శివశంకర్‌రెడ్డి(ఏ5)ని సీబీఐ అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. వారు బెయిల్‌ కోసం పిటిషన్లు వేశారు. గురువారం ఈ వ్యాజ్యాలు  విచారణకు వచ్చాయి. దేవిరెడ్డి శివశంకర్‌ రెడ్డి తరఫున సీనియర్‌ న్యాయవాది టీ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌ గత ఆరునెలలుగా జైల్లోనే ఉన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి ఇప్పటికే రెండు చార్జిషీట్లు దాఖలు చేసింది. అప్రూవర్‌గా మారిన దస్తగిరి (ఏ4) వాంగ్మూలం తప్ప హత్య విషయంలో పిటిషనర్‌ ప్రమేయం ఉన్నట్లు ఎలాంటి ఆధారాలు లేవు. ఎలాంటి షరతులు విధించినా అభ్యంతరం లేదు. పిటిషనర్‌కి బెయిల్‌ మంజూరు చేయండి’’ అని కోరారు. 


న్యాయమూర్తి స్పందిస్తూ, దర్యాప్తు ఎంతకాలం కొనసాగుతుందని సీబీఐని ప్రశ్నించారు. హత్య కేసులో మరో నిందితుడు గంగిరెడ్డి (ఏ1) బెయిల్‌ పై ఉన్నారని, నిందితుల వ్యక్తిగత స్వేచ్ఛని పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. దర్యాప్తును కొనసాగించేందుకు అపరిమిత సమయం ఇవ్వలేమని స్పష్టం చేశారు. బెయిల్‌పై నిర్ణయం తీసుకొనే సమయంలో వివేకా కుమార్తె సునీత ఆందోళనను తాము పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీబీఐ తరఫు న్యాయవాది ఎ.చెన్నకేశవులు వాదనలు వినిపిస్తూ.... దస్తగిరి(ఏ4) ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా వివేకా హత్య విషయంలో శివశంకర్‌ రెడ్డి ప్రమేయం నిర్ధారణ అయిందన్నారు. ‘‘వివేకా హత్య జరిగిన అనంతరం సాక్ష్యాలు చెరిపివేయడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. హత్యలో ఎవరు పాల్గొన్నారనే విషయంపై స్పష్టత వచ్చింది. ఈ వ్యవహారంలో భారీ కుట్రదాగి ఉంది. దేవిరెడ్డిపై ప్రాథమికంగా రెండు చార్జిషీట్లు దాఖలు చేశాం. దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది’’ అని వివరించారు. శివశంకర్‌ రెడ్డిపై హత్య, హత్యాయత్నం, మహిళల గౌరవానికి భంగం కలిగించడం వంటి 31 కేసులు ఉన్నాయన్నారు. అరెస్ట్‌ అయిన దగ్గర నుంచి సాక్షులను బెదిరిస్తూ కేసు దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.


 సీబీఐ అధికారుల డ్రైవర్‌ను గుర్తు తెలియని వ్యక్తి బెదిరించిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. వివేకా కుమార్తె సునీత తరఫు న్యాయవాది గూడపాటి వెంకటేశ్వర్లు వాదనలు వినిపిస్తూ.. ‘‘శివశంకర్‌రెడ్డి జైల్లో ఉంటూనే సాక్షులను బెదిరిస్తున్నారు. హత్యలో అతని ప్రమేయం బలంగా ఉన్నట్లు సీబీఐ దాఖలు చేసిన రెండో చార్జిషీట్‌ ద్వారా స్పష్టమవుతోంది. సాక్ష్యం ఇవ్వడానికి ముందు అంగీకరించి.. మేజిస్ట్రేట్‌ ముందుకు వెళ్లినప్పుడు నిరాకరించారు. కేసు దర్యాప్తులో రాష్ట్ర పోలీసులు.. సీబీఐకి సహకరించడం లేదు. దర్యాప్తు పూర్తి అయ్యి, హత్యవెనుక కుట్రదారులు ఎవరో తేలేవరకు నిందితులకు బెయిల్‌ మంజూరు చేయవద్దు. క్రూరమైన హత్య ఘటనలో నిందితులకు బెయిల్‌ ఇవ్వడానికి వీల్లేదు. బెయిల్‌ పిటిషన్లు కొట్టి వేయాలి’’ అని కోరారు. నిందితుడు గజ్జల ఉమాశంకరెడ్డి తరఫున న్యాయవాది చిదంబరం వాదనలు వినిపించారు. ‘‘పిటిషనర్‌ గత ఏడున్నర నెలలుగా జైల్లో ఉన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీట్‌ దాఖలు చేసిన దరిమిలా బెయిల్‌ మంజూరు చేయాలి’’ అని కోరారు. మరో నిందితుడు సునీల్‌ యాదవ్‌ తరఫు న్యాయవాది కూడా వాదనలు వినిపించారు. అన్ని వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి...కేసు దర్యాప్తును ఎప్పటిలోగా పూర్తి చేస్తారో చెప్పాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.

Read more