ఈ అవినీతికి అంతమెప్పుడు?

ABN , First Publish Date - 2022-02-22T09:21:27+05:30 IST

అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన భారతీయ నౌకా నిర్మాణ సంస్థ ఎబిజి షిప్‌యార్డ్. గత 16 సంవత్సరాలలో ఈ సంస్థ 165 నౌకలను నిర్మించింది. వీటిలో 46 ఓడలను...

ఈ అవినీతికి అంతమెప్పుడు?

అంతర్జాతీయంగా ప్రసిద్ధి పొందిన భారతీయ నౌకా నిర్మాణ సంస్థ ఎబిజి షిప్‌యార్డ్. గత 16 సంవత్సరాలలో ఈ సంస్థ 165 నౌకలను నిర్మించింది. వీటిలో 46 ఓడలను ఎగుమతి చేసింది. అయితే 2008 ప్రపంచ ఆర్థిక మాంద్యం ఈ భారతీయ కంపెనీ అదృష్ట రేఖను దాదాపుగా చెరిపివేసింది. కొత్త నౌకలకు డిమాండ్ తగ్గిపోయింది. ఎబిజి క్రమంగా నష్టాలలోకి జారిపోయింది. ఈ కంపెనీ తీసుకున్న రుణాలను నికర నిరర్థక ఆస్తులుగా 2013లో వివిధ బ్యాంకులు ప్రకటించాయి. ఎబిజి పాల్పడిన అక్రమాలను నిర్ధారించి బహిర్గతం చేసేందుకై ఫోరెన్సిక్ ఆడిట్ (న్యాయసంబంధి లెక్కల తనిఖీ)కు ఆదేశించాలని రుణదాత బ్యాంకులు 2018లో మాత్రమే నిర్ణయం తీసుకున్నాయి. గ్లోబల్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఇవై)ని ఫోరెన్సిక్ ఆడిటర్‌గా నియమించారు. ఆ సంస్థ తన నివేదికను 2019 జనవరిలో నివేదించింది. భారీ అవకతవకలు, కుంభకోణం చోటు చేసుకున్నాయని ఆ నివేదిక స్పష్టంగా వెల్లడించింది. ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇవై నివేదిక అందిన తరువాత కూడా లీడ్ బ్యాంక్ ఐసిఐసిఐ మౌనంగా ఉండిపోయింది. ఎలాంటి చర్యకు పూనుకోలేదు.


రుణదాత బ్యాంకులలో ఒకటైన ఎస్‌బిఐ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) తన మొదటి ఫిర్యాదును 2019 నవంబర్‌లో చేసింది; రెండో ఫిర్యాదును మొదటి ఫిర్యాదు అనంతరం 8 నెలలకు 2020 ఆగస్టులో చేసింది. రెండో ఫిర్యాదు చేసిన ఏడాది అనంతరం 2021 ఆగస్టులో సిబిఐ దర్యాప్తునకు ఆదేశించారు. ఎబిజికి ఇచ్చిన రుణానికి ప్రాథమిక బాధ్యత వహించాల్సిన లీడ్ బ్యాంక్ ఐసిఐసిఐ మౌనంగా ఉండిపోవడమే కాకుండా ఎస్‌బిఐ సైతం ఇవై నివేదిక అందిన రెండున్నర సంవత్సరాలకు గానీ చర్యలకు పూనుకోలేదనేది స్పష్టమయింది. మరింత ముఖ్యమైన విషయమేమిటంటే ఐసిఐసిఐ ఇతర బ్యాంకుల అంతర్గత, బాహ్య ఆడిటర్లు ఎవరూ ఎబిజి నష్టాల్లో కూరుకుపోతున్న విషయాన్ని 2013 నుంచి 2019 దాకా కనిపెట్టలేకపోయారు. 


ఎబిజికి రుణాలు ఇచ్చిన ప్రధాన బ్యాంకులు అన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులే. ఐసిఐసిఐ బ్యాంకుతో పాటు ఎస్‌బిఐ, ఐడిబిఐ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మొదలైన 28 బ్యాంకులు ఎబిజికి రూ.22,842 కోట్ల మేరకు రుణాలిచ్చాయి. ఐసిఐసిఐ బ్యాంక్ 2018లో అప్రతిష్ఠపాలయింది. ఆ బ్యాంక్ సీఈఓ చందా కొచ్చర్ మనీ లాండరింగ్ (అక్రమ మార్గాల ద్వారా సంపాదించిన డబ్బును చెలామణీలోకి తీసుకురావడం)కు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. ఆమె భర్త దీపక్ కొచ్చర్‌కు విడియోకాన్ కంపెనీతో వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయి. ఆ కంపెనీకి ఐసిఐసిఐ బ్యాంక్ భారీ రుణాలను మంజూరు చేసింది. ఈ వ్యవహారంలో సీఈఓ చందా కొచ్చర్ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకున్నారని రుజువయింది. దీంతో ఆమెను సీఈఓ బాధ్యతల నుంచి తొలగించారు. ఈ కుంభకోణం కారణంగా ఎబిజిపై ఐసిఐసిఐ బ్యాంకు సకాలంలో తగు చర్యలు చేపట్టలేకపోయిందని పలువురు భావిస్తున్నారు.


బ్యాంకు అధికారులు రుణాలు తీసుకున్నవారితో ఈ విధంగా కుమ్మక్కవడం ప్రభుత్వరంగ బ్యాంకులలో సాధారణమైపోయింది. బ్యాంకుల ప్రయోజనాల కంటే తమ వ్యక్తిగత ప్రయోజనాలకే ప్రాధాన్యమివ్వడం వల్లే కుంభకోణాలు చోటుచేసుకుంటున్నాయనడంలో సందేహం లేదు. ఒక కంపెనీకి రూ.2000 కోట్లు రుణం మంజూరు చేసినందుకుగాను ప్రభుత్వరంగ బ్యాంకు సిఇఓ రూ.20 కోట్లు లంచం తీసుకునే అవకాశముంది. బ్యాంకు రూ.2000 కోట్లు కోల్పోతుండగా ఆ సిఇఓ రూ.20 కోట్ల లబ్ధి పొందుతాడు. ప్రభుత్వరంగ బ్యాంకు సిఇఓ ఒకరు ఏడాదికి రూ.2 కోట్ల వేతన భత్యాలు పొందుతాడు. బ్యాంకు మంజూరు చేసిన రూ.2000 కోట్ల రుణానికి రూ.20 కోట్ల మేరకు లంచం తీసుకోవడమంటే పది సంవత్సరాల వేతన భత్యాల మొత్తాన్ని ఒకేసారి ఆర్జించడమవుతుంది. ప్రైవేట్ బ్యాంకులలో పరిస్థితి మౌలికంగా భిన్నమైనది. ఇక్కడ ప్రైవేట్ బ్యాంకుల యజమాని ప్రయోజనాలు, ఆ బ్యాంకు ప్రయోజనాలు ఒకే విధంగా ఉంటాయి. వాటి మధ్య అవినాభావ సంబంధముంటుంది. ప్రైవేట్ బ్యాంకు లాభనష్టాలు ఇంచు మించు ఆ బ్యాంకు యజమాని లాభనష్టాలతో సమానంగా ఉంటాయి.


ఒక కంపెనీకి, అందునా ఆర్థిక స్థితిగతులు సజావుగా లేవని భావిస్తున్న వ్యాపార సంస్థకు రూ.2000 కోట్ల రుణం మంజూరు చేసేందుకుగాను ఏ ప్రైవేట్ బ్యాంక్ యజమానీ రూ.20 కోట్లు లంచంగా తీసుకోడు. అలా తీసుకోవడం జరిగేతే అనివార్యంగా రూ.1980 కోట్లు నష్టపోవలసి ఉంటుంది. బ్యాంకు ప్రయోజనాల కంటే స్వలాభాన్ని చూసుకోవడం వల్లే ప్రభుత్వరంగ బ్యాంకుల సిఈఓలు దివాలా అంచున ఉన్న కంపెనీలకు సైతం భారీ రుణాలు మంజూరు చేయడం కొనసాగుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వరంగ బ్యాంకుల్లో కుంభకోణాలు చోటుచేసుకోవడంలో ఆశ్చర్యమేముంది? గత కొద్ది సంవత్సరాలుగా ఈ తరహా కుంభకోణాలు మరింతగా పెరిగిపోయాయి. రాబోయే సంవత్సరాలలో కూడా అవి అదేవిధంగా చోటుచేసుకుంటాయనడంలో సందేహం లేదు.


ఈ వాస్తవాల దృష్ట్యా ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నిటినీ ప్రైవేటీకరణ చేయవలసిన సమయం ఆసన్నమయింది. ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలు చేపట్టితీరాలి. ఒక్క ఎస్‌బిఐని మినహా మిగతా ప్రభుత్వరంగ బ్యాంకులు అన్నిటినీ ప్రైవేటీకరించి తీరాలి. దేశవ్యాప్తంగా బ్యాంకులకు క్లియరింగ్ హౌసెస్ సేవలకు గాను ఎస్‌బిఐని ఉపయోగించుకోవాలి. అప్పుడు మాత్రమే ప్రభుత్వరంగ బ్యాంకులలో అవినీతిని ప్రక్షాళన చేయడం సాధ్యమవుతుంది. ప్రభుత్వరంగ బ్యాంకులలో పెరిగిపోయిన నిరర్థక ఆస్తులకు సీఈఓలను బాధ్యులను చేయడం కాకుండా ఆ బ్యాంకులలో అవినీతిని కూకటివేళ్లతో పెకలించివేసేందుకు ప్రభుత్వం దృఢసంకల్పంతో చర్యలు చేపట్టాలి. ఐసిఐసిఐ కుంభకోణంలో చందా కొచ్చార్ సీఈఓ బాధ్యతల నుంచి తొలగించినట్టు ప్రభుత్వరంగ బ్యాంకుల సీఈఓలను తొలగించినంత మాత్రాన అసలు లక్ష్యం నెరవేరదు. కొచ్చర్‌ను తొలగించిన తరువాత ఐసిఐసిఐ బ్యాంకు ఎబిజికి భారీ రుణాలు ఇవ్వలేదూ?


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2022-02-22T09:21:27+05:30 IST